నిజామాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణలో కాం గ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్దఎత్తున అవినీతి పెరిగిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ఢిల్లీకి ఏటీఎంగా మార్చేసిందని ధ్వజమెత్తారు. కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, ఎంపీలు ఈటల రాజేందర్, అర్వింద్‌తో కలిసి ఆదివారం నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని అమిత్ షా ప్రారంభించారు. పీసీసీ మాజీ చీఫ్ డీ శ్రీనివాస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం పాలిటెక్నిక్ మైదానంలో నిర్వహించిన కిసాన్ సమ్మేళనంలో ప్రసంగించారు. ఉగ్రవాదాన్ని మాత్రమే కాకుండా దేశంలో నక్సలిజాన్ని 2026 మార్చి నెలాఖరులోగా అంతం చేయడమే తమ లక్ష్యమని స్పష్టంచేశారు.
నక్సలైట్లు తక్షణమే హత్యాకాండను ఆపేసి, ఆయుధాలను వదిలి లొంగిపోవాలని, జనజీవన స్రవంతిలో కలవాలని సూచించారు. నక్సలైట్లతో ఎలాంటి చర్చలు ఉండబోవని స్పష్టంచేశారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 10 వేల మంది నక్సల్స్ లొంగిపోయారని తెలిపారు. ఆదివాసీల పేరుతో మావోయిస్టులు విధ్వంసం సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. నక్సలైట్లతో కాంగ్రెస్ చర్చలు జరిపిందని, తాము అలా కాదని చెప్పారు. పసుపు బోర్డు ఏర్పాటుతో రైతుల జీవితం మారుతుందని చెప్పారు. పసుపు ఉత్పత్తిలో దేశంలోనే నిజామాబాద్ జిల్లా ముందున్నదని తెలిపారు. ఇక్కడి నుంచి పసుపు ఉత్పత్తులను అమెరికా, యూరప్, యూకే, వియత్నాం, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్, న్యూజిలాండ్‌కు ఎగుమతి చేస్తామని వివరించారు. పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభోత్సవంలో రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, ఎమ్మెల్యే భూపతిరెడ్డి పాల్గొన్నారు.
ఎన్సీసీ క్యాడెట్ల నిరసన
కిసాన్ సమ్మేళన్ సభలో అమిత్‌షాకు ఊహించని ఘటన ఎదురైంది. అమిత్ షా ప్రసంగిస్తున్న సమయంలో పలువురు ఎన్సీసీ క్యాడెట్లు నిరసన తెలపడంతో ఒక్కసారిగా కలకలం నెలకొంది. ‘సేవ్ ఎన్సీసీ.. సేవ్ క్యాడెట్స్ ఫ్యూచర్’ అంటూ క్యాడెట్లు ప్లకార్డులు ప్రదర్శించగా పోలీసులు వెంటనే వచ్చి క్యాడెట్లను అడ్డుకున్నారు.