అంతా నవ నిర్మాణ్ సంస్థకు కట్టబెట్టేందుకే… తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా హోర్డింగ్‌ల (అడ్వైర్టెజ్‌మెంట్) ద్వారా ప్రభుత్వానికి రూ.వెయ్యి కోట్ల వరకు ఆదాయం వస్తుంది. ఈ ఆదాయాన్ని నవ నిర్మాణ్ సంస్థకు కట్టబెట్టేందుకే ప్రభుత్వంలోని పెద్ద మనుషులకు సంబంధించిన కుటుంబసభ్యులతో కలిసి వ్యాపారం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ నగరంలోని కంటోన్మెంట్ ప్రాంతంలో అప్పన్నంగా కట్టబెట్టారు. ట్యాక్సులు పెంచైనా ఇవ్వండి.. ఎంతైనా చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామని కోరినా అధికారులెవ్వరూ స్పందించడం లేదు. ప్రతి ఏడాది రాష్ట్రవ్యాప్తంగా హోర్డింగ్‌లన్నింటినీ నవ నిర్మాణ్ సంస్థకు కట్టబెట్టేందుకు ప్రభుత్వంలోని కొందరు పెద్దలు ఏడాదిగా పావులు కదుపుతున్నారు. అందుకే ఇదంతా చేస్తున్నారు. దీని ద్వారా ఈ రంగంపై దశాబ్దాలుగా ఆధారపడి జీవిస్తున్న లక్షల కుటుంబాలు వీధినపడతాయి. ప్రభుత్వం మాకు ప్రత్యామ్నాయ ఉపాధినైనా చూపించాలి.
– తెలంగాణ అవుట్డోర్ మీడియా అసోసియేషన్ ప్రతినిధులు
హైదరాబాద్ సిటీబ్యూరో/మణికొండ, మార్చి 17 (నమస్తే తెలంగాణ): రాజకీయ, వాణిజ్య ప్రకటనల్లో కనకవర్షాన్ని కురిపించే హోర్డింగ్‌ల వెనక ఇదో భారీ కుట్ర. రాష్ట్రవ్యాప్తంగా, ప్రధానంగా హైదరాబాద్ చుట్టూ ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఏటా కోట్లాది రూపాయల ఆదాయానికే కాదు, ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్న లక్షల కుటుంబాల ఉపాధికి సైతం సాక్షాత్తూ రాష్ట్ర ప్రభుత్వమే గండికొట్టడం విచిత్రమైన పరిణామం. ఒకేఒక్క కంపెనీకి హైదరాబాద్ చుట్టూ హోర్డింగ్‌ల ఏర్పాటు టెండరును కట్టబెట్టేందుకు ఏడాదిగా ‘నిర్మాణా’త్మకంగా ఈ కుట్రను అమలుచేస్తున్నారనే ఆరోపణలున్నాయి.
కొత్త హోర్డింగ్‌ల ఏర్పాటుకు అనుమతి ఇవ్వకపోవడంతోపాటు గతంలో అనుమతులు తీసుకున్న వారికి సైతం రెన్యువల్ చేసేందుకు అవకాశం లేకుండా పురపాలక శాఖే సంబంధిత వెబ్‌సైట్‌ను నిలిపివేయడం కుట్ర వెనక పెద్దల హస్తం ఉందనేందుకు నిదర్శనం. ఈ నేపథ్యంలో కొన్నిరోజులుగా అనుమతులు లేవంటూ హైడ్రా, స్థానిక సంస్థలు ఆయా హోర్డింగ్‌లను కూల్చివేయడంతో దశాబ్దాలుగా ఈ రంగంపై ఆధారపడిన లక్షలాది మంది ఆందోళన చెందుతున్నారు. ఒక్క కంపెనీ కోసం పెద్దలు ఆడుతున్న ఈ హైడ్రామా కారణంగా తామంతా రోడ్డున పడతామంటూ కన్నీరుమున్నీరు అవుతున్నారు.
రాజకీయ, వ్యాపార ప్రకటనల రూపంలో ఏటా వందల కోట్ల రూపాయల వ్యాపారం జరిగే హోర్డింగ్‌ల రంగంపై దశాబ్దాలుగా లక్షల మంది ఆధారపడి జీవిస్తున్నారు. హోర్డింగ్‌లకు అనుమతులు ఇవ్వడం వల్ల ఆయా స్థానిక సంస్థలకు ఫీజుల రూపంలో భారీ ఆదాయమే వస్తుంది. ఎక్కడికక్కడ స్థానిక సంస్థలే అనుమతులు ఇచ్చి ఆదాయాన్ని ఆర్జిస్తున్నాయి. ఇందుకోసం పురపాలక శాఖ పరిధిలోని సీడీఎంఏ ప్రత్యేకంగా వెబ్సైట్ ఏర్పాటుచేసి కొత్త అనుమతులు, గతంలోని అనుమతులకు యేటా రెన్యువల్ ప్రక్రియను నిర్వహిస్తున్నది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హోర్డింగ్‌లకు సంబంధించిన కొత్త అనుమతులు, రెన్యువల్ ప్రక్రియను అటకెక్కించారు. దీంతో 2023-24, 2024-25 ఆర్థిక సంవత్సరాల్లో ఆయా స్థానిక సంస్థలకు రావాల్సిన వందల కోట్ల ఫీజులకు గండిపడింది.
స్థానిక సంస్థల పరిధుల్లోని హోర్డింగ్‌లకు కొత్త అనుమతులుగానీ, గతంలోని అనుమతులకు రెన్యువల్గానీ చేయొద్దంటూ గత ఏడాది మార్చి 5న సీడీఎంఏ నుంచి మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు సర్క్యులర్ జారీ చేశారు. హోర్డింగ్‌ల ద్వారా స్థానిక సంస్థలకు వచ్చే ఆదాయం తక్కువగా ఉన్నందున వాటిని సవరించాల్సి ఉన్నదని, అందుకే అనుమతులు పొందిన హోర్డింగ్‌లకు రెన్యువల్ చేయొద్దని ఆదేశించారు. ఆదేశాలు వచ్చి ఏడాది దాటినా ఇప్పటివరకు పురపాలక శాఖ ఆ ఊసే ఎత్తడం లేదు. దీనిపై గతంలో అనుమతులు పొందిన హోర్డింగ్‌ల యజమానులు, సిబ్బంది.. సీఎంవో మొదలు కిందిస్థాయి మున్సిపాలిటీ, కార్పొరేషన్లలోని కమిషనర్లు, టీపీవోలను కలిసినప్పటికీ ఎవరూ ఎలాంటి సమాధానం ఇవ్వడం లేదు.
ఈ హోర్డింగ్‌ల కుట్ర వెనక ప్రభుత్వంలోని ’ముఖ్య’నేత సోదరుడు ఉన్నారనే ఆరోపణలున్నాయి. సదరు సోదరుడి మిత్రుడే ఒక సంస్థను తెరపై పెట్టి వ్యవహారాలన్నీ చక్కబెడుతున్నారనే విమర్శలున్నాయి. లక్షల మందికి జీవనోపాధిగా ఉన్న హోర్డింగ్ రంగాన్ని సదరు సంస్థకు కట్టబెట్టేందుకే అంచెలంచెలుగా కుట్రను అమలు చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఇతర సంస్థలు, వ్యక్తులకు చెందిన హోర్డింగ్‌లన్నింటినీ తొలగించి, ఆపై ఒకేసారి టెండర్ల ద్వారా ఆ కంపెనీకి హోర్డింగ్‌లను కట్టబెట్టేందుకు పక్కా స్కెచ్ వేశారని తెలుస్తున్నది. అయితే, కొత్తగా పిలిచే టెండర్లలో అనేక మెలికలు, కొత్త నిబంధనలు, సాధారణ ప్రకటనల సంస్థలకు అందుబాటులో లేని సౌకర్యాలు, పరికరాలను చేర్చి తాము అనుకున్న కంపెనీకి హోర్డింగ్‌ల అనుమతులు వచ్చేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఇందుకోసమే ప్రత్యేకంగా డిజిటల్ హోర్డింగ్‌ల పాలసీని రూపొందించే పని గుట్టుగా సాగుతున్నదని సమాచారం.
రాష్ట్రవ్యాప్తంగా హోర్డింగ్‌లన్నింటినీ ఒక్క కంపెనీకే కట్టబెట్టేందుకే ప్రయత్నాలు జరుగుతున్నాయని బాధితులు ఆరోపిస్తున్నారు. తొలుత కొత్త అనుమతులు, రెన్యువల్ ప్రక్రియను నిలిపివేశారని, రెండో అంకంలో గతంలో ఏర్పాటైన హోర్డింగ్‌ల తొలగింపును చేపట్టారని చెప్తున్నారు. కొన్నిరోజుల కిందట హైడ్రా శంషాబాద్ విమానాశ్రయ మార్గంలో ఉన్న సుమారు 144 హోర్డింగ్‌లను గుర్తించి, వాటిలో 60-70 వరకు తొలగించింది. దీంతోపాటు ఇతర కార్పొరేషన్ల పరిధిలో కూడా హైడ్రా పలు హోర్డింగ్‌లను తొలగించింది. ఇందులో వాస్తవానికి ఎలాంటి అనుమతులు లేనివి కొన్ని ఉండగా.. గతంలో అనుమతులు తీసుకున్నవి కూడా ఉన్నాయి. కానీ వాటిని రెన్యువల్ చేసుకునేందుకు ప్రభుత్వమే అవకాశం లేకుండా చేసి, అనుమతులు లేవనడం ఎంతవరకు సమంజసం అని సంబంధిత యజమానులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ముఖ్యంగా హోర్డింగ్ యజమానులు కమిషనర్లను కలిసి తమకున్న అనుమతులు రెన్యువల్ చేయాలని కోరితే, ఇది తమ చేతుల్లో లేదని, పైస్థాయిలో ఏం జరుగుతున్నదో కూడా తమకు తెలియడంలేదని చెప్తున్నారు.