హైదరాబాద్: రాష్ట్రంలోని (Telangana) పలు జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. కుండపోతగా కురుస్తున్న వానలతో జనజీవనం స్తంభించిపోయింది. ఈ నేపథ్యంలో నల్లగొండ, యాదాద్రి భువనగిరి, కరీంనగర్, సిద్దిపేట్ల, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లో ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు అధికారులు సెలవు ప్రకటించారు. ఇప్పటికే కామారెడ్డి, మెదక్, నిర్మల్, ఆదిలాబాద్, కుమ్రం భీమ్ ఆసిఫాబాద్, నిజామాబాద్, కరీంనగర్, జగిత్యాల జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ఇచ్చారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయకు రాకూడదని సూచించారు. కాగా, యాదాద్రి భువనగిరి జిల్లాలో గురువారం సెలవు ప్రకటించిన నేపథ్యంలో ప్రతిగా వచ్చే నెల రెండో శనివారం స్కూల్స్ నడపాలని అధికారులు నిర్ణయించారు. కాగా, పలు జిల్లాల్లో విద్యార్థులు స్కూళ్లకు వెళ్లిన తర్వాత అధికారులు సెలవు ప్రకటించారు. దీంతో విద్యార్థులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు భారీ వర్షాల కారణంగా కాకతీయ యూనివర్సిటీ పరిధిలో గురు, శుక్రవారాల్లో జరగాల్సిన డిగ్రీ, పీజీ పరీక్షలను వాయిదా వేశారు. మిగత పరీక్షలు యథావిధిగా కొనసాగుతాయని వర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి ప్రొఫెసర్ రాజేందర్ కట్ల తెలిపారు.
కరీంనగర్లోని శాతవాహన వర్సిటీ పరిధిలో గురువారం జరగాల్సిన బీఎడ్, ఎంఎడ్ పరీక్షలు వాయిదా వేసినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే కొనసాగుతాయని చెప్పారు. వాయిదా వేసిన పరీక్షలు మళ్లీ ఎప్పుడు నిర్వహించాలనేది త్వరలో ప్రకటిస్తామని వెల్లడించారు.
కాగా, రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తం కావడం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) ఆందోళన వ్యక్తం చేశారు. ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, వరంగల్ నుంచి ఖమ్మం దాకా పలు జిల్లాల్లో వరదలతో నివాసాలు నీట మునిగి, రోడ్లు తెగిపోయి రవాణా వ్యవస్థ అతలాకుతలమై, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురికావడం పట్ల తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వరద ప్రభావిత జిల్లాలకు చెందిన పార్టీ ముఖ్యనేతలకు అధినేత ఫోన్లు చేసి ఈ మేరకు అప్రమత్తం చేశారు. వరద బాధిత ప్రాంతాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ తమ వంతుగా సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ దిశగా పార్టీ శ్రేణులను అప్రమత్తం చేయాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు అధినేత కేసీఆర్ సూచించారు.