రామగిరి, సెప్టెంబర్ 9: స్వరాష్ట్రంలోనే ముస్లింలు అభివృద్ధి సాధిస్తున్నారని, వారి సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని హోంమంత్రి మహమూద్ అలీ చెప్పారు. శనివారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని మదీనా మసీదులో ఖిరాత్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన 2వ అఖిల భారత ఖిరాతే ఖురాన్, అజాన్ పోటీలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో గంగా జమునా తహజీబ్‌లా సంస్కృతి, సంప్రదాయాలు విలసిల్లేలా సీఎం కేసీఆర్ అన్ని మతాలకు ప్రాధాన్యం కల్పిస్తున్నారని కొనియాడారు. తొమ్మిదేండ్లలోనే అన్ని రంగాల్లోనూ తెలంగాణ దేశంలోనే నంబర్-1 స్థానంలో నిలిచిందని తెలిపారు.
రాష్ట్రంలో 17 వేల మసీదుల్లోని ఇమామ్‌లు, మౌలానాలకు ప్రతి నెలా రూ.5 వేల గౌరవ వేతనం ఇస్తున్న ప్రభుత్వం దేశంలో తెలంగాణ ఒక్కటేనని గుర్తుచేశారు. ఇస్లాం మత పవిత్ర గ్రంథం ఖురాన్ విశిష్టతను తెలుపుతూ నల్లగొండలో ఖురాన్ కంఠస్థ, పఠన పోటీలను నిర్వహించడం సంతోషకరమని చెప్పారు. అన్ని రాష్ట్రాల నుంచి 150 మంది ముస్లింలతో పోటీలు నిర్వహించిన ఖిరాత్ కమిటీకి అభినందనలు తెలిపారు. అనంతరం ఖురాన్ పోటీల విజేతలకు నగదు బహుమతి, ప్రశంసా పత్రం, జ్ఞాపిక అందజేశారు. మదీనా మసీదు మౌలానా, పోటీల కన్వీనర్ హఫీజ్ ఖారి నిజాముద్దీన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, ఎప్పీ అపూర్వరావు, మత పెద్దలు పాల్గొన్నారు.