హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ) : బిల్డింగ్ అనుమతుల విషయంలో హెచ్ఎండీఏ రూట్ మార్చింది. ఇటీవల హైడ్రా కూల్చివేతల నేపథ్యంలో అనుమతుల విధానంలో మార్పులు చేపట్టింది. గతంలో భవన నిర్మాణ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోగానే రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల ప్రమేయం లేకుండా అనుమతుల ప్రాసెస్ మొదలుపెట్టేది.
కానీ, ఇటీవల హెచ్ఎండీఏ అనుమతులు ఉన్న భవనాలను కూడా హైడ్రా కూల్చివేయడంతో అనుమతుల ప్రక్రియలో మార్పులు చేపట్టింది. ఈ క్రమంలో హెచ్ఎండీఏలోని రెవెన్యూ విభాగం ఇచ్చే క్లియరెన్స్ ఆధారంగానే అనుమతులు జారీ చేయాలని, అప్పుడే ప్లానింగ్ విభాగం సంబంధిత ఫైల్ ప్రాసెస్‌ను మొదలుపెట్టే విధానాన్ని తెరపైకి తీసుకొచ్చింది.
క్షేత్రస్థాయిలో రెవెన్యూ, ఇరిగేషన్ అధికారుల ధ్రువీకరణ కూడా ప్రామాణికంగా తీసుకోనున్నారు. అనుమతుల కోసం దరఖాస్తు చేసుకుంటే ముందుగా హెచ్ఎండీఏలోని రెవెన్యూ అధికారులు టైటిల్ క్లియరెన్స్ ఇస్తే గానీ అనుమతుల ప్రక్రియను మొదలుపెట్టకూడదనే నిబంధనలు అమలుచేస్తున్నారు. దీంతో అనుమతుల జారీ మరింత జాప్యం కానున్నది.
ఆయా సర్వే నంబర్లతో అనుమతుల కోసం ఒకసారి దరఖాస్తు చేసుకోగానే ఫీల్డ్ లెవల్ రిపోర్టు ఇప్పుడు కీలకం కానున్నది. క్షేత్రస్థాయిలో రెవెన్యూ ఆర్ఐ, ఇరిగేషన్ ఏఈ స్థాయి అధికారి నిర్ధారించాల్సి ఉంటుంది. దీనివల్ల ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. క్షేత్రస్థాయి అధికారుల పనితీరుపై అనుమతులు ఆధారపడి ఉండటమే కాకుండా, వారిచ్చే సూచనలను ప్రామాణికంగా తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో కొన్నిసార్లు రెవెన్యూపరమైన అక్రమాలకు ఆస్కారం ఉంటుందని, గతంలో మాదిరి ఇరిగేషన్ అధికారులు అక్రమాలకు పాల్పడి ఎన్ఓసీలు జారీ చేస్తే వాటిని మాత్రమే ప్రామాణికంగా తీసుకునే అవకాశం ఉంటుందని నిపుణులు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు.