Home Guards | హైదరాబాద్, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ): తమపై ఎందుకింత వివక్ష చూపుతున్నారని, తమ మొర ఆలకించేవారే లేరా? అని రాష్ట్రంలోని హోంగార్డులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్‌ను నమ్మి ఓట్లేస్తే తమకు నిరాశే మిగిల్చిందని హోంగార్డులు వాపోతున్నారు. ప్రశ్నిద్దామంటే క్రమశిక్షణ చర్యలు అడ్డొస్తున్నాయని చెబుతున్నారు. ఉన్నతాధికారులు క్రమశిక్షణ పేరిట తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని చెబుతున్నారు. ‘ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఓట్ల కోసం ముద్దొచ్చిన హోంగార్డులు.. అధికారంలోకి వచ్చాక అసహ్యంగా మారారా?’ అని ప్రశ్నిస్తున్నారు.
నమ్మి ఓట్లేసిన కాంగ్రెస్ సర్కారు ఏడాదిలోనే తమ ఆశలను సమాధి చేసిందని కన్నీటి పర్యంతమవుతున్నారు. ఒంటెద్దు పోకడలు, ఏకపక్ష నిర్ణయాలతో స్రిప్టు రాస్తున్న అధికారులు.. ప్రభుత్వానికి వాస్తవాలు తెలియకుండా కప్పిపుచ్చుతున్నారని మండిపడుతున్నారు. హోంగార్డుల కారుణ్య నియామకాల ప్రక్రియకు శాశ్వతంగా బొంద పెట్టారని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. తమ సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని మంత్రులను విన్నవిస్తున్నారు. ‘నాడు మేం అడగకముందే మా సమస్యలపై పోరాడి, అండగా నిలబడిన రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు మేం మొరపెట్టుకుంటున్నా దర్శనం ఇవ్వడం లేదు’ అని మండిపడుతున్నారు.
హోంగార్డుల నుంచి పోలీసు ఆఫీసర్ల వరకు అందరిది ఒక్కటే ఖాకీ కులమని చెప్తూనే తమ పట్ల ప్రభుత్వం వివక్షాపూరితంగా వ్యవహరిస్తున్నదని హోంగార్డులు ఆరోపిస్తున్నారు. పోలీసులకు ఒకటో తేదీనే వేతనాలు వేసే ప్రభుత్వం.. తమకు రావాల్సిన వేతనాలను దారి మళ్లించి, 13 రోజులైనా జీతాలు ఇవ్వకపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. డ్యూటీల దగ్గర అందరూ సమానమైనప్పుడు వేతనాల వద్ద భేదాలెందుకని నిలదీస్తున్నారు. సంక్షేమం, వేతనం, ఆటలు, పదవీ విరమణ.. ఇలా అన్ని విషయాల్లోనూ తమపై వివక్ష చూపుతున్నారని పేర్కొంటున్నారు. ఆఖరికి తాము మరణించినా వివక్ష చూపుతున్నారని మండిపడుతున్నారు.
తమ పిల్లలను చదివిపించలేక పోతున్నామని, తల్లిదండ్రులను పోషించలేకపోతున్నామని అంటున్నారు. అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నా హెల్త్‌కార్డుల సమస్యను పరిష్కరించడం లేదని వాపోతున్నారు. ఇంటి కిరాయిలు కట్టలేక అవమానాల పాలవుతున్నామని రోదిస్తున్నారు. బ్యాంకు లోన్లకు అదనపు వడ్డీలు చెల్లించాల్సి వస్తున్నదని బాధపడుతున్నారు. చనిపోయిన హోంగార్డుల పిల్లలు అనాథలుగా జీవిస్తున్నారని.. కనీసం కారుణ్య నియామకాలైనా చేపట్టాలని ప్రాధేయపడుతున్నారు.