Revanth Reddy | హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 29 (నమస్తే తెలంగాణ): ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) టోల్ టెండర్ల అంశంలో ఎంపీ రేవంత్‌రెడ్డి చేసిన ఆరోపణలన్నీ నిరాధారమేనని, టోల్‌కు సంబంధించిన సమాచారమంతా పబ్లిక్ డొమైన్‌లోనే ఉన్నదని హెచ్ఎండీఏ మరోసారి స్పష్టం చేసింది.
టెండర్ల సమాచారం ఇవ్వటంలేదంటూ రేవంత్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు శనివారం విచారించింది. ఈ సందర్భంగా హెచ్ఎండీఏ తరుఫున అడ్వొకేట్ జనరల్ వాదనలు వినిపించారు. టెండర్‌పై రేవంత్ అడిగిన సమాచారంలో చాలావరకు ఇప్పటికే అందించామని, మరికొంత సమాచార సేకరణ జరుగుతున్నదని తెలిపారు. త్వరలోనే అది కూడా అందిస్తామని, అందుకోసం రెండు వారాల సమయం ఇవ్వాలని కోరారు. దీంతో ఆగస్టు 4వ తేదీలోపు మిగిలిన పూర్తి సమాచారాన్ని అందించాలని హైకోర్టు ఆదేశించినట్టు అధికారవర్గాలు తెలిపాయి.
రేవంత్‌వన్నీ అసత్య ఆరోపణలు
బాధ్యతగల ఎంపీ పదవిలో ఉన్న రేవంత్‌రెడ్డి, ఓ ఆర్ఆర్ టెండర్ల విషయంలో హెచ్ఎండీఏపై తప్పు డు ఆరోపనలు, ప్రకటనలు చేశారని అడ్వకేట్ జనరల్ కోర్టుకు వివరించారు. తనవద్ద సరైన సమాచారం ఉన్నప్పటికీ, స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజలను తప్పుదారి పట్టించేలా ప్రకటనలు చేశారని ఆ రోపించారు. వాస్తవాలను ధ్రువీకరించుకున్న తర్వా తే ప్రకటనలు చేస్తే బాగుంటుందని, అలా కాకుండా పరిమిత సమాచారంతో ప్రభుత్వంపై బురదజల్లేలా ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ఆర్టీఐ ప్రకారం అడిగిన సమాచారం ఇచ్చేందుకు హెచ్ఎండీఏ సిద్ధంగానే ఉన్నదని చెప్పారు. టెండర్ ఆర్థిక లావాదేవీలపై తుది నిర్ణయం జరగలేదని, త్వరలోనే ఆ సమాచారాన్ని ఎంపీకి ఇస్తామని తెలిపారు.