Land Pooling | దశాబ్దాల కింద నిరుపేద రైతులకు పంపిణీ చేసిన భూములవి.. అప్పటి నుంచీ అవి లావణి పట్టాల కింద రెవెన్యూ రికార్డుల్లో కొనసాగుతున్నాయి. కాలక్రమేణా పట్టణీకరణతో వాటి చుట్టూ వందలాది కాలనీలు వెలిశాయి. ప్రస్తుతం అక్కడ చదరపు గజం రూ.40-50వేల వరకు పలుకుతున్నది. హెచ్ఎండీఏ ద్వారా ఆ భూములను ల్యాండ్ పూలింగ్ కింద అభివృద్ధి చేయాలని గత కేసీఆర్ సర్కార్ నిర్ణయించింది. అటు రైతులు, ఇటు ప్రభుత్వానికి ప్రయోజనకరంగా ఉంటుందని భావించింది. కానీ రైతులతో చర్చలు సఫలం కాకపోవడంతో ప్రక్రియ వాయిదా పడుతూ వచ్చింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.
తాజాగా లావణి పట్టాల రైతులతో చర్చలు మొదలయ్యాయి. కాకపోతే హెచ్ఎండీఏ అధికారులతో కాదు! ప్రభుత్వ పెద్ద సోదరులు, బంధువులతో! ఈ మేరకు జరిగిన చర్చల్లో కొందరు రైతులతో ఒప్పందాలు కూడా పూర్తయ్యాయి. బాజాప్తా వంద రూపాయల స్టాంపు పేపరుపై ‘అతుల్యం హోమ్స్’ అనే కంపెనీ రైతులతో ఒప్పందాలు చేసుకున్నది. ఎకరాకు రూ.పది లక్షలు ఇవ్వడంతో పాటు వెయ్యి గజాల అభివృద్ధి చేసిన ప్లాటు ఇచ్చేలా డీల్ కుదుర్చుకున్నది. అడ్వాన్స్‌గా ఎకరాకు రూ.2 లక్షల చొప్పున ఇవ్వడంతో పాటు రికార్డులు చక్కబెట్టి ఎన్వోసీ వచ్చిన తర్వాత మిగతా నగదు ఇచ్చేలా ‘సెట్’చేసుకున్నది.
కేసీఆర్ హయాంలో హెచ్ఎండీఏ తరఫున ప్రభుత్వమే ల్యాండ్ పూలింగ్‌కు సిద్ధమైనందున లావణి పట్టా భూములకైనా నిబంధనలు అనుమతిస్తాయి. కానీ ఇప్పుడు ప్రభుత్వ భూములకు ప్రైవేట్ కంపెనీ ల్యాండ్ పూలింగ్ ఎలా చేస్తుందన్నది చర్చనీయాంశమైంది. గతంలో ప్రభుత్వం చేయాలనుకున్న ప్రాజెక్టును ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తులు ఎలా చేపడతారు? రూ.2000-2600 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టును సమాంతర ప్రభుత్వంగా ప్రైవేట్ కంపెనీ ఎలా డీల్ చేస్తుంది?అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
(స్పెషల్ టాస్క్బ్యూరో) ఫోర్త్ సిటీ పేరుతో ప్రభుత్వ పెద్దలు వేలాది ఎకరాల అసైన్డ్, సీలింగ్ భూములను చెర పడుతుండగా.. తాజాగా మరో 300 ఎకరాల వరకు లావణి పట్టా భూములు కార్పొరేట్ పరమయ్యేందుకు రంగం సిద్ధమవుతున్నది. రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం నాదర్గుల్ గ్రామంలోని సర్వేనంబరు 92లో సుమారు 291.32 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నది. ఇందులో కొంత భూమిని కొన్ని దశాబ్దాల కిందటే గ్రామానికి చెందిన నిరుపేదలకు పంపిణీ చేశారు. వారికి లావణి పట్టాలు కూడా ఇచ్చారు. ప్రస్తుత రెవెన్యూ రికార్డుల ప్రకారం 74 మంది రైతులకు సుమారు 40 ఎకరాలకు సంబంధించి లావణి పట్టాలు ఉన్నాయి. వీరిలో కొందరికి పాస్ పుస్తకాలు జారీ కాగా.. మరికొందరికి కాలేదు. మిగిలిన 270 ఎకరాల వరకు ప్రభుత్వం ఖాతాలో ఉన్నా క్షేత్రస్థాయిలో చాలామంది రైతులు కబ్జా మీద ఉన్నట్టు తెలుస్తున్నది. ఇలా దాదాపు 200 మంది రైతుల వరకు ఈ భూముల్లో సాగు చేసుకుంటున్నట్టు తెలిసింది. గతంలో నగర శివారులో ఉన్న ఈ భూములు పట్టణీకరణ దరిమిలా చుట్టూ భారీ ఎత్తున నివాసాలు వచ్చాయి. ఇప్పుడు అనేక కాలనీల మధ్య ఈ భూములు ఉండటంతో చదరపు గజం విలువ రూ.40-50 వేలకు పైగా పలుకుతున్నది. అంటే ఎకరా సుమారు రూ.20-25 కోట్ల వరకు ఉంటుంది.
పెద్ద పెద్ద కాలనీల మధ్య ఉండిపోయిన ఈ ప్రభుత్వ భూముల్లో వ్యవసాయం తగ్గిపోయింది. ప్రభుత్వ భూములు కావడంతో రైతులు వీటిని విక్రయించుకునే హక్కు లేదు. దీంతో కేసీఆర్ ప్రభుత్వంలో పరస్పర ప్రయోజనకరంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. వాస్తవానికి ప్రభుత్వం అనుకుంటే పీవోటీ కింద రైతుల నుంచి బలవంతంగా తీసుకొని సర్కారు ల్యాండ్ బ్యాంక్‌లో జమ చేయవచ్చు. కానీ కేసీఆర్ ప్రభుత్వం అలా కాకుండా హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో ల్యాండ్ పూలింగ్ చేయాలని భావించింది. హెచ్ఎండీఏ అధికారులు సైతం ల్యాండ్ పూలింగ్‌కు కసరత్తు చేశారు. ఈ భూములకు సమీపంలోనే ఉన్న కుర్మల్‌గూడలోని ప్రభుత్వ భూములను లేఅవుట్ చేసి వేలం పాటలో విక్రయించారు. అదేరీతిన ఈ భూములను అభివృద్ధి చేయాలని రైతులతో పలు దఫాలుగా సంప్రదింపులు జరిపారు. అభివృద్ధి చేసిన తర్వాత ఎకరాకు 500 చదరపు గజాల చొప్పున అభివృద్ధి చేసిన ప్లాట్లు రైతులకు ఇచ్చేందుకు హెచ్ఎండీఏ ప్రతిపాదించింది. కానీ రైతులు ఎకరాకు వెయ్యి గజాల చొప్పున కావాలని డిమాండ్ చేశారు. దీంతో ప్రక్రియలో స్తబ్ధత నెలకొంది. ఈ క్రమంలో కొందరు రైతులు హెచ్ఎండీఏ ప్రతిపాదనకు అంగీకరించి పీవోటీ కింద ప్రభుత్వానికి సరెండర్ చేసేందుకు కూడా లిఖితపూర్వకంగా పత్రాలు ఇచ్చారు. మిగిలిన రైతులు అంగీకరించకపోవడంతో అధికారులు ముందుకు వెళ్లలేకపోయారు.
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ల్యాండ్ పూలింగ్ పెండింగ్‌లో పడింది. ఈలోగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఈ విలువైన భూములపై బిగ్ బ్రదర్స్ కండ్లు పడ్డాయి. దీంతో కొన్ని నెలలుగా సంబంధిత రైతులతో చర్చలు జరుపుతున్నారు. ఈ భూములను తమకిస్తే లేఅవుట్ చేసి ఎకరాకు రూ.10 లక్షలతో పాటు అభివృద్ధి చేసిన వెయ్యి గజాల ప్లాటు చొప్పున ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. కొందరు రైతులతో స్టాంపు పేపర్లపై ఒప్పందాలు కూడా చేసుకున్నారు. అంటే గతంలో ప్రభుత్వపరంగా హెచ్ఎండీఏ చేయాల్సిన ల్యాండ్ పూలింగ్ను సదరు బిగ్ బ్రదర్స్ అనధికారికంగా చేపడుతున్నారు. రెవెన్యూ రికార్డుల్లో కేవలం 74 మంది రైతుల పేర్లే ఉండగా కబ్జా మీద ఉండి రికార్డుల్లో పేర్లు లేని రైతులు చాలా మంది ఉన్నారు. వీరు ప్రస్తుతం తమ పేర్లను రికార్డుల్లోకి ఎక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నా అవి సఫలం కావడం లేదు. దీంతో రంగంలోకి దిగిన బిగ్ బ్రదర్స్ అండ్ కో పాస్ పుస్తకాల జారీ, భూములకు ఎన్వోసీలు తీసుకురావడమే కాకుండా అవసరమైతే రికార్డులను తారుమారు చేసే వ్యవహారాన్ని అంతా తామే చూసుకుంటామని ఒప్పందంలో పేర్కొన్నారు. ఒప్పందం పూర్తయిన రైతులకు అడ్వాన్స్‌గా రూ.2 లక్షల చొప్పున ఇచ్చిన బిగ్ బ్రదర్స్ ఎన్వోసీ, పాస్ పుస్తకాలు వచ్చిన తర్వాత మిగతా మొత్తాన్ని చెల్లించేలా హామీ ఇచ్చారు. లేఅవుట్ అభివృద్ధి చేసిన తర్వాత ఒప్పందం ప్రకారం ఎకరాకు వెయ్యి గజాల అభివృద్ధి చేసిన ప్లాటు ఇచ్చేలా ఒప్పందంలో పేర్కొన్నారు.
నాదర్గుల్లోని సర్వేనంబరు 92లో ఉన్న రైతులతో బిగ్ బ్రదర్స్‌తో పాటు మరికొంతమంది చర్చలు జరిపినట్టు తెలిసింది. ఇందులో ప్రధానంగా ప్రభుత్వ పెద్ద సోదరులు, నయీం అనుచరులు ఉన్నారు. రైతులతో ఒప్పందం మాత్రం ‘అతుల్యం హోమ్స్’ పేరిట చేసుకున్నారు. దీనికి డైరెక్టర్‌గా ఉన్న నందికొండ ప్రవీణ్‌రెడ్డి ఈ భూములను కొనుగోలు చేసినట్టుగా ఒప్పందంలో పేర్కొన్నారు. అతుల్యం హోమ్స్ అనేది 2020లో ఏర్పాటు కాగా.. దీనికి ప్రవీణ్‌రెడ్డితో పాటు ఆయన తండ్రి నర్సింహారెడ్డి డైరెక్టర్లుగా ఉన్నారు. ప్రవీణ్‌రెడ్డి బిగ్ బ్రదర్స్‌కు సమీప బంధువు అని తెలిసింది. కాగా నల్లగొండకు చెందిన వంశీచందర్‌రెడ్డి అనే వ్యక్తి కూడా కీలకపాత్ర పోషిస్తున్నట్టు సమాచారం. ఈయన నల్లగొండ జిల్లా మిషన్ భగీరథ విభాగంలో ఇంజినీర్‌గా పనిచేస్తున్న వ్యక్తి తనయుడిగా ప్రచారం జరుగుతున్నది. ప్రధానంగా కలెక్టర్‌తో మాట్లాడి రికార్డులను సర్దుబాటు చేయడం అనే కీలక బాధ్యతను వంశీచందర్‌రెడ్డి నిర్వర్తిస్తారని విశ్వసనీయ సమాచారం. వేలకోట్ల భూముల వ్యవహారం కావడంతో కాంగ్రెస్ పెద్దతో పాటు ఇటీవల విదేశీ పర్యటనకు వెళ్లి వచ్చిన కాంగ్రెస్ ఎంపీ కూడా తెరవెనక భాగస్వామిగా ఉన్నట్టు తెలిసింది. ఈ విషయాన్ని సదరు ప్రవీణ్‌రెడ్డి రైతులకు స్వయంగా చెప్పినట్టు విశ్వసనీయ సమాచారం.
బిగ్ బ్రదర్స్ కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ప్రభుత్వ భూములపై రూపాయి పెట్టి పది రూపాయల ప్రయోజనాన్ని పొందేందుకు స్కెచ్ వేశారని అర్థమవుతున్నది . బహిరంగ మార్కెట్ ప్రకారం.. ల్యాండ్ పూలింగ్ కింద లేఅవుట్లు చేస్తే అన్ని నిబంధనలు పాటించినా ఎకరాకు కనీసంగా 2200-2500 చదరపు గజాల అభివృద్ధి చేసిన స్థలం వస్తుంది. ఇందులో వెయ్యి గజాలు సదరు రైతుకు పోతే.. ఎకరాకు 1200-1500 గజాల వరకు మిగులుతుంది.
ఎలాగూ హెచ్ఎండీఏ అనుమతులతో లేఅవుట్లు చేస్తారు గనుక కాలనీల మధ్య ఉన్న ఈ ప్రాంతంలో చదరపు గజానికి కనీసంగా రూ.60వేల వరకు ధర పలుకుతుంది. అంటే ఎకరాకు బిగ్ బ్రదర్స్‌కు వచ్చే మొత్తం రూ.7.20-9.00 కోట్లు. ఇలా సుమారు 290 ఎకరాలకు లెక్కిస్తే ఈ ప్రాజెక్టు ద్వారా వచ్చే మొత్తం రూ.2000-2600 వేలకోట్లు అవుతుంది. ఈ భూములకు ఎన్వోసీ.. అనుమతులు తేవడం.. లేఅవుట్ అభివృద్ధి, ఇలా అన్ని దశల్లో ఎంత ఖర్చు చేసినా రూ.1500 కోట్లకు పైగా మిలుగుతుందనేది ఒక రియల్ నిపుణుడి విశ్లేషణ.
సర్కారు భూములను కొల్లగొట్టేందుకు బిగ్ బ్రదర్స్ అసైన్డ్, లావణి పట్టా రైతులతో చేసుకుంటున్న ఒప్పందాలు విచిత్రంగా ఉన్నాయి. మాడ్గుల మండలంలోని కుందారం భూములను చెర పట్టేందుకు లోకంలోనే ఎక్కడాలేని విధంగా ‘కబ్జా రద్దు ఒప్పంద పత్రాలు’ తెరపైకి తెచ్చారు. తాజాగా నాదర్గుల్ భూముల వ్యవహారంలో చేసుకున్న ఒప్పందంలోని అంశాలు కూడా విస్మయాన్ని కలిగిస్తున్నాయి. అందులోని కొన్ని ప్రధానాంశాలు…