హైదరాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా హోంగార్డుల కష్టాలు వర్ణణాతీతంగా మారాయి. ప్రతినెలా జీతం ఎప్పుడు వస్తుందో తెలియక ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో ఏ నెలలో ఎప్పుడు జీతం పడుతుందో అర్థం కావడంలేదని చెప్తున్నారు. ఈసారి 11వ తేదీ వచ్చినా కూడా 11 జిల్లాల్లోని హోంగార్డులకు వేతనాలు జమకాలేదని తెలిపారు. కుటుంబ కష్టాలు, పిల్లల స్కూల్ ఫీజులు, పుస్తకాలకు చాలా ఇబ్బందులు పడుతున్నామని, ఇంటి రెంటు కూడా కట్టలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
హెల్త్‌కార్డులు ఇవ్వలేదని, వర్షాకాలం ప్రారంభమైనా రెయిన్కోట్లను కూడా పంపిణీ చేయలేదని వాపోతున్నారు. వర్షంలోనే విధులు నిర్వహించాల్సిన దుస్థితి తలెత్తిందని చెప్తున్నారు. వరంగల్, కరీంనగర్, రామగుండం కమిషనరేట్లు, కుమ్రంభీం ఆసిఫాబాద్, జగిత్యాల, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్‌నగర్, వనపర్తి, భద్రాది కొత్తగూడెం జిల్లాల్లోని హోంగార్డులకు వేతనాలు అందలేదని తెలిపారు. ప్రభుత్వం చిరుద్యోగుల పట్ల దయచూపి, వేతనాలు త్వరగా విడుదల చేయాలని కోరుతున్నారు.
చాలీచాలని జీతం, భద్రత లేని ఉద్యోగంతో జీవితాలను నెట్టుకొస్తున్న హోంగార్డులు దేశవ్యాప్తంగా ఆందోళనబాట పట్టేందుకు సిద్ధమయ్యారు. సమస్యల పరిష్కారం, డిమాండ్ల సాధన లక్ష్యంగా ఆల్ ఇండియా హోంగార్డుల సంఘం ఈ నెల 20న ఢిల్లీలో మహాధర్నా చేపట్టనుంది. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో హోంగార్డ్ సవరణ బిల్లు 1946-47, 1962-63లో సవరణలు కోరుతూ చలో ఢిల్లీకి పిలుపునిచ్చింది. దేశవ్యాప్తంగా ఐదు లక్షల మంది హోంగార్డులకు ఉద్యోగ భద్రత, కారుణ్యనియామకాలు కల్పించేవరకు ఉద్యమిస్తామని అసోసియేషన్ ప్రెసిడెంట్ కమలాశర్మ స్పష్టంచేశారు. మహాధర్నాకు తెలంగాణ నుంచి కూడా హోంగార్డులు పెద్దఎత్తున తరలిరావాలని రాష్ట్ర హోంగార్డుల సంఘం సూచించింది.