Forest Department | హైదరాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ): అటవీ శాఖలో ఇటీవల జరుగుతున్న ‘మార్పు’లు కలకలం సృష్టిస్తున్నాయి. ఉద్యోగులను బదిలీ చేయడం, మాతృశాఖలకు తిరిగి రమ్మనడం, కొత్తవారిని అవసరం ఉన్న శాఖలకు పంపడం నిరంతరం జరిగే ప్రక్రియే. అయితే, ఇందులో కొందరి జోక్యం మితిమీరడం, బదిలీల పేరు చెప్పి శాఖతో సంబంధంలేని కొందరు వసూళ్ల దందాకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అటవీ శాఖపై ఒకాయన పెత్తనం చెలాయిస్తున్నాడనే విమర్శలున్నాయి.
గతంలో ఎన్నడూ ఈ తరహా పద్ధతి లేదని చెప్తున్నారు. శాఖలోని అత్యంత కీలకమైన వ్యక్తికి సహాయకుడి హోదాలో వచ్చిన ఆయనను కలువనిదే ఏ పనీ జరగడంలేదని, ఆయనే సర్వమై ఫారెస్టు వ్యవస్థను నడిపిస్తున్నారని ఆ శాఖ వర్గాలు చెప్తున్నాయి. కీలక వ్యక్తి పేరు చెప్పి ఈయన సాగిస్తున్న అరాచకం అంతా ఇంతకాదు. ఇండియన్ ఫారెస్టు సర్వీసులో సుదీర్ఘ అనుభవం ఉన్న అధికారులను కూడా పిలిపించుకోవడం, గంటల తరబడి తన ముందు నిలబెట్టుకోవడం, ఏక వచనంతో పిలుస్తూ తానుచెప్పిన పని జరగాల్సిందే అంటూ హుకూం జారీచేయడం గమనార్హం. ఈ సహాయకుడు కీలక వ్యక్తి అండతో చెలరేగిపోతుండటం అటవీ శాఖను కుదిపేస్తున్నది.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదలైన మార్పుల్లో భాగంగా తొలుత ప్రభుత్వ స్థాయిలో కాకుండా.. డిపార్ట్మెంట్ స్థాయిలో ఉండే బదిలీలపై అటవీ శాఖలోని కీలక వ్యక్తి సహాయకుడి కన్నుపడింది. ఫిబ్రవరిలోనే బదిలీలు చేయడం ఎలా అన్నదానిపై కసరత్తు మొదలు పెట్టి బేరసారాలకు తెరతీశారు. అటవీ శాఖ ఉద్యోగులై ఉండి ఇతర శాఖల్లో పనిచేస్తున్నవారి వివరాలు తెప్పించాడు.
వారికి బదిలీలు ఎలా అన్నదానిపై కసరత్తు చేశారు. ప్రభుత్వ స్థాయిలో కాకుండా కేవలం కిందిస్థాయిలో పనులు చేయించుకోవడంపై దృష్టిపెట్టారు. ఇందులో భాగంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో డిప్యూటేషన్లపై ఉన్నవారిపై దృష్టిపెట్టారు. రెండేండ్లకుపైగా ఏదైనా శాఖలో డిప్యూటేషన్‌పై ఉంటే ఆ డిప్యూటేషన్‌ను రద్దు చేయాలని నిర్ణయించారు. వాస్తవానికి ఇది మంచిదే. కానీ, ఇదే అదనుగా ఆయా స్థానాల్లోకి వచ్చేవారితో, ఆ స్థానాల నుంచి బయటకు వెళ్లే అవకాశం ఉన్నవారిలో కొందరితో సహాయకుడు బేరసారాలు నడిపాడు.
ఇలాంటి పోస్టులకు రూ.5-10 లక్షలను వసూలు చేసేందుకు లక్ష్యాలు విధించుకోడం గమనార్హం. హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, ఫారెస్ట్ కాలేజీ, అకాడమీ.. ఇలా అనేక ప్రాంతాల్లో సుమారు 30 మందికిపైగా డిప్యూటేషన్‌పై ఉన్నారు. వీరి స్థానాల్లోకి వచ్చేందుకు మరో 30 మంది ఉన్నారు. అంటే 60 మందికి స్థానభ్రంశం కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. పోనీ ఇదంతా పారదర్శకంగా చేస్తున్నారా.. అంటే అదీ లేదు. హెచ్ఎండీఏలో పనిచేస్తున్న ఒకరు మూడేండ్లుగా, మరొకరు అయిదేండ్లుగా అక్కడే పనిచేస్తున్నా డిప్యూటేషన్ రద్దు చేయలేదన్న ఆరోపణలు వస్తున్నాయి. కాళేశ్వరం సీసీఎఫ్‌గా ప్రభాకర్‌ను బదిలీ చేశారు.
ములుగు డీఎఫ్‌వోను ఒక మంత్రి సిఫార్సుతో హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని ఒక అధికారి ఉమ్మడి మెదక్ జిల్లాకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆయనకు సంబంధించిన ఉత్తర్వులు ఒకట్రెండు రోజుల్లో రానున్నట్టు తెలిసింది. అంతేకాకుండా ఫారెస్ట్ అకాడమీ నుంచి ఒక అధికారి కూడా మెదక్ జిల్లాలోని మరో కీలక పోస్టులోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. మూడు నెలల క్రితం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నుంచి కూడా ఒక అధికారి ఇలాగే హెచ్ఎండీఏకు వచ్చారు. ఆయన ఒక సంఘానికి నాయకుడు కూడా కావడం గమనార్హం.
అడ్డగోలుగా వసూళ్లు.. కన్సెంట్ ఇవ్వకపోయినా ఆర్డర్లు
అటవీ శాఖలో బదిలీ బాగోతం జరుగుతున్నదని అక్కడి ఉద్యోగులు వాపోతున్నారు. కొంద రు కీలక వ్యక్తికి దగ్గరి వాళ్లమని చెప్తూ పైరవీలు మొదలుపెట్టారని చెప్తున్నారు. రేంజ్ ఆఫీసుల్లో పోస్టింగ్‌లు ఇప్పిస్తామంటూ ఒక రేంజీలో వసూ లు చేస్తున్నారని సాక్షాత్తు అటవీ శాఖ ఉద్యోగులే వాపోతున్నారు. కొందరు ఉద్యోగులు ప్రతి రోజూ హైదరాబాద్‌లోని అటవీ శాఖ అధికారు లు, దళారుల చుట్టూ తిరుగుతూనే కనిపిస్తున్నా రు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక అధికారిని బదిలీ చేయాలంటే అంత సులువుగా అయ్యేది కాదు.
కానీ, ఇప్పుడు ఎవరు ఎప్పు డు, ఎక్కడి నుంచి బదిలీ ఆర్డర్ తెప్పించుకుంటారో అన్న అనుమానంతో దిన దిన గండం నూరేండ్ల ఆయుష్షులా కాలం వెళ్లదీస్తున్నారు. డిప్యూటేషన్‌పై ఏదైనా శాఖకు వెళ్లాలంటే సం బంధిత శాఖ అధికారులు కూడా కన్సెంట్ లెటర్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ, అటవీ శాఖలో విచిత్రమైన పరిస్థితి కనిపిస్తున్నది. హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, విజిలెన్స్ తదితర శాఖల్లోకి కొంతమంది డిప్యూటేషన్ ఉత్తర్వులను పట్టుకొని వెళ్తున్నారు.
ఉత్తర్వులను చూసిన సంబంధిత శాఖ అధికారులు ‘మాకు ఇప్పుడు అటవీ శాఖకు సం బంధించిన పనులేమీ లేవు. మిమ్మల్ని ఏం చేసుకోవాలి?’ అని ప్రశ్నిస్తే.. ‘మాకు అదంతా తెలియదు.. జాయిన్ చేసుకొని, ఫలానా విభాగాన్ని మాకు అప్పగించండి’ అంటూ దబాయిస్తున్నారు. ఇది ఆయా శాఖలకు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నది. హెచ్ఎండీఏకు డిప్యూటేషన్‌పై వెళ్లిన ఒక చిన్నస్థాయి అధికారిణి రూ.కోట్ల విలువ చేసే పనులను ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. ఆమె కన్నా సీనియర్లు, ఆమె కన్నా పనిమంతులు ఉన్నప్పటికీ అక్కడ ఆమె చెప్పిందే నడుస్తున్నదని అధికార వర్గాల్లో చర్చ జరుగుతున్నది.