హైదరాబాద్, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. నల్లపాడు స్టేషన్ పరిధి అంకిరెడ్డిపాలెం సమీపంలోని జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున ఆగి ఉన్న కారును ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది.
ఈ ఘటనలో రాష్ర్టానికి చెందిన ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. మృతిచెందిన వారిని సూర్యాపేటకు చెందిన సుశీల(64), వెంకయ్య(70), మహేశ్(28)గా గుర్తించారు. ప్రమాదం జరిగిన తర్వాత మృతదేహాలను స్థానిక జీజీహెచ్ మార్చురీకి తరలించినట్టు నల్లపాడు పోలీసులు తెలిపారు.
హైదరాబాద్, డిసెంబర్ 26 (నమస్తేతెలంగాణ): ఇల్లు కోల్పోయి రోడ్డున పడ్డ అమరావతికి చెందిన వృద్ధరైతు మంత్రితో తన గోడు చెప్పుకుంటూనే గుండెపోటుకు గురై ప్రాణాలు వదిలాడు. గుంటూరు జిల్లా మందడంలో శుక్రవారం ఈ విషాద ఘటన జరిగింది. రోడ్డు నిర్మాణంలో ఇల్లు కోల్పోయిన మందడం గ్రామానికి చెందిన రామారావు శుక్రవారం గ్రామసభకు హాజరైన మంత్రి నారాయణ ఎదుట గోడు వెళ్లబోసుకున్నాడు.
అమరావతికి తమ పొలాలు ఇచ్చినందుకు మీ ప్రభుత్వం ఇచ్చిన ప్లాట్లు వాగులో మునిగి పోయాయని వాపోయాడు. మీకు మా స్థలాలు ఇచ్చి బొచ్చెలు పట్టుకొని అడుక్కోవాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తంచేస్తుండగా హఠాత్తుగా కుప్పకూలాడు. అక్కడే ఉన్నవారు గమనించి సీపీఆర్ చేసి దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యలో కన్నుమూశాడు.