Miss World | తెలంగాణ పర్యాటక ప్రమోషన్ , సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించడమే లక్ష్యంగా హైదరాబాద్ వేదికగా నిర్వహించిన మిస్ వరల్డ్ 2025 పోటీలు విజయవంతం కావడంపై పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హర్షం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి చొరవ, దిశానిర్దేశంతో అత్యంత ప్రతిష్టాత్మకమైన మిస్ వరల్డ్ వేడుకలను తెలంగాణలో ఘనంగా నిర్వహించడం గొప్ప విషయమన్నారు. మిస్ వరల్డ్ ఈవెంట్‌ను అపూర్వ విజయంగా నిలిపిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. మిస్ వరల్డ్ సంస్థ, పాల్గొన్న పోటీదారులు, అధికారులు, అవిశ్రాంతంగా శ్రమించిన బృందాలు, విభాగాలు సహాయకుల అసమానమైన అంకితభావం, సమన్వయంతో కృషి చేసిన వారికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.
అన్ని ప్రభుత్వ విభాగాలు సమగ్ర కార్యాచరణ, సమన్వయంతో నిర్విరామంగా కృషి చేయడం వల్లే ఈ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయిందని చెప్పారు. మీ అందరి సహకారంతో తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చెప్పగలిగామని పేర్కొన్నారు. సాంస్కృతిక వినిమయాన్ని ప్రోత్సహించే, తెలంగాణను ప్రపంచ స్థాయి గమ్యస్థానంగా నిలిపే అంతర్జాతీయ కార్యక్రమాలను నిర్వహించేందుకు తెలంగాణ సదా సమాయత్తంగా ఉంటుందని మంత్రి పునరుద్ఘాటించారు. ఇదే అంకిత భావంతో తెలంగాణ పర్యాటకాన్ని మరింత ప్రమోట్ చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. 2025 మిస్ వరల్డ్ విజేతకు మంత్రి జూపల్లి శుభాకాంక్షలు తెలిపారు.