Greenfield Highway | హైదరాబాద్ సిటీ బ్యూరో, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ) : రంగారెడ్డి జిల్లా మీర్ఖాన్పేట సమీపంలో నిర్మించనున్న గ్రీన్ ఫీల్డ్ హైవేపై కాంగ్రెస్ సర్కారు మొండిగా ముందుకు పోతున్నది. ‘మా ప్రాణాలు పోయినా రోడ్డు వేయనివ్వం.. ఉన్న కొద్దిపాటు భూములను లాక్కుంటే మెమెట్ల బతకాలె’ అంటూ రైతులు అడుగడుగునా అడ్డు పడ్డా వారి ఆవేదనను పట్టించుకోకుండా నిర్బంధంగా తన పని తాను చేసుకుపోతున్నది. గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణానికి హెచ్ఎండీఏ తాజాగా టెండర్లను ఆహ్వానించింది. రావిర్యాల నుంచి ఫోర్త్ సిటీకి అనుసంధానం చేస్తూ భారీ రహదారి నిర్మాణానికి ప్రణాళికలు వేసింది. దాదాపు 40 కిలోమీటర్ల పొడవైన ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే రావిర్యాల ఇంటర్ జంక్షన్ నుంచి మీర్ఖాన్పేట వరకు, అక్కడి నుంచి ఆమనగల్ వరకు రూ.4030 కోట్లతో 8 లైన్ల వెడల్పుతో వేయనున్నారు. ఈ నెల 28 నుంచి టెండర్ల ప్రక్రియ మొదలుకానుండగా, మార్చి 21 వరకు ప్రక్రియ కొనసాగనుంది. ఓఆర్ఆర్, రీజనల్ రింగ్‌రోడ్డును అనుసంధానం చేసే ఈ మార్గానికి రతన్ టాటా గ్రీన్ ఫీల్డ్ హైవేగా హెచ్ఎండీఏ నామకరణం చేసింది.
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల పరిధిలో ఫార్మాసిటీ ఏర్పాటుకు గతంలోనే కసీఆర్ ప్రభుత్వం రైతులను ఒప్పించి 14 వేల ఎకరాలు సేకరించింది. ప్రస్తుతం ఈ భూములు ప్రభుత్వ ఆధీనంలోనే ఉన్నాయి. ఫార్మాసిటీ కోసం నాగార్జునసాగర్, శ్రీశైలం హైవే, ఔటర్ రింగు రోడ్డుకు అనుసంధానంగా విశాలమైన రోడ్ల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించింది. ఇందులో భాగంగా కందుకూరు నుంచి మీర్ఖాన్పేట (బేగరికంచె) వరకు 200 ఫీట్ల రోడ్డు నిర్మాణం పూర్తయింది. కాంగ్రెస్ సర్కార్ ఫార్మాసిటీ ప్రతిపాదనను రద్దు చేసి ఆ భూముల్లోనే ఫోర్త్‌సిటీ ఏర్పాటు చేస్తామని చెప్పింది. ఔటర్‌రింగ్ రోడ్డు ఎగ్జిట్ నంబర్ 13 కొంగరకలాన్ నుంచి బేగరికంచె వరకు 330 ఫీట్ల గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు వేసేందుకు చర్యలు చేపట్టింది. ఈ రోడ్డు వల్ల 1909 మంది రైతులు 441.34 ఎకరాల భూములు కోల్పోతున్నారు. వీరిలో చాలా మంది చిన్న, సన్నకారు రైతులే ఉన్నారు. గ్రీన్‌ఫీల్డ్ హైవే కోసం సేకరించినున్న ఈ భూములు కందుకూరు మండల పరిధిలోని లేమూరు, తిమ్మాపూరు, రాచులూరు, గుమ్మడవెల్లి (రిజర్వ్ ఫారెస్ట్), పంజగూడ (టీటీఐఐసీ), మీర్ఖాన్‌పేటలోనే ఉన్నాయి. ఫార్మాసిటీకి వేసిన రోడ్లను వినియోగించుకుంటే తమ భూములు తమకు దక్కుతాయని, అయినా ప్రభుత్వం మొండి వైఖరితో ఏకపక్షంగా ముందుకు పోతున్నదని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఒకవేళ తమ భూములను తీసుకోవాల్సి వస్తే ఎకరాకు రూ.2 కోట్లు, ఇంటి స్థలం, ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం 2023 చట్టం ప్రకారం ఎకరాకు 45 లక్షలే పరిహారం ప్రకటించింది.
మీర్ఖాన్పేట నుంచి కుర్మిద్ద, కడ్తాల్, ముద్విన్, ఆమనగల్లు మీదుగా ఆకుతోటపల్లి వరకు సుమారు 21 కిలో మీటర్ల మేర 330 అడుగల వెడల్పు రహదారి నిర్మాణానికి భూములు సేకరించేందుకు ప్రభుత్వం సర్వే చేయగా రైతులు అడుగడుతునా అడ్డుకున్నారు. అగర్మియగూడ, తిమ్మాపూరు, లేమూరు, రాచులూరు, గాజుల బుర్జుతండా, తుర్కగూడ, గుమ్మడవెల్లి, ఆకులమైలారం, మీర్ఖాన్పేట గ్రామాల రైతులు రాచులూరులో సమావేశమై భూములు ఇచ్చేది లేదని నిర్ణయించారు. కడ్తాల్ మండలం ముద్విన్ పంచాయితీ పరిధి ఎక్వాయిపల్లిలో సర్వే అధికారులను గ్రామస్తులు అడ్డుకొని వెనక్కి పంపారు. తమ అంగీకారం లేకుండా 330 అడుగుల వెడల్పుతో రోడ్డు వేయడం వల్ల తమకున్న కొద్దిపాటి భూములు రోడ్డులోనే పోతాయని ఆందోళన చేశారు. ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధి సాకిబండ తండాలోనూ సర్వేను రైతులు అడ్డుకున్నారు. దీంతో ప్రభుత్వం భారీగా పోలీసులను రంగంలోకి దింపి ఒక్కో ఊరికి పదుల సంఖ్యలో పోలీసులను పంపి అధికారులతో సర్వే చేయించింది. ఆకుతోటపల్లిలో ఒక్కో రైతును పదుల సంఖ్యలో పోలీసులు చుట్టు ముట్టి మరీ సర్వే పూర్తిచేశారు. సేకరించిన భూముల వెంట రైతులను బెరిరించి పోలీసుల నిర్బంధం నడుమ సర్వే చేసిన ప్రభుత్వం ఇప్పుడు టెండర్లకు పిలవడంతో స్థానిక రైతులు దిక్కుతోచని పరిస్థితిలో పడ్డారు.