Home Guard | హైదరాబాద్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన కానిస్టేబుళ్ల నోటిఫికేషన్లో 14 వేల మంది రిక్రూట్ అయినా.. హోంగార్డులతో వెట్టిచాకిరీ చేయించుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ పాత రొటేషన్ పద్ధతినే అవలంబించేందుకు సిద్ధమైంది. 500 మందిని రొటేషన్ పద్ధతిలో పంపేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఐదు ఉమ్మడి జిల్లాల్లోని హోంగార్డుల లిస్టును సిద్ధం చేసింది. కరీంనగర్, నల్లగొండ, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, నిజామాబాద్ జిల్లా ల్లో సరిపడా కానిస్టేబుళ్లు లేరని, హోంగార్డులను ‘ఆర్డర్ టు సర్వ్’ కింద సరిహద్దుల్లోని పీఎస్‌లకు పంపుతుండడంతో.. జీతం తక్కు వ.. ఆంక్షలు ఎక్కువని వాపోతున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి నిర్మల్‌కు 60, ఆసిఫాబాద్‌కు 40 మందిని, ఉమ్మడి నల్లగొండ నుంచి సూర్యాపేటకు 40, రాచకొండకు 18 మందిని, ఉమ్మడి మహబూబ్‌నగర్ నుంచి గద్వాల్‌కు 55, వనపర్తికి 35, నారాయణపేటకు 70 మందిని, సంగారెడ్డి నుంచి సిద్దిపేటకు 60 మందిని, ఉమ్మడి నిజామాబాద్ నుంచి కామారెడ్డికి 42 మందిని, ఉమ్మడి కరీంగనర్ నుంచి 60 మందిని ఏడు జిల్లాలకు పంపనున్నారు.
ఇలా రొటేషన్ పద్ధతిలో వెళ్లేవారిలో కొంతమంది హోంగార్డుల తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు అనారోగ్యంతో ఉన్నా.. వారిని వదిలి డ్యూటీకి వెళ్లాల్సిందేనని, ఇంట్లో పరిస్థితి బాగాలేదని ఉన్నతాధికారులకు చెప్పినా కనికరించరని చెప్తున్నారు. ఈ రొటేషన్ పద్ధతి పారదర్శకంగా ఉండడం లేదని ఆరోపిస్తున్నారు. లిస్టులో పేరు వచ్చిందంటే ఏడాదంతా కుటుంబానికి దూరంగా ఉండాలి.. లేదా ప్రతినెలా రూ.10 వేలు ఖర్చు పెట్టుకొని వందల కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ చేయాల్సిందేనని వాపోతున్నారు. ఇంత కష్టపడుతున్నా వచ్చే జీతం తక్కువని, హెల్త్‌కార్డుల గురించి అడుగుతున్నా స్పందించరని, టీఏ ఇవ్వరని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. డీజీపీ, ప్రభుత్వం స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని వేడుకుంటున్నారు.