హైదరాబాద్, సెప్టెంబర్ 11(నమస్తే తెలంగాణ) : చెరువులు, జలాశయాలను కబ్జాల నుంచి కాపాడేందుకు ఏర్పాటు చేసిన హైడ్రా(హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ)కు మరిన్ని అధికారాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలిసింది. నీటి వనరుల సమీప ప్లాట్లలో ఇకనుంచి ఇంటి అనుమతులు పొందాలంటే హైడ్రా నుంచి నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం(ఎన్వోసీ) తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులిచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం.
ఎక్కడైనా ఎఫ్టీఎల్, బఫర్జోన్ల పరిధిలో అక్రమ నిర్మాణాలు చేపడితే ఇంటి నంబరును రద్దుచేయడంతోపాటు కరెంటు, నల్లా కనెక్షన్లను కూడా తొలగించేందుకు ఉత్తర్వులు వెలువడతాయని తెలిసింది. ఇప్పటివరకు ఇంటి అనుమతుల కోసం ఉన్న టౌన్‌ప్లానింగ్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ దాని అధికారాలను ఎలాంటి చట్టబద్ధత లేని హైడ్రాకు అప్పగించాలని చూడడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
చట్టబద్ధంగా టౌన్‌ప్లానింగ్
సహజంగా ఇంటి అనుమతులు జారీచేసేందుకు మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో టౌన్‌ప్లానింగ్ పేరుతో చట్టబద్ధమైన వ్యవస్థ పనిచేస్తున్న విషయం విదితమే. అనుమతుల కోసం వచ్చే దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి, క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించిన తర్వాత అన్నీ సవ్యంగా ఉంటేనే ఈ విభాగం అనుమతుల కోసం సిఫారసు చేస్తుంది. టౌన్‌ప్లానింగ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన దరఖాస్తులకు మున్సిపల్ కమిషనర్లు అనుమతులు జారీచేస్తారు.
ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలోని చెరువులు, రిజర్వాయర్లు, కుంట లు, నాలాలు, ప్రభుత్వ స్థలాలు, అసైన్డ్ భూ ములు తదితర అంశాల సమగ్ర సమాచారం టౌన్‌ప్లానింగ్ విభాగం వద్ద నిక్షిప్తమై ఉన్నది. అంతేకాదు, గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన టీఎస్ బీపాస్ సింగిల్ విండో విధానంలో దరఖాస్తుదారులు ఎక్కడికీ తిరగకుండానే ఆన్లైన్ ద్వారా శీఘ్రగతిన అనుమతులు పొందే వీలున్నది. టౌన్‌ప్లానింగ్ విభాగం బఫర్‌జోన్, ఎఫ్టీఎల్ వంటి అంశాలను పరిశీలించిన తర్వాతే అనుమతులు జారీచేస్తుంది.
వారి బాధ్యత పోలీస్ శాఖకు?
కూల్చివేతల కోసం హైడ్రా పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో, ఇంటి అనుమతులకు హైడ్రా నుంచి ఎన్వోసీ పొందాలనడం విమర్శలకు తావిస్తున్నది. టౌన్‌ప్లానింగ్‌లో నిపుణులైన సివిల్ ఇంజినీర్లు, ఆర్కిటెక్ట్‌లు చేయాల్సిన పనులను పోలీసు శాఖ ఆధీనంలోకి తెస్తున్నారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బఫర్ జోన్లు, ఎఫ్టీఎల్ల నిర్ధారణ హైడ్రాకు ఎలా సాధ్యమని పలువురు ప్రశ్నిస్తున్నారు.
ఒకవేళ ఎఫ్టీఎల్, బఫర్జోన్ల నిర్ధారణ హైడ్రాకు అప్పగించాలంటే హైడ్రాలో టౌన్‌ప్లానింగ్ అధికారులను నియమించుకోవాల్సి ఉంటుంది. అంటే, కొత్త సీసాలో పాత సారా అన్న చందంగా ఇంతకాలం టౌన్‌ప్లానింగ్ విభాగంలో పనిచేసిన సిబ్బంది ఇకనుంచి హైడ్రా ఆధీనంలో పనిచేయాల్సి ఉంటుందని చెప్పవచ్చు. దీనివల్ల ప్రభుత్వం ఎలాంటి మార్పు ఆశిస్తున్నదో అంతుబట్టడంలేదు.
చట్టబద్ధత లేని సంస్థకు మరిన్ని అధికారాలా?
హైడ్రాకు అసలు చట్టబద్ధతే లేదని పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్న క్రమంలో దానికి మరిన్ని అధికారాలు కల్పిస్తుండడం చర్చనీయాంశమైంది. అక్రమంగా అనుమతులు జారీచేసే అధికారులపై చర్యలు తీసుకోవాల్సిందిపోయి దేశంలో ఎక్కడా లేనివిధంగా అనాధిగా వస్తున్న టౌన్‌ప్లానింగ్ వ్యవస్థనే నిర్వీర్యం చేసే దిశగా ప్రభుత్వం ఏర్పాట్లు చేయడం వివాదాస్పదమవుతున్నది. దీనివల్ల భవిష్యత్తులో ఇంటి అనుమతి కోసం వెళ్లేవారు హైడ్రా చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది.