హైదరాబాద్, జనవరి 27 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలు ఉన్నతమైనవని, భారత్-జపాన్ల మధ్య మొదటి నుంచీ చారిత్రక స్నేహ సంబంధాలు కొనసాగుతున్నాయని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌లు పేర్కొన్నారు. మంగళవారం జపాన్‌లోని అయిచి రాష్ట్ర అసెంబ్లీ సభ్యుల ఎకనామిక్ డెవలప్మెంట్ ఫోరం బృందం రాష్ట్ర శాసనసభను సందర్శించింది. హిరోహితో కొండో నాయకత్వంలోని 9 మంది అయిచి రాష్ట్ర ఎమ్మెల్యేల బృందానికి ప్రసాద్ కుమార్, గుత్తా సుఖేందర్‌రెడ్డి, మండలి కార్యదర్శి డాక్టర్ వీ నరసింహాచార్యులు, శాసనసభ కార్యదర్శి రేండ్ల తిరుపతి స్వాగతం పలికారు. అనంతరం గడ్డం ప్రసాద్‌కుమార్ చాంబర్లో అయిచి బృందం సమావేశమై, పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా గడ్డం ప్రసాద్‌కుమార్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, సభ్యుల సంఖ్య, ఎన్నిక విధానాన్ని వారికి వివరించారు.