గద్వాల, నవంబర్ 4 : ‘ముఖ్యమంత్రి వద్దే హోంశాఖ ఉండటంతో రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతున్నది. 30 యాక్ట్ ఎమర్జెన్సీ పాలనను తలపిస్తున్నది.. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు నమోదు చేయిస్తున్నారు. పోలీస్ వ్యవస్థ పూర్తిగా విఫలమైంది’ అంటూ మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ధ్వజమెత్తారు. సోమవారం జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో వారు మీడియాతో మాట్లాడారు. ముందుగా శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ మహబూబ్‌నగర్‌లో ఉదయం మైనర్‌పై లైంగికదాడికి యత్నం జరిగితే సాయంత్రం వరకు పోలీసులు కేసు నమోదు చేయలేదని దుయ్యబట్టారు. రాష్ట్రంలో మైనర్లకు భద్రత లేకుండా పోయిందని అన్నారు.
‘పేదల ఇండ్లు ఎందుకు కూల్చారు?’ అన్నందుకు తన సోదరుడిపై కేసు నమోదు చేసి జైలుకు పంపారని మండిపడ్డారు. అలాగే బాధితులకు అండగా నిలిస్తే తనపైనా కేసు నమోదు చేశారని.. సమస్యలపై ప్రశ్నిస్తే కేసులు నమోదు చేస్తారా? ఇదెక్కడి పోలీస్ వ్యవస్థ అని మండిపడ్డారు. బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ.. ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవడానికి ఆందోళనలు చేస్తే.. దాన్ని అణచి వేయడానికి జిల్లాల్లో 30 యాక్ట్ అమలు చేయడం ద్వారా రాష్ట్రంలో ఎమర్జెన్సీ పాలనను తలపిస్తున్నదని మండిపడ్డారు. మైనర్ బాలిక రాజేశ్వరి మృతి చెందితే ఇక్కడి ఎమ్మెల్యే, ఎంపీ, ఉమ్మడి జిల్లాలో మంత్రి ఉన్నా ఆ కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. మైనర్ బాలిక చావుకు అధికార పార్టీ నేతనే కారణమని ఆయన ఆరోపించారు.