తెలంగాణ రాకముందు ఏమన్నా చేసి ఉండవచ్చు. అప్పటి ఆయన అంచనాలు ఆలోచనలు అలా ఉండి ఉండవచ్చు. కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వనే ఇవ్వదనీ అనుకొని ఉండవచ్చు. ఆ మేరకే తెలంగాణ అంశంలో స్పందించి ఉండవచ్చు. అర్థం చేసుకోవచ్చు. కానీ, తెలంగాణ వచ్చాకనైనా మారాలి కదా! కానీ రేవంత్ తీసుకున్న వైఖరి ఏమిటి. ఈ వీర తెలంగాణ వాది తెలంగాణ శాసనసభ తొలి సమావేశాల్లోనే తెలంగాణకు చంద్రబాబు విద్యుత్తు వితరణకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించి సభ తీవ్ర ఆగ్రహాన్ని చవిచూశాడు. తెలంగాణ వచ్చాక రాష్ట్రం ఎదుర్కొన్న తీవ్ర సమస్య కరెంటు. వాస్తవానికి అంతకుముందు ఎన్నికల ప్రచారంలో స్వయంగా కేసీఆరే ఓ రెండేండ్ల దాక కరెంటుకు కష్టం ఉంటుందని ప్రజలకు చెప్పారు కూడా.
రాష్ట్ర విభజన చట్టం రెండు ప్రాంతాల అవసరాలను గమనించి రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే కరెంటును రెండు రాష్ర్టాలకు పంచింది. అయితే చంద్రబాబు కుట్ర చేసి తెలంగాణకు ఆ వాటా రాకుండా మోకాలడ్డాడు. జూరాల, శ్రీశైలంలో తెలంగాణ తన వాటాలో విద్యుత్తు ఉత్పత్తి చేసుకుంటే.. మంచినీటికి కొరత అనే సాకుతో అడ్డం పడ్డాడు. డెడ్ స్టోరేజీ నిల్వల సిద్ధాంతాలు ప్రచారం చేశారు. మరోవైపు రెండు రాష్ర్టాలకు హక్కు కలిగి ఆంధ్రాలో ఉన్న ప్రైవేటు విద్యుత్తు ఒప్పందాలను ఏకపక్షంగా రద్దు చేశారు.
ఓ వైపు తెలంగాణకు విద్యుత్తు అందకుండా చంద్రబాబు కుట్రలు చేస్తుంటే.. ‘లేదు లేదు.. చంద్రబాబే తెలంగాణకు కరెంటు ఇచ్చాడు’ అని రేవంత్ శాసనసభలోనే అడ్డగోలు వాదనలకు దిగాడు. అంతేకాదు ఏపీలో ఉత్పత్తి అయిన కరెంటులో వాస్తవానికి 42 శాతమే ఇవ్వాల్సి ఉన్నా 54 శాతం తెలంగాణకు ఇస్తున్నాడని చెప్పాడు. రాష్ట్ర విభజన చట్టంలోని 12వ షెడ్యూల్ ప్రకారమే తెలంగాణకు 54 శాతం రావాలి. దీన్ని ఎగ్గొట్టడానికే చంద్రబాబు అధికారంలోకి రాగానే విద్యుత్తు ఒప్పందాలను రద్దుచేశారు. ఆ రద్దుతో తెలంగాణ వాటా రాకుండాపోయింది. అయినా బాబుగారి మీద రేవంత్ ఈగ వాలనివ్వలేదు. ఇదీ ఆయన తెలంగాణవాదం.
అంతేకాదు.. తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టుకు అడుగడుగునా అడ్డుపడ్డ చరిత్ర రేవంత్‌ది. వాస్తవానికి మహారాష్ట్రతో ఒప్పందం కుదరగానే తుమ్మిడిహట్టి వద్దనే ప్రాజెక్టు నిర్మించాలని పార్టీ మొత్తాన్ని జలసౌధ ముందుకుతెచ్చి నానా రభస చేయించారు. అక్కడ 152 మీటర్ల ఎత్తుకు మహారాష్ట్ర అంగీకరించిందని ఆ పత్రాలున్నాయని ప్రకటించిన రేవంత్ వాటిని సీఎంకు పంపారో లేదో మనకు తెలియదు. చంద్రబాబు ప్రాజెక్టులను అడ్డుకుంటున్నాడని కేసీఆర్ అంటే ‘పైవాడు ప్రాజెక్టులు కడితే కిందివాడు ఆపగలడా?’ అంటూ లాజిక్కు లేవదీశాడు. అయితే కేంద్రం, జలసంఘం, అనుమతులు, ఫిర్యాదులు అనే వ్యవహారం ఉన్నదనే విషయం రేవంత్‌కు తెలిసినట్టు లేదు. ఏపీ ఫిర్యాదు మేరకే తెలంగాణ ప్రాజెక్టులకు క్లియరెన్స్ రాక ఇబ్బందులు పడ్డాం. అయినా రేవంత్‌కు అది పట్టలేదు.
Revanth Reddy | సెల్ఫ్‌గోల్ చేసుకోవడంలో రేవంత్‌కు మించిన నాయకుడు ఎవరూ తెలంగాణలో కాగడా పెట్టి వెతికినా దొరకడు. సవాళ్లు చేయడం, తోక ముడవడంలో రేవంత్ రికార్డును ఎవరూ చెరపలేరు. ఉమ్మ డి రాష్ట్రంలో, నాటి అసెంబ్లీలో రెచ్చిపోయి మాట్లాడుతూ చీరాల ఎమ్మెల్యే ఆమంచి కష్ణమోహన్పై వచ్చిన ఇసుక కుంభకోణం విషయంలో రోశయ్యపై రేవంత్ ఆరోపణలు చేశారు. దీనికి తీవ్రంగా స్పందించిన నాటి సీఎం రోశయ్య తన ప్రమేయం రుజువు చేస్తే శాశ్వతంగా రాజకీయాలు వదిలేస్తానని, ధైర్యం ఉంటే చెప్పమని నిండు సభలో సవాలు చేశారు. విచారణ పెట్టించు. ముద్దాయిగా వస్తా అంటూ రెట్టించి నిలదీశారు. తోక ముడిచిన రేవంత్ రోశయ్యపై తాను ఎలాంటి ఆరోపణ చేయలేదని తాను విజిలెన్స్ నివేదిక పంపానని మాత్రమే చెప్పానంటూ జారుకున్నా డు. ఆ తర్వాత తొలి తెలంగాణ శాసనసభలో ‘ఓ దొర ఇంకో దొరకు లాభం చేకూర్చడానికే సిమెంట్ ధరలు పెంచారని’ నిండు సభలో ఆరోపించారు. తీవ్రంగా స్పందించిన సీఎం ఆ రోజున ఏపీలో సిమెంటు ధరలు తెలంగాణ కన్నా అధికంగా ఉన్న విషయం ప్రకటిం చి..‘మరి ఏపీలో ఎవరి ప్రయోజనం కోసం ధర పెంచారో చెప్పాలని’ నిలదీస్తే నీళ్లు నమిలాడు. ఆరోపణలు చేసేటప్పుడు హోమ్‌వర్క్ చేయాలన్న ఆలోచన లేకపోవడం రేవంత్ స్పెషాలిటీ. అదేకాలంలో మెడికల్ కాలేజీల ఫీజుల పెంపునకు ప్రభుత్వం అనుమతించింది.
ఆ వెంటనే రేవంత్ వంద కోట్లు చేతులు మారాయని గాలి ఆరోపణలు చేశారు. స్పందించిన మెడికల్ కాలేజీల యాజమాన్యాలు ‘అన్ని కాలేజీలు కలిపి పెంచిన ఫీజుల మొత్తమే 30 కోట్లయితే వంద కోట్లు ముడుపులు ఎట్లా ఇస్తామని’ ఉతికారేశారు. దానిమీద ఓ కేసు కూడా నమోదైంది. అయినా ఈ సెల్ఫ్‌గోల్ ఆగలేదు. పట్టువదలని ఈ విక్రమార్కుడు నిండు శాసనసభలోనే ‘ఎంపీ కవితకు రెండుచోట్లా ఓట్లున్నాయని ఓ సన్నాసి పత్రికలో వచ్చిన వార్త ఆధారంగా ఆరోపించి.. ఆనక ఆ విషయం అవాస్తవమని తెలిసి నాలుక్కరుచుకున్నాడు. మహిళా శాసనసభ్యులంతా కవితకు క్షమాపణ చెప్పాలని ఆ సభ సమావేశాల పర్యంతం ఆయన వెంటపడి తలంటు కార్యక్రమం చేశారు. 2014లో అమెరికాలో నివసించే విజయకేసరి అనే తెలంగాణ బిడ్డపై ఇలాగే ‘ఆమె వాళ్ల అంకుల్‌కు సోలార్ ప్లాంటుకు పైరవీలు చేస్తున్నద’ని ఆరోపించారు. ఆమె సోషల్ మీడియాలో కౌంటర్ వీడియో పెట్టి ‘మేము టీడీపీ అనుకున్నావా? నీలాగ అనుకున్నావా?’ అంటూ కడిగిపారేశారు. తెలంగాణలో విద్యుత్తు కొరత మీద అప్పట్లో సోషల్ మీడియాలో బాగా చర్చ జరిగింది. తెలంగాణ బాగుండాలని కోరుకునేవాళ్లు అనేక పరిష్కారాలు చెప్పారు. అందులో భాగంగా విజయకేసరి సోలార్ ప్లాంట్ల ప్రస్తావన తెచ్చారు. సోలార్కు కేంద్రం భారీ సబ్సిడీ ఇస్తున్నందున ఆ విధానం ప్రోత్సహించాలని సూచించారు. విద్యుత్తు అంశంలో చంద్రబాబుకు రేవంత్ అనుకూలతను కడిగిపారేశారు. సీను రివర్సై సీటీ సితార కావడం రేవంత్‌కు కొత్తేం కాదు.
2016 ఫిబ్రవరిలో సీఎం దత్తత గ్రామం చిన్నముల్కనూర్‌లో డబుల్ బెడ్రూంలు కట్టడం లేదంటూ షో చేయాలని టీడీపీ ప్లాన్చేసింది. రేవంత్ ఆధ్వర్యంలో ఆ పార్టీ గ్రామానికి వెళ్లింది. వీళ్లతో మాట్లాడేందుకు ఎవరూ ముందుకురాలేదు. ఆఖరికి చిలుకమ్మ అనే గృహిణిని పట్టుకొని మీడియా ముందు ఏదో మాట్లాడించబోయారు. అయితే ఆవిడ సీఎం సారే మా ఇంటికి ముగ్గుపోసిండు. ఇల్లు కట్టిస్తడు మాకు నమ్మకం ఉన్నదని స్పష్టం చేయడంతో తెల్లమొహం వేయడం రేవంత్ వంతైంది.
ప్రాక్టీసు లేని ప్లీడరు దేశాభిమాని అయినట్టు. ఈయన కాంగ్రెస్‌లో చేరినప్పటి నుంచి సోనియా అభిమాని అయ్యాడు. టీడీపీలో ఉన్నప్పుడు ‘తెలంగాణ ఎవ్వరి దయ వల్ల రాలేదు. 1,200 మంది యువకులు బలిదానం చేసుకోవడం వల్ల ఇచ్చారు. ఎవరికీ కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం లేదన్నాడు. సోనియా బలిదేవత. వందల యువకుల ప్రాణాలు బలిగొన్నదని మీడియా ముందు చెప్పాడు. కాంగ్రెస్‌లో చేరగానే సోనియా దేవతయిపోయింది. పిల్లల బలిదానం చూసి తెలంగాణ ఇచ్చిందనే వాదన ఎత్తుకున్నాడు. సోషల్ మీడియా అప్పటి ఇప్పటి మాటలు చూపిస్తుంటే ప్రజలు నవ్వుతున్నారు. కాంగ్రెస్‌లో చేరగానే అక్కడా రాజకీయాలు ప్రారంభించారు. హుజూర్నగర్ అభ్యర్థి విషయంలో ఉత్తమ్ ఏకపక్ష నిర్ణయమంటూ అసమ్మతి రాజేశాడు. కుంతియాకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత పార్టీ సీనియర్ల మీద సోషల్ మీడియాలో దుష్ప్రచారాలను ప్రారంభించారు. ఈయన రాజకీయాలకు విసిగి ఏలేటి మహేశ్వర్‌రెడ్డి పార్టీ వదిలేసి పోయారు. ఈయన అధ్యక్షుడయ్యాక దానికి నిరసనగా మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే కొచ్చెన్నగారి లక్ష్మారెడ్డి పార్టీకి గుడ్‌బై చెప్పారు. హుజూరాబాద్ ఎన్నికల్లో గతంలో పార్టీ చరిత్రలో ఎన్నడూ రానన్ని తక్కువ ఓట్లతో పార్టీ పరాజయం పాలైంది. ఏ ముఖం పెట్టుకొని తిరగాలని సీనియర్లు విరుచుకుపడ్డారు. రేవంత్‌ను అధ్యక్షుడిని చేసినందుకు నిరసనగా ఎంపీ రాజగోపాల్‌రెడ్డి కూడా పార్టీకి గుడ్‌బై చెప్పారు. జైలుకు వెళ్లివచ్చి న వ్యక్తితో కలిసి పనిచేయలేనని అన్నారు. రేవంత్‌ను చీటర్, బ్లాక్ మెయిలర్ అని అభివర్ణిస్తూ మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత మర్రిశశిధర్ రెడ్డి కూడా రాజీనామా చేశారు. అధ్యక్షుడి హోదాలో ఆయనను రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేయమంటే తన అనుచరులకే పదవులిచ్చుకోవడం కాంగ్రెస్‌లో అగ్గి పుట్టించింది. దీనితో రేవంత్‌వర్గం రాజీనామా ఇవ్వక తప్పలేదు.
కాంగ్రెస్ విధానాలన్నీ ఢిల్లీలో నిర్ణయమవుతాయి. కానీ రేవంత్ ఎవరితో సంప్రదించకుండా కీలక అంశాల మీద పార్టీ విధానాలు ప్రకటించి పార్టీని ఇరకాటంలోకి నెడుతున్నాడని కాంగ్రెస్ సీనియర్లు లబోదిబోమంటున్నారు. ధరణిని ఎత్తేయాలని 2022 నవంబర్ 21న కాంగ్రెస్ ప్రతినిధి బృం దం ఏకంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కాంగ్రెస్ తరఫున వినతిపత్రం ఇవ్వడం పెద్ద వివాదాంశమైంది. దీనిమీద పార్టీలో చర్చలేదు. సీనియర్లతో సంప్రదింపుల్లేవు. అధిష్ఠానం అనుమతి లేదు. అంతా ఏకపక్ష వ్యవహారం. ఈ డిమాండ్ పార్టీని ఉంచిందా.. ముంచిందా? అనేది ఇప్పటికీ సీనియర్లకు అర్థం కావడం లేదు. ఎందుకంటే పాత పద్ధతి అంటే పటేల్, పట్వారీల వ్యవస్థే. లేదా ఎమ్మార్వో ఆఫీసులు లంచా లు, సర్వే నంబర్ల మార్పు ఇష్టారాజ్యపు రిజిస్ట్రేషన్లు. ఇవి కావాలని ప్రజలు కోరడం లేదు. దీనిపై వెంటనే బీఆర్ఎస్ స్పందించి దాడికి దిగడంతో ఏం చేయాలో అర్థం కాని స్థితి. ఇక 3 గంటల విద్యుత్తు వివాదం సరేసరి. పార్టీని పుట్టిముంచబోతున్నది.
నోటికి హద్దేలేదు..
తెలంగాణలో జెండకిడిసిన ఎద్దు అనే వ్యవహారికమొకటుంది. కొన్ని ఎడ్లను వాటి యజమానులు మొక్కుల పేరు మీద వదిలేస్తారు. దానికి ఏ హద్దూ పద్దూ ఉండదు. ఏ దొడ్లోనైనా దూరుతుంది. ఏ పొలంలోనైనా మేస్తుంది. తరిమేస్తే పరుగు తీస్తుంది. ఎవరూ పట్టించుకోరు. ఆ వైఖరి కొంతమంది నాయకులకూ ఉన్నది. ఎవరినైనా ఏమైనా అనొచ్చు. అచ్చొత్తడానికి కేసీఆర్ అంటే నిలువెల్లా విషం నింపుకొన్న బాజాలు ఉండనే ఉన్నాయి. కనీస పాత్రికేయ విలువలనేవి ఆ జెండాకు వదిలేసిన పాత్రికేయులకూ లేదు. ఒక అజ్ఞా ని, అయోగ్యుడు ఏదైనా దూషణ చేస్తాడు. దాన్ని వార్త నుంచి ఉపసంహరించవచ్చు. లేదా దాని డెప్తును తగ్గించనూవచ్చు. కానీ బాజాలు ఆ మాటలను యథాతథంగా బాగా కనిపించేలా పత్రికలో అతికించుకొని స్వయంతృప్తి పొందుతూ ఉంటాయి. ఇది తెలంగాణ దౌర్భాగ్యం. రేవంత్‌కు హుందా రాజకీయం తెలియ దు. ఎంత బాగా తిడితే బాజాలు అంతబాగా ప్రచారం చేస్తున్నారు కాబట్టి రోజురోజుకూ దూషణలకు, బూతులకు సానపెట్టి మాటలు మాట్లాడుతాడు. సభ్యత, అసభ్యత ఉండదు. కనీసం ఇంగితం లేకుండా పసి పిల్లాడిని పట్టుకొని పందులు అంటాడు. రాష్ట్ర సాధనలో రెండు దశాబ్దాలు వయసు, శక్తి కరిగించుకున్న నేతను పట్టుకొని పిండం పెడతానంటాడు. అమెరికాలో పనిచేసే తెలుగు ఐటీ ఉద్యోగులందరినీ అవమానించేలా కేటీఆర్ దొడ్లు కడిగాడని అంటాడు. సచివాలయ పునర్నిర్మాణం చేపడితే దానికింద నిధుల కోసమే కేసీఆర్ నిర్మాణం చేపట్టాడంటాడు. బహిరంగ ప్రదేశంలో నిధులు తవ్వుకుపోవడం ఎలా సాధ్యమో ఆయనకే తెలియాలి. ఇంతకూ ఆ నిర్మాణంలో ఎన్ని నిధులు దొరికాయో చెప్పినట్టు లేదు. ప్రగతిభవన్‌ను నక్సలైట్లు పేల్చేయాలని అంటాడు. నోటికి హద్దూ పద్దూ లేదు. అంతా జెండాకు వదిలేసిన ఎద్దు వ్యవహారం.
కుల దూషణలు…
రాజకీయాల్లో ఉన్నప్పుడు నాయకులకు సంయమనం ఉండాలి. సమదృష్టి ఉండాలి. సమాజంలోని వివిధ వర్గాలతో సంబంధాలు నెరపాలి. అది రేవంత్‌కు తెలియదు. ఎవరి మీద పడితే వారి మీద నోరు పారేసుకోవడం.. అదే తన గొప్ప అనుకోవడం ఆయనకలవాటు. ఈ దూలతో కాంగ్రెస్ అధ్యక్ష స్థానంలో ఉండీ సమాజంలోని అనేక వర్గాలను దూషించాడు. తలసానిని ఉద్దేశించి ‘పెండ పిసుక్కునేవాడివి..’ అంటూ వ్యాఖ్యానించడం పెద్ద రభసగా మారింది. సంచారజాతికి చెందిన పిచ్చుకుంట్ల కులాన్ని కించపరిచి బండెడు తిట్లు తిన్నాడు. సీనియర్ నేత దళిత వర్గానికి చెందిన కడియం శ్రీహరిని కూడా దొర బూటు కాలు నాకు.. అంటూ అసెంబ్లీ సాక్షిగా మాట్లాడి దళితులను కూడా కించపరిస్తే అదో పెద్ద వివాదంగా మారింది. మరో సందర్భంలో గౌడ కులస్థులను కూడా అవమానించాడు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలేమిటి? సమాజంలోని వివిధ వర్గాలకు ఆ పార్టీలో ఉన్న స్థానం ఏమిటి? ఆ విషయంలో ఎలా ప్రవర్తించాలనేది కొత్తగా కాంగ్రెస్ నామాలు పెట్టుకున్న రేవంత్‌కు చెటాకు మందం కూడా తెలియదు. తన కులస్థుల సమావేశానికి వెళ్లి ఆయన చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో రచ్చరచ్చ అయ్యాయి. ఒక కులాన్ని గెలిపించడానికి మేం పనిచేయాలా? అంటూ బీసీ వర్గాలు మండిపడ్డాయి.
రేవంత్ నోటిదూలకు ఆ పార్టీ జాతీయస్థాయి నేత శశిథరూర్ కూడా బలయ్యాడు. తెలంగాణలో ఐటీ రంగం అభివృద్ధిని ఆయన మెచ్చుకున్నారు. కేటీఆర్‌ను ప్రశంసించారు. ఇది రేవంత్‌కు జీర్ణం కాలేదు. ‘ఇక్కడ ఏం జరుగుతుందో ఆ బేవకూఫ్కు తెలిసుండాలి. నాలుగు ఇంగ్లిష్ ముక్కలు వచ్చినంత మాత్రాన అది గొప్ప కాదు. నా దృష్టిలో వాడో గాడిద. ఇలాంటివాళ్లను పార్టీ నుంచి బహిష్కరించాలి’ అనేశాడు. ఇది మీడియాకెక్కడంతో ముందు బుకాయించాడు. తర్వాత ఆడియో బయటపడి తేలుకుట్టిన దొంగలా చిక్కుకుపోయాడు.
పార్టీ సీనియర్ నేత మనీశ్ తివారి రేవంత్‌కు తలంటుపోసి వార్నింగ్ ఇచ్చాడు. శశిథరూర్ చాలా కూల్‌గా ‘ఆయన తన మూలాలను గుర్తుచేసుకుం టూ సోదరభావాలను వ్యక్తం చేశారేమో’ అంటూ పట్టుబట్టలో చెప్పు పెట్టి కొట్టినట్టు జవాబిచ్చి పరువు తీశారు. మునుగోడు ఎన్నికల సమయంలో కమ్యూనిస్టులు అమ్ముడు పోయారంటూ వ్యాఖ్యానించి వా రి ఆగ్రహానికి గురయ్యాడు. బీజేపీని గెలిపించేందుకు నువ్వెంతకు అమ్ముడుపోయావని వారు ఎదురుదాడికి దిగారు. అదేంటో కానీ ఆ ఎన్నికలో 25 కోట్లు చేతులు మారాయని ఈటల ఆరోపించడం.. భాగ్యలక్షి టెంపు ల్ ముందు కన్నీటి సంజాయిషీలు అందరూ చూశా రు. ఆరోపణలు ఎదురుతిరిగితే ఎలా ఉంటుందో తెలిసివచ్చి ఉంటుంది. మరో సందర్భంలో రాష్ట్రంలో బీహార్ ఐఏఎస్‌లు అంటూ వ్యాఖ్యానించి సీనియర్ల ఆగ్రహానికి గురయ్యాడు. కాంగ్రెస్ ఒక జాతీయ పార్టీ అది అన్ని ప్రాంతాలను కలుపుకొనిపోవాలి. కానీ రేవంత్‌కు అంత కాంగ్రెస్ విజ్ఞానం లేదు. బీహారీలు అంటూ వాళ్లేదో శత్రువులన్నట్టు వ్యాఖ్యానించడం పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టింది. కేటీఆర్ మీద రక్తం డీఎన్ఏ టెస్టులు అంటూ వివాదం లేవదీస్తే కోర్టు ఈ విషయంలో మరోసారి మాట్లాడవద్దని హెచ్చరించింది.
ఏ ఆకుపసరు తాగారు?
రాష్ట్రంలో కేసీఆర్ విశ్వరూపం ముందు ఏ పార్టీ నిలవడం లేదు. ఉన్న ప్రతిపక్షాల్లో కాంగ్రెస్ కాస్త ముం దుంది. దానికే ఇగ రేపే అధికారంలోకి వచ్చేసినట్టు రేవంత్ పిట్టకథలు. దానికి జ్యోతిలక్ష్మి వంతలు. ఏదో సామెత చెప్పినట్టు.. కాంగ్రెసోళ్లు ఏమన్నా హిమాలయాల్లోకి వెళ్లి ఆకు పసరు తాగారా? లేక గాంధీభవన్‌లో ఏవైనా శక్తి లేపనాలు పూస్తున్నారా? రాష్ట్రంలో ఏం అద్భుతం జరిగిందని కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి.. ఇంతకీ రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ఉన్న క్రెడిబిలిటీ ఎంత? ప్రజల్లో వాస్తవ ఆదరణ ఎంత? వాళ్ల మాటలను ప్రజలు నమ్మేస్థితిలో ఉన్నారా? క్షేత్రస్థాయి వాస్తవాలు చూస్తే అర్థమవుతుంది. అసలు వాస్తవమేమిటి? మొన్నటిదాక కాంగ్రెస్ చచ్చిన శవంలా పడి ఉంది. బీజేపీ దూసుకుపోతుంటే కాంగ్రెస్‌తో లాభం లేదని బీజేపీ వైపు చూసింది కాంగ్రెస్ నాయకులే. కొందరు చేరారు కూడా. ఇవాళ కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచిందట. ఇక్కడా గెలుస్తుందట. ఈ బాదరాయణ సంబంధం ఏమిటో ఎవరికీ అర్థం కాలేదు. అసలు కర్ణాటకకు తెలంగాణకు పోలిక ఏమిటి? ఏ విషయంలో పోలిక ఉంది? అక్కడిలాగ ఇక్కడ మతపరమైన ఉద్రిక్తతలు చెలరేగాయా? హిజాబ్‌లు, ఆజాలు, గుళ్ల ముందు నుంచి మైనారిటీ ల తరిమివేతలు జరిగాయా? పత్రికా సంపాదకుల హత్యలు జరిగాయా? కాంట్రాక్టర్లు కమీషన్లు ఇవ్వలేక ఆత్మహత్యలు చేసుకున్నా రా? సర్వత్రా 40 పర్సంట్ అనే అవినీతి రాజ్యమేలిం దా? అక్కడి ప్రజలు బీజేపీని ఓడించాలన్న ఏకైక లక్ష్యంతో కసిగా ఓట్లు వేసిన పరిస్థితి ఇక్కడేమన్నా ఉందా? వచ్చిందా? అసలు జరిగిందేమిటి? హిందూ కార్డు మీద మోదీ మ్యాజిక్ మీద ఉన్న భ్రమలన్నీ కర్ణాటక ఎన్నికతో పటాపంచలయ్యాయి.
తెలంగాణలో కూడా బీజేపీ వాటినే నమ్ముకొని రాష్ట్రం మీద పడి నోరు పారేసుకొని ప్రచారం పొందింది. జ్యోతిలక్ష్మి లాంటి పత్రికలు వాటికి విశేష ప్రచారం ఇచ్చాయి. అటు కేంద్రంలో బలంగా ఉండటం.. ఇటు ప్రభుత్వాలను కూల్చివేస్తూ రావటం.. ఈడీ, సీబీఐలను ప్రయోగించి రాజకీయ భీతావహ వాతావరణాన్ని సృష్టించడంతో ఆ ధైర్యంతో ఇక్కడ బీజేపీ నాయకులు రెచ్చిపోయారు. మోదీ మ్యాజిక్‌లో ఎక్కడెక్కడో గెలుస్తున్నాం. అలా తెలంగాణలో కూడా మ్యాజిక్ ఫలిస్తుందేమోనన్న ఆశ వాళ్లను వాళ్ల నోళ్లను నిలువనీయలేదు. దానికితోడు ఒకటి, రెండు సీట్లలో సాధించిన విజయం ఇక్కడి నాయకులకన్నా కేంద్ర నాయకులకు తెలంగాణ మీద ఆశలు రేపాయి. అందుకే జాతీయస్థాయి బీజేపీ మంద తెలంగాణ మీద పడింది. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ క్యాడర్లో ఉత్సాహం నింపే పరిస్థితి లేని స్థితి. ఎంతసేపు గాంధీల పేరు చెప్పుకొని గెలిచే అలవాటున్న రాష్ట్ర నాయకులు ఈ స్థితిలో ఇమడలేని పరిస్థితి వచ్చింది. దానికి తోడు రాష్ట్రంలో జరిగిన అన్ని ఎన్నికల్లో పార్టీ గుండుసున్నాగా మారడంతో నిస్పృహ చెందారు. కేంద్రంలో ఇప్పట్లో అధికారం చూస్తామనే నమ్మకం లేకపోవడం ఇటు రాష్ట్రంలో బీఆర్ఎస్తో పాటు బీజేపీ రంగంలో ఉండటంతో ఆ పార్టీ శ్రేణులన్నీ కాంగ్రెస్ మీద ఆశలు వదిలేసుకున్నాయి. పార్టీ చచ్చిన శవంలా మారింది. రేవంత్ పాదయాత్రలు చేసినా పాకుడుయాత్రలు చేసినా పచ్చమీడియా ఎంత డబ్బా కొట్టినా అవేవీ ప్రజల్లోకి వెళ్లలేదు. కాళ్లు పీకుడే తప్ప అదనంగా ఒక్క ఓటును తెచ్చింది లేదు.
ఈ సమయంలో కర్ణాటక ఫలితం ఇక్కడ మహోత్సాహంతో దూకుతున్న బీజేపీని హతాశులను చేసిం ది. అప్పటికే మునుగోడు అపజయం వారిని కుంగదీయగా.. కర్ణాటక ఫలితం చూపించి ఇక్కడ చెలరేగిపోతామని నాయకులనుకున్నారు. కానీ, ఫలితాలు భిన్నంగా రావడం, మోదీ మ్యాజిక్ తుస్సుమనడంతో నాయకులంతా జావగారిపోయారు. పార్టీ కుప్పగూలింది. బీజేపీ ఆర్ఎస్ఎస్ ఎత్తుగడలు బాగా తెలిసిన రాజకీయ విశ్లేషకులు చెప్పేదేమిటంటే.. వాస్తవానికి కర్ణాటక ఎన్నిక పేరుతో బీజేపీ లోక్‌సభ ఎన్నికలకు రిహార్సల్ చేసింది. అక్కడ హిందూకార్డును మిలిటెంట్ స్థాయిలో తీసుకొని రాష్ర్టాన్ని అల్లాడించింది. మత ఉద్వేగాలు భారీగా రెచ్చగొట్టింది. ఆఖరికి ప్రధాని స్థాయి వ్యక్తి హనుమాన్ చాలీసా అంటూ హిందూకార్డును విచ్చలవిడిగా వాడారు. అయితే ఆ ఎత్తుగడ ఎదురు తన్నింది. సాంప్రదాయంగా బీజేపీకి ఓట్లు వేసేవారు కూడా ఈ తీవ్ర వైఖరిని చూసి ఆందోళన పడ్డారు, కాంగ్రెస్‌కు ఓట్లేశారు. కర్ణాటక జారిపోయింది. దీనితో ఈ వైఖరి ఉత్తర భారతంలో తప్ప దక్షిణ భారతంలో వర్కవుట్ కాదనే బీజేపీకి జ్ఞానోదయమైంది. అదే సమయంలో తెలంగాణలో అప్పటిదాక హిందూకార్డును ఆ స్థాయిలోనే విచ్చలవిడిగా వాడుతున్న పార్టీ అధ్యక్షుడిని పదవినుంచి తప్పించింది. ఆ స్థానంలో వివాదాలకు దూరంగా ఉండే కిషన్‌రెడ్డిని తెచ్చింది.
కర్ణాటక ఫలితమే ఇక్కడా రిపీట్ కారాదనే ఆ పార్టీ వ్యూహంలో భాగం. అంతేకాదు జాతీయ నాయకుల పర్యటనలు కూడా తగ్గించింది. దానికి అనుగుణంగానే మీడియాలో ఆ పార్టీ వేడి తగ్గిపోయింది. అలా రాష్ట్రంలో బీజేపీ గ్రాఫ్ పడిపోయిందనే ప్రచారం జరిగింది. బీజేపీ గ్రాఫ్ పడిపోవడంతో సహజంగా తర్వాత స్థానంలో ఉన్న కాంగ్రెస్ గ్రాఫ్ అటోమెటిక్‌గా ఆ స్థానంలోకి వచ్చింది. ఒకరకంగా చెప్పాలంటే నిన్నటిదాక రాష్ట్రంలో రెండో స్థానం కోసం కాంగ్రెస్, బీజేపీ మధ్య సాగిన పోటీలో అప్పుడు బీజే పీ పైచేయిగా ఉండేది. ఇప్పుడు ఆ స్థానంలో కాంగ్రెస్ వచ్చింది. అంటే ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్‌ది రెండోస్థానం. బీజేపీది మూడో స్థానమంతే. బాజా కృష్ణుడు కలగంటున్నట్టు కాంగ్రెస్ మొదటిస్థానంలోకి రాలేదు. అధికారం అందుకునేంత సీను లేదు. ఆ మాటకు వస్తే ఆ పార్టీ తరపున కచ్చితంగా గెలుస్తామని చెప్పేందుకు పట్టుమని పాతిక, ముప్పై మంది అభ్యర్థులు కనిపించడం లేదు. పచ్చ మీడియా చేస్తున్న భజనే తప్ప క్షేత్రస్థాయిలో ప్రజల్లో అలాంటి భావనా లేదు. ఈ మధ్య కేసీఆర్ ప్రకటించిన పది పథకాలతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం ఉసూరుమంది. పోనీ జాతీయస్థాయిలో ఏదో ఇండియా అంటున్నారు, జోడో యాత్రలు అంటున్నారు. దానివల్ల ఏమైనా గ్రాఫ్ పెరిగిందా? అంటే అది పెరిగిందో లేదో కానీ పార్టీ నాయకుడి ఫ్లయింగ్ కిస్సుల బాగోతం అసలుకే ఎసరు తెచ్చింది. గాలిమద్దుల రాయుడి నేతృత్వంలో పార్టీ ముందుకు పోతుందన్న నమ్మకమూ సన్నగిల్లింది.
హెడ్డాఫీసుకే దిక్కులేదు..
రాష్ట్రం సంగతి పక్కన పెట్టండి. అసలు దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ స్థానమెంత? ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్ని రాష్ర్టాల్లో కనీస స్థానాలు గెలుచుకునే అవకాశముంది? అనే విషయం విశ్లేషిస్తే కర్ణాటక గెలుపు అనే డొల్ల సిద్ధాంతం అసలు రూపం బయటపడుతుంది. ఉత్తరప్రదేశ్‌లో ఐదోస్థానం, బీహార్‌లో నాలుగోస్థానం, పశ్చిమ బెంగాల్లో మూడో స్థానం, మహారాష్ట్రలో నాలుగో స్థానం.. ఇదీ కాంగ్రెస్ పరిస్థితి. ప్రాంతీయ పార్టీలు లేని రాష్ర్టాల్లో గతిలేక కాంగ్రెస్‌కు ఓటు పడుతున్నది గాని అది ఖాయంగా ఎక్కడా బలమైన ప్రతిపక్షం కూడా కాదు. వందేండ్ల పార్టీ కాబట్టి దశాబ్దాలపాటు అధికారంలో ఉంది కాబట్టి ఆ పార్టీకి కొంత క్యాడర్ ఉండవచ్చు. నాయకులూ ఉండవచ్చు. అంతే తప్ప గెలిచే స్థాయిలోగాని గెలిపించే స్థాయిలో కానీ ఆ పార్టీ లేదు. నాయకులు అంతకన్నా లేరు. దేశంలో ఎక్కడ, ఏ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీ పుట్టినా మొదటి దెబ్బ ఆ పార్టీ మీదనే పడుతుంది. మహారాష్ట్రలో ఎన్సీపీ పుట్టగానే ఆ పార్టీ పతనం ప్రారంభమైం ది. బెంగాల్ మమత పార్టీతో అడ్రసే గల్లంతయ్యింది. యూపీ, బీహార్, ఒడిశాలో ప్రాంతీయ పార్టీల దెబ్బకు ఇప్పటికీ కోలుకోలేవడం లేదు.
మరి తెలంగాణలో ఏ ప్రాతిపదికన బలం పుంజుకుంటుంది? ఏ ప్రాతిపదికన అధికారంలోకి వస్తుంది. కొత్తగా శిబి చక్రవర్తి లేదా బలి చక్రవర్తి పార్టీ పగ్గాలేమన్నా చేపట్టారా? అసలు కొత్త నాయకత్వం రాక ముందు.. వచ్చిన తర్వాత జరిగిన ఎన్నికల్లో పార్టీ పరిస్థితి ఏమిటి? మొన్న దుబ్బాకలో వచ్చిన ఓట్లెన్ని? హుజూరాబాద్‌లో వచ్చిన ఓట్లెన్ని? నిన్న మునుగోడులో వచ్చిన ఓట్లెన్ని? అవన్నీ వదిలేస్తే జీహెచ్ఎంసీలో వచ్చిన సీట్లెన్ని? ఓట్లెన్ని? రాష్ట్రంలో ఒక్క జెడ్పీ కూడా గెలవలేదు. మున్సిపాలిటీలు ఎంపీపీల్లో చెప్పుకోదగ్గ నంబరూ లేదు. ఆ పార్టీలో ఈ పార్టీలో చోటులేక రోడ్డు మీద పడ్డ నాయకులను చేర్చుకుంటే అది బలమా?
భావదారిద్య్రం…
ఇటీవల ఖమ్మంలో కాంగ్రెస్ సభ జరిగింది. త్వరలో ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతాయి. ఆ నేపథ్యంలో జరిగిన సభ. ఆ సభలో ఆ పార్టీ నేత రాహుల్ ఏం చెప్పారు? ఈ రాష్ర్టాభివృద్ధికి ఏం చేస్తానన్నారు? ఏదైనా ప్రాజెక్టు కడతానన్నారా? లేదు వ్యవసాయరంగంలో నూతన మార్పులు తెచ్చి రైతులను రాజులను చేస్తామన్నారా? పరిశ్రమల అభివృద్ధికి ఎలా కృషి చేస్తాడో చెప్పాడా? లేదూ ఐటీ రంగాన్ని తనదైన ఏదైనా పథకంతో ఉరకలెత్తించి యువతకు లక్షల ఉద్యోగాలిస్తానన్నాడా? ఈ రాష్ట్ర సహజ వనరులను వినియోగించి అద్భుతాలు సృష్టిస్తానన్నాడా? వందేండ్ల పార్టీకి నాయకత్వం వహించే నాయకుడికి ఎంత దూరదృష్టి ఎంత గొప్ప విజన్ ఉండాలి? ఒకప్పుడు ఇదే పార్టీలో ఎందరు మహామహులు ఉండేవారు? ఎన్నెన్ని గొప్ప పథకాలు రూపుదిద్దేవారు? గ్రీన్ రెవెల్యూషన్, గ్రామీణ ఉపాధి పథకం, భూ సంస్కరణలు, సమాచార చట్టం, బ్యాం కుల జాతీయీకరణ.. ఇలా ఎన్నెన్ని విప్లవాత్మక పథకాలు రూపుదిద్దారు? అలాంటి పార్టీ ఇప్పుడెలా మారిపోయింది. మోదీకి నేను పోటీ అని ప్రచారం చేసుకునే నాయకుడు నాలుగువేల పింఛన్ ఇస్తామంటూ పళ్లిగిలించి ప్లకార్డు ప్రదర్శించే స్థాయికి దిగజారుతాడా?. ఈ ప్రదర్శనతో రాష్ర్టానికి, దేశానికి ఏం సందేశం ఇస్తున్నారు? కాంగ్రెస్ ఇప్పుడు ఒక ఖాళీ బుర్ర. దేశానికి ఏం కావాలో రాష్ర్టాలకు ఏం కావాలో తెలియని మేధోదారిద్య్రం ఆవహించిన శిథిల శిబిరం.
ఏవేవో పెద్ద పెద్ద పదవులు వస్తాయేమోనని కలలు కంటూ అడ్డమైన రాతలు రాసే జర్నలిస్టులు చేసే సొల్లు ప్రచారాలు తప్ప రాష్ట్రంలో కాంగ్రెస్ పుంజుకున్నదీ లేదు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఆయనకు పోటీగా వైఎస్ ఉన్నాడు, బలంగా ఉన్నాడు. చంద్రబాబుతో పోటీ పడగల నాయకుడని ప్రజలూ అంగీకరించే స్థితిలో ఉండేవారు. కానీ ఇప్పుడా పరిస్థితి ఉందా? గత పదేండ్లలో కేసీఆర్ తెలంగాణ చుట్టూ పెంచుకున్న ఇమేజ్ను అందుకోగల ఒక్క నాయకుడన్నా కాంగ్రెస్‌లో దరిదాపుల్లోనైనా ఉన్నాడా? భూమికి జానెడు లేని నేతలు నోరు పారేసుకొని పత్రికల్లోకి ఎక్కితే ఎక్కవచ్చుగానీ కేసీఆర్ అనే విశ్వరూపాన్ని ఎదుర్కోగలరా? అదిగో.. పాలమూరు రంగారెడ్డికి పర్యావరణ అనుమతి వచ్చేసింది. కంటోన్మెంట్ రహదారులకు భూమి ఇచ్చేశారు. పగిలిపోయే వార్త.. షర్మిల కాంగ్రెస్‌లో చేరే అవకాశముంది… ఇంకేముంది. సభకు నమస్కారం!
సవాళ్లు.. తోక ముడుపులు
పెద్ద పెద్ద సవాళ్లు చేయడం ఆనక తోకముడవడం ఇదే రేవంత్ రాజకీయ ప్రస్థానపు తీరు. కొడంగల్‌లో ఓడితే రాజకీయ సన్యాసం అన్నారు. ఓడారు. సన్యాసం ఏడపోయిందో తెలియదు. జీహెచ్ఎంసీలో అయితే మరీ భారీ డైలాగులు. టీఆర్ఎస్ వందసీట్లు గెలిస్తే రాజకీయ సన్యాసం. అంతేకాదు రాష్ట్రం కూడా వదిలిపెట్టి వెళ్లిపోతా అన్నారు. ప్రజలు తీర్పు ఇచ్చారు. విలేకరులు అడిగితే నా సవాలును మీరు సరిగా అర్థం చేసుకోలేదనేశారు. పాపం వెర్రిమొహం వేయడం విలేకరుల వంతైంది. నిన్నో మొన్నో ఢిల్లీలో మళ్లీ అదే తీరు బీఆర్ఎస్కు 25 దాటవన్నారు. మరి దీనికీ ఏదైనా సవాలు ఉంటుందా ఉండదా మనకు తెలియదు. కాకపోతే బీఆర్ఎస్ సంగతి అలా ఉంచితే మరి కాంగ్రెస్‌లో కచ్చితంగా గెలుస్తారనే గ్యారెంటీగా చెప్పగలిగే అభ్యర్థులు 25 మందైనా ఉన్నారా? అంటే ఏం సమాధానం చెప్తారో.. అదేంటో తెలియదు కానీ, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్కు పిండం పెడ్తా.. ఎవరినో సమాధి చేస్తా ఇదే నా శపథం అనేశారు. అంటే గెలవడం ఎటున్నా పిండాలు పెట్టడాలు సమాధులు తవ్వడాలు వంటి కార్యక్రమాలు మాత్రం చేస్తారేమో. ఆయనిష్టం. అలాగే తెలంగాణ ఇపుడు ఎడ్డిది గుడ్డిది కాదన్నారు. చిన్న సవరణ. తెలంగాణ ఇప్పుడే కాదు ఇంతకు ముందునుంచే ఎడ్డిది గుడ్డిదీ కాదు. అందుకే తెలంగాణ ద్రోహి టీడీపీని బొందపెట్టింది. చంద్రబాబును తరిమేసింది. కాంగ్రెస్‌ను ఖతం పట్టించింది. ద్రోహులను ఈడ్చి తన్నింది. ఇంకా ఆ అంశలు ఎక్కడన్నా ఉంటే వాటి పనీ పడుతుంది. ముసుగు రాజకీయాలను ఛేదిస్తుంది. ఇది తథ్యం.
-ఎస్జీవీ శ్రీనివాసరావు