హైదరాబాద్, డిసెంబర్ 6(నమస్తే తెలంగాణ) : ప్రమాదాలు, సహజ మరణం కారణంగా చనిపోయిన హోంగార్డు కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తున్నట్టు డీజీపీ బీ శివధర్‌రెడ్డి తెలిపారు. హెచ్డీఎఫ్సీ, యాక్సిస్ బ్యాంకుల్లో ఖాతాలు కలిగిన వారు విధి నిర్వహణలో చనిపోతే దాదాపు రూ.33 లక్షల బీమా సౌకర్యం కల్పించామని పేర్కొన్నారు. శనివారం హోంగార్డుల రైజింగ్ డేని పురస్కరించుకొని ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. హోంగార్డుల వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా తెలంగాణ హోంగార్డులకు డీజీపీ శుభాకాంక్షలు తెలిపారు. కొత్త హోంగార్డుల నియామకాలకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. హోంగార్డులకు రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్యం, అర్హులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కేటాయింపు అంశాలు పరిశీలనలో ఉన్నాయని పేర్కొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా హోంగార్డుల వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన అన్ని జిల్లాల ఎస్పీలు, పోలీస్ కమిషనర్లకు డీజీపీ అభినందనలు తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజాసేవలో అంకితభావంతో పనిచేస్తున్న హోంగార్డుల సేవలకు సముచిత గౌరవం దకాలనే ఉద్దేశంతో డిసెంబర్ 6న హోంగార్డ్స్ రైజింగ్ డే నిర్వహిస్తున్నట్టు డీజీపీ చెప్పారు. ఈ సందర్భంగా పలు విభాగాల్లో క్రమశిక్షణ, అంకితభావం ప్రదర్శిస్తున్న హోంగార్డులను ఆయన ప్రశంసించారు. దినసరి డ్యూటీ అలవెన్స్‌ను రూ.921 నుంచి రూ.1,000కి పెంచడం, ట్రాఫిక్ విధుల్లో ఉన్నవారికి 30% పొల్యూషన్ హజార్డస్ అలవెన్స్ చెల్లింపు, పరేడ్ అలవెన్స్‌ను రూ.200కు పెంచామని వివరించారు. హోంగార్డులు తమ సమస్యలను నేరుగా తెలియజేసేందుకు వీలుగా పోలీసు అధికారులు వారితో మాట్లాడి ఆయా అంశాలను క్రోడీకరించి తన కార్యాలయానికి పంపాలని యూనిట్ అధికారులను డీజీపీ ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా యూనిట్లు, సీపీ ఆఫీసుల్లో రైజింగ్ డే ఘనంగా జరిగింది. ప్రతిభచూపిన హోంగార్డులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. క్రీడలు, రక్తదాన శిబిరాలు నిర్వహించారు.
త్వరలో హోంగార్డుల కారుణ్య నియామకాలు! ‘నమస్తే తెలంగాణ’ కథనాలకు స్పందన
హోంగార్డుల కారుణ్య నియామకాల అంశం త్వరలో పరిషరించాల్సి ఉన్నదని డీజీపీ శివధర్‌రెడ్డి తెలిపారు. శనివారం హైదరాబాద్‌లోని డీజీపీ ఆఫీస్‌లో నిర్వహించిన రైజింగ్‌డేలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. సీనియర్ హోంగార్డులతో కేక్ కట్ చేయించిన తర్వాత మాట్లాడారు. విధి నిర్వహణలో చనిపోయిన హోంగార్డులకు శ్రద్ధాంజలి తరహాలో నియామకాలు చేపట్టాల్సి ఉన్నదని అభిప్రాయం వ్యక్తంచేశారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్లోనూ హోంగార్డులు శుభవార్త వింటారని చెప్పారు. హోంగార్డుల జీవిత బీమాకు సంబంధించి కొన్ని బ్యాంకులు ముందుకు వస్తున్నాయని, ఇప్పటికే సంబంధిత అధికారులతో చర్చించామని వివరించారు. హోంగార్డుల సమస్యలు, రైజింగ్‌డే, కారుణ్య నియామకాలు, రూ.5 లక్షల పరిహారంపై ‘నమస్తే తెలంగాణ’ వరుస కథనాలు ప్రచురించింది. ఆ కథనాలు పోలీసులు, హోంగార్డుల్లో చర్చకు దారితీశాయి. ఈ నేపథ్యంలో డీజీపీ ప్రకటనలకు ప్రాధాన్యత సంతరించుకున్నది. హోంగార్డ్స్ అడిషనల్ డీజీ స్వాతి లక్రా మాట్లాడుతూ ప్రభుత్వం హోంగార్డులకు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని తెలిపారు. కార్యక్రమంలో ఏడీజీలు మహేశ్ భగవత్, చారుసిన్హా, ఐజీలు చంద్రశేఖర్‌రెడ్డి, రమేశ్ పాల్గొన్నారు.