Telangana | హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర వైద్యరంగంలో ‘పాలన’ గాడితప్పింది. ఉన్నతాధికారుల నిర్లక్ష్యం, అవినీతి, నిధుల లేమితో అస్తవ్యస్తంగా మారింది. డీపీహెచ్, డీఎంఈ, ఎన్హెచ్ఎం, టీజీఎంఎస్ఐడీసీ.. ఇలా ప్రతీ విభాగంలో వివాదాలు, సమస్యలు రాజ్యమేలుతున్నాయి. ఇంత జరుగుతున్నా వైద్యశాఖమంత్రి దామోదర రాజనర్సింహ సమీక్షలకే పరిమితం అవుతున్నారని, విమర్శలు వినిపిస్తున్నాయి.
గత ప్రభుత్వ హయాంలో ఓ వెలుగు వెలిగిన దవాఖానలు.. నేడు సౌకర్యాల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. ముఖ్యంగా గాంధీ, ఉస్మానియా, నిలోఫర్ అధ్వాన స్థితికి చేరుకుంటున్నాయి. గాంధీ దవాఖానలో అనేక విభాగాలకు గత నెల నాలుగు రోజులు నీటి సరఫరా ఆగిపోయింది. వైద్యులు సర్జరీలను వాయిదా వేశారు. బాత్ రూంలకు కూడా తాళాలు వేసిన దుస్థితి. నిలోఫర్‌లోనూ ఇదే పరిస్థితి. ఈ నెల మొదటివారంలో నీటి సరఫరా లేక రోగులు అవస్థలు పడ్డారు. 50కిపైగా సర్జరీలను వాయిదా వేశారు. ఇవి కేవలం ఉదాహరణలు మాత్రమే. సూపర్ స్పెషాలిటీ దవాఖానలతోపాటు జిల్లా దవాఖానల్లోనూ కనీస మౌలిక వసతులు లేక రోగులు అవస్థలు పడుతున్నారని ఫిర్యాదులు అందుతున్నాయి. పాలనాపరంగా ఫైళ్లు పెండింగ్ పడుతున్నాయని, పీకలమీదికి వచ్చిన తర్వాత హడావుడి చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. చివరికి ఉద్యోగుల మెడికల్ రీయింబర్స్మెంట్ సైతం నెలలపాటు ఆలస్యం అవుతుండటంతో ప్రభుత్వానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఇటీవల మహబూబ్‌నగర్, నల్లగొండ, ఖమ్మం మెడికల్ కాలేజీల్లో ర్యాగింగ్ ఘటనలు కలకలం సృష్టించాయి.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత డీపీహెచ్‌ను మార్చింది. రవీందర్ నాయక్‌కు పదవి కట్టబెట్టింది. ఆయన వ్యవహార శైలిపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు ఉన్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో వైద్యశాఖ పరిధిలో వర్క్ ఆర్డర్లు, డిప్యూటేషన్లు రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆ సమయంలో డీపీహెచ్ అవినీతికి పాల్పడ్డారంటూ ఆరోపణలు వచ్చాయి. విచారణ జరపాలని సీఎస్, హెల్త్ సెక్రటరీ, విజిలెన్స్, ఏసీబీకి ఫిర్యాదులు అందాయి. డీఎంహెచ్‌వో, సూపరింటెండెంట్‌తోపాటు డీపీహెచ్‌కు లంచం ఇచ్చానని ఓ నర్సి ఆరోపించారు. ఈ విషయంలో అధికారులు విచారణ జరిపినా నివేదిక బయటికి రాలేదు. జూలైలో సాధారణ బదిలీల్లో అవినీతి జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. నర్సులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేశారు. ఈ ఘటనలో విజిలెన్స్ విచారణ నిర్వహించి.. డీపీహెచ్తో పాటు ఏడుగురు అధికారులకు మెమో ఇచ్చారు. కొన్ని నెలలుగా పీహెచ్‌సీలపై పర్యవేక్షణ కొరవడింది. రాష్ట్రవ్యాప్తంగా పీహెచ్‌సీల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెర్లాలో చాలావరకు పనిచేయడం లేదు. కొన్నిచోట్ల డాక్టర్లు, స్టాఫ్ కుమ్మకై రికార్డు కాకుండా ట్యాంపరింగ్ చేస్తున్నట్టు చర్చ జరుగుతున్నది.
వానకాలం ప్రారంభం నుంచి వైద్యారోగ్య పరిభాషలో ‘సీజనల్ వ్యాధుల కాలం’ మొదలవుతున్నట్టే లెక్క. అనుభవాలు, అధ్యయనాల నివేదికల ప్రకారం ఏయే వ్యాధులు విజృంభించే అవకాశం ఉన్నదో ముందుగానే అంచనా వేసి, ముందస్తు ఏర్పాటు చేసుకోవడం ఆనవాయితీ. కానీ ఈసారి ప్రధాన దవాఖానల్లో మందుల కొరత వేధించింది. పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో డ్రగ్ సప్లయర్లు సరఫరా నిలిపివేశారు. కేంద్రం ఎన్హెచ్ఎం నిధులు మంజూరు చేయలేదని, అందుకే మందులు కొనడం లేదంటూ టీజీఎంఎస్ఐడీసీ వింత సమాధానం ఇచ్చింది.
ఈ ఏడాది ఎంబీబీఎస్ అడ్మిషన్ల విషయంలోనూ వైద్యశాఖ విఫలమైంది. ‘స్థానికత’ నిర్ధారణలో శాఖ అసమర్థత కారణంగా తెలంగాణ బిడ్డలు కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. ‘స్థానికత’ నిర్ధారించాలని ఇతర యూనివర్సిటీలు, సాంకేతిక విద్యాశాఖ నుంచి సైతం ప్రభుత్వానికి విజ్ఞప్తులు అందాయి. కానీ పట్టించుకోలేదు. చివరికి పీకలమీదికి వచ్చిన తర్వాత జూలై 19న తూతూమంత్రంగా జీవో-33 ఇచ్చారు. 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు తెలంగాణలో చదివిన వారిని మాత్రమే ‘స్థానికులు’గా గుర్తిస్తామని పేర్కొన్నది. దీంతో ఇతర రాష్ట్రాలోని మంచి విద్యాసంస్థల్లో చదివినవారు, ఉద్యోగరీత్యా తల్లిదండ్రుల బదిలీలు, ఇతర కారణాల వల్ల ఇంటర్ వేరే రాష్ట్రంలో చదివిన తెలంగాణ విద్యార్థులు స్థానికేతరులుగా మారిపోయారు. ఈ వ్యవహారంపై హైకోర్టులో 53 పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లాల్సి వచ్చింది. చివరికి పిటిషనర్లకు అడ్మిషన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. ఇప్పటికీ స్థానికతను నిర్ధారించేందుకు తెలంగాణ వైద్యశాఖ ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం విడ్డూరం.
అసలే పాలనలో వైఫల్యాలు వెంటాడుతుంటే.. ఉన్నతాధికారుల మధ్య విబేధాలు మరో తలనొప్పిగా మారాయి. హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తు, డీపీహెచ్ రవీందర్ నాయక్ మధ్య విభేదాలు ఉన్నాయని చర్చ జరుగుతున్నది. ఓసారి మంత్రి దామోదర దగ్గరికి పంచాయితీ చేరిందని చర్చ జరిగింది. మిగతా అధికారులది కూడా దాదాపు ఇదే పరిస్థితి అని తెలుస్తున్నది.
మంత్రి దామోదర మొదటి నుంచీ వైద్యశాఖపై పెద్దగా ఆసక్తి కనబరచలేదనే విమర్శలు ఉన్నాయి. ఆయనకు బలవంతంగా ఈ శాఖను కట్టబెట్టారని గుసగుసలు వినిపించాయి. దీనికి తగ్గట్టే కొన్ని నెలలపాటు ఆయన శాఖను పెద్దగా పట్టించుకోలేదు. లోక్‌సభ ఎన్నికలు ముగిసేదాకా పెద్దగా సమీక్షలు నిర్వహించలేదు. క్షేత్రస్థాయి పర్యటనలు సరేసరి. అన్ని వైపుల నుంచి విమర్శలు పెరగడం, సీఎం వరకు వ్యవహారం వెళ్లడంతో సమీక్షలు మొదలుపెట్టారని చెప్పుకుంటున్నారు. అప్పటి నుంచి ఆయన సమీక్షలకే పరిమితం అవుతున్నారని ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సమీక్షలు లోతుగా కూడా జరగడం లేదని అంటున్నారు. తరుచూ దవాఖానలకు వెళ్లి పరిశీలించి, సమస్యలను పరిష్కరిస్తే బాగుంటుందని కోరుతున్నారు.