నాడు కేసీఆర్ హయాంలో రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు తీసుకొస్తే.. నేడు రేవంత్ సర్కార్ సింగరేణి ఓపెన్‌కాస్ట్ మైనింగ్ పేరుతో రామప్ప గుడిని, చెరువునూ నామరూపాల్లేకుండా చేసే కుట్ర సాగుతున్నదని చరిత్రకారులు, స్థానికుల్లో చర్చ జరుగుతున్నది. చారిత్రక సంపదకు ముప్పు వాటిల్లకూడదనే ఉద్దేశంతో కేసీఆర్ హయాంలో మూలకు పడేసిన ఫైల్‌ను రేవంత్ సర్కార్ మళ్లీ ముందుకు తెచ్చి బొగ్గు తవ్వుకొని సొమ్ము చేసుకోవాలనే సింగరేణి ఆలోచనకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తున్నది.ఇదే జరిగితే సాండ్‌బాక్స్ టెక్నాలజీతో నిర్మితమైన రామప్పగుడి, దానిని ఆనుకొని ఉన్న చెరువు ఉనికికే ప్రమాదం వాటిల్లుతుందని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది.
వరంగల్, జూన్ 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మైనింగ్ మాటున ప్రపంచ వారసత్వ కట్టడం రామప్పకు పెను ముప్పు పొంచి ఉన్నదా? శిల్పకళతో అలరారుతూ తెలంగాణ చరిత్ర, సంస్కృతి , పర్యావరణ వారసత్వానికి ప్రతీకగా నిలిచిన వారసత్వ సంపద పాలకుల కుట్రలతో కనుమరుగుకానున్నదా? సింగరేణి ఓపెన్‌కాస్ట్ తవ్వకాలతో రామప్ప ఆలయం సహా చెరువు, చుట్టూతా గ్రామాలు మటుమాయం కానున్నాయా? ఉమ్మడి పాలన నుంచే ఈ కట్టడంపై కన్నేసినప్పుడల్లా పర్యావరణ శాస్త్రవేత్తలు, నిపుణులు, స్థానికుల ఆందోళనలు, అభ్యంతరాలు చెప్పగా, నాటి బీఆర్ఎస్ సర్కార్ సైతం మైనింగ్ ప్రతిపాదనను మానుకోవాలని కరాఖండిగా తేల్చిచ్పెంది. మూలనపడేసిన ఫైలుకు మళ్లీ కదలిక వచ్చిందా? వెయ్యి ఎకరాల్లో విస్తరించిన భూనిక్షేపాలను వెలికితీసి సొమ్ము చేసుకోవాలనే రేవంత్ సర్కార్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందా? అంటే స్థానికులు, నిపుణుల నుంచే అవుననే సమాధానమే వస్తున్నది.
ఇదే జరిగితే రామప్ప నామరూపాల్లేకుండా పోయి మటుమాయమవుతుందని అంతటా ఆందోళన వ్యక్తమవుతున్నది. నాడు కేసీఆర్ హయాంలో రామప్పకు ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు తీసుకొస్తే.. నేడు రేవంత్ సర్కార్ సింగరేణి ఓపెన్‌కాస్ట్ మైనింగ్ పేరుతో రామప్ప గుడిని, చెరువునూ నామరూపాల్లేకుండా చేసే కుట్ర సాగుతున్నదనే ఆందోళన వ్యక్తవుతున్నది. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలో భూమిపొరల్లో దాగిన బొగ్గు నిక్షేపాలను వెలికితీసి సొమ్ము చేసుకోవాలనే సింగరేణి ఆలోచనకు రేవంత్ సర్కార్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందని స్థానికంగా విస్తృతస్థాయిలో చర్చసాగుతున్నది. ప్రస్తుతం జయశంకర్-భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని కొండంపల్లి(కొండరాజుపల్లి), మాధవరావుపల్లి మీదుగా ఓపెన్‌కాస్ట్-3 పనులు సాగుతున్నాయి. ధర్మారావుపేట కేంద్రంగా ఓసీ(ఓపెన్‌కాస్ట్)-4ను చేపట్టాలని సింగరేణి భావిస్తున్నట్టు తెలుస్తున్నది. అదే గనుక చేపడితే రామప్ప గుడి, ఆ గుడిని ఆనుకొని ఉన్న చెరువుకు తీవ్ర ప్రభావాని గురయ్యే ప్రమాదం ఉన్నదని భూగర్భ శాస్త్రవేత్తలు, పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
బొగ్గు నిక్షేపాల కోసం ఉమ్మడి రాష్ట్రంలో సింగరేణి అనేక ప్రయత్నాలు చేపట్టింది. సింగరేణి అంతకుముందు చేసిన అనేక ప్రయత్నాలు పెద్దగా వెలుగుచూడకపోయినా 2012లో చేసిన పరీక్షల్లో వెలుగుచూశాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా.. ప్రస్తుత ములుగు జిల్లా వెంకటాపూర్‌లో ఓసీ మైనింగ్ కార్యకలాపాల కోసం 2012లో సింగరేణి వెంకటాపూర్ మండలంలోని ఎల్లారెడ్డిపల్లి, వెంకటాపూర్, లక్ష్మీదేవిపేట, అడవిరంగాపురం, జవహర్‌నగర్ సమీప గ్రామాల్లోని 1,088 ఎకరాల్లో 300 మీటర్ల లోతులో బొగ్గు నిక్షేపాలు ఉన్నాయని, ఆ ప్రాంతాల్లో తవ్వకాలు జరుపాలని సింగరేణి ప్రతిపాదించింది. ఆ గ్రామాల్లోని బొగ్గు శాంపిల్స్ సేకరించగా ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ అండ్ రీసెర్స్ ఇన్స్టిట్యూట్, నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పరీక్షించింది. అప్పు డు రామప్ప గుడికి ఎలాంటి ముప్పులేదని ఆ రీసెర్చ్ సంస్థ లు నిర్ధారించాయని సింగరేణి ప్రచారం చేసింది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ హయాం నాటి జలయజ్ఞం పేరుతో మొదలైన సొరంగ ముప్పు యత్నాలు మొదలు తాజాగా రేవంత్ హయాంలో సింగరేణి ఓసీ పేరుతో కుట్రలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నా యి. 2001లో చంద్రబాబు హెలికాప్టర్లో వెళ్లి పునాది రాయివేసిన దేవాదుల ప్రాజెక్టు పనులను జలయజ్ఞం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మొదలుపెట్టారు. దేవాదుల సొరంగ నిర్మాణ పనులకు ఉపయోగించే భారీ పేలుడు పదార్థాల వల్ల రామప్పకు తీవ్రమైన ముప్పు ఉన్నదని ఆధారాలతో 2011లో ‘నమస్తే తెలంగాణ’ బయటపెట్టింది. ‘నమస్తే తెలంగాణ’ వరుస కథనాలకు దిగొచ్చిన ఉమ్మడి పాలకులు ఎన్జీఆర్ఐతో విచారణ చేయించారు. జాతీయ, అంతర్జాతీయ ప్రతిష్ఠాత్మక పరిశోధన సంస్థలన్నీ సుదీర్ఘ అధ్యయనాలు, పరీక్షల అనంతరం దేవాదుల సొరంగ నిర్మాణంతో ‘రామప్ప గుడికి ముప్పే’ అని తేల్చాయి. దీంతో నాటి రాష్ట్ర నీటి పారుదల శాఖ సొరంగ మార్గాన్ని మార్చింది. మరోవైపు 2012లోనే రామప్ప పరిసరాల్లో ఓసీ తవ్వకాలు ప్రారంభించాలనే సింగరేణి ఆలోచనకు తీవ్ర అభ్యంతరాలు రావడంతో బ్రేకులు పడ్డాయి. 2014లో ఓసీ తవ్వకాలను మరోసారి తెరపైకి తీసుకు రాగా, ఆలోచనలను విరమించుకోవాలని అప్పటి కేసీఆర్ సర్కార్ సింగరేణికి తేల్చిచెప్పింది. 12 ఏండ్ల తర్వాత బొగ్గును వెలికితీయాలని రేవంత్ సర్కార్ మూలనపడిన ఓసీ ఫైల్స్‌కు దుమ్ముదులిపింది.
రామప్పకు ప్రమాదం పొంచి ఉన్నా కేంద్ర పురావస్తు శాఖ పరిధిలోని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ) గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందా? అంటే జరుగుతున్న పరిణామాలు అవుననే అంటున్నాయి. ఏఎస్ఐ నిబంధనల ప్రకారం పురావస్తు శాఖ పరిధిలోని కట్టడాలకు 5 కిలోమీటర్ల వరకు భూగర్భంలో, భూ ఉపరితలం మీద ఎలాంటి సొరంగాలు, నిర్మాణాలు చేపట్టకూడదు. సింగరేణి ప్రతిపాదించిన ఓసీ రామప్ప నుంచి వాయుమార్గం(ఏరియల్) దూరం 6 కి.మీ.. అదే భూమార్గంలో అయితే 8 కి.మీలుగా ఉన్నది. అలాంటప్పుడు తమ నిబంధనల ప్రకారం రామప్పకు ఆవల వరకు 5 కి.మీ దూరం లేకపోతే సరి. ఆ తర్వాత మీ రేం చేసుకున్నా అభ్యంతరం లేదన్నట్టు ఏఎస్ఐ సింగరేణికి వివరించినట్టు తెలుస్తున్నది.
రామప్ప చుట్టుపక్కల తవ్వకాలు జరిపితే రామప్ప గుడికి, రామప్ప చెరువుకు ప్రమాదం ఏమీ ఉండదా? అంటే వాస్తవాలు అందుకు విరుద్ధంగా ఉన్నాయని స్థానికుల బ్లాస్టింగ్ అనుభవాలు చెప్తున్నాయి. ప్రస్తుతం జయశంకర్-భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలో జరుగుతున్న ఓసీ-3 పేలుళ్లు రామప్ప దాకా ప్రభావం చూపుతున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు. రామప్పకు ఏరియల్ రూట్లో 10 కి.మీ, రోడ్డుమార్గంలో 13 కిమీ-14కిమీ దూరాన జరుగుతున్న ఓసీ పనులతో రామప్పలో వైబ్రేషన్స్ వస్తున్నాయని చెప్తున్నారు. అక్కడెక్కడో బ్లాస్టింగ్స్ చేస్తే రేకుల ఇండ్లల్లో శబ్దాలు వస్తున్నాయని, గుడి లోపల కూడా వైబ్రేషన్స్ వస్తున్నాయని అని సింగరేణి అధికారుల దృష్టికి తీసుకెళితే ‘అవి గ్రౌండ్ వైబ్రేషన్స్ కాదు.. గాలిలో వచ్చే వైబ్రేషన్స్’ అని కొట్టిపారేస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు.
జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తాజా సర్వేల ఆధారంగా రామప్ప చెరువు భూ గర్భంలో రెండు పగుళ్లు చెరువు మధ్య నుంచి వెళుతున్నాయని, అందులో ఒకటి రామప్పగుడి సమీపం నుంచి వెళుతుండగా మరొకటి ప్రతిపాదిత ఓపెన్ కాస్ట్ మైనింగ్ ప్రాంతం గుండా వెళుతుందని ప్రొఫెసర్ పాం డురంగారావు వివరించారు. రామప్ప చెరువు భూపొరల్లో ఏర్పడిన మార్పుల వల్ల చెరువు దిగువన ఆ పగుళ్లు ఉండడం వల్ల ప్రమాదం తీవ్రంగా ఉండే అవకాశాలున్నాయని నిపుణులు అంటున్నారు.

300 మీటర్ల లోతుండే ఓపెన్ కాస్ట్మైన్ ఎత్తులో చూస్తే 100 అంతస్తుల భవనం నిర్మిస్తున్నట్టు అని, అంతలోతుగా బొగ్గు నిక్షేపాలను వెలికితీయాలంటే సింగరేణి మినీ భూకంపాన్నే సృష్టించాల్సి ఉంటుందని నిపుణులు పేర్కొనటంతో నాడు కేసీఆర్ సర్కార్ ఓసీ ప్రతిపాదనను విరవించుకోవాలని సింగరేణి యాజమాన్యానికి చెప్పింది. 2023 మార్చి 1న జరిగిన సమావేశంలో ఓపెన్‌కాస్ట్ మైన్ తవ్వేందుకు సింగరేణి సంస్థ ప్రతినిధులు ‘నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్’ కావాలని అడిగారని, సింగరేణి ప్రతిపాదనను తాను కూడా వ్యతిరేకించానని కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ ప్రతినిధి ప్రొఫెసర్ పాండురంగారావు గుర్తుచేశారు.
ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేట శివారులో సహజ సిద్ధమైన వరాలగుట్ట, వానగుట్ట రెండు కొండల కేంద్రంగా రామప్ప చెరువును కాకతీయులు నిర్మించారు. కాకతీయుల అద్భుత ఇంజినీరింగ్ ప్రతిభకు ఈ చెరువు తార్కాణం. ఈ చెరువు 3 టీఎంసీ (2.97 టీఎంసీ) నిల్వ సామర్థ్యం. ఇరిగేషన్ శాఖ లెక్కల ప్రకారం ఈ చెరువు కింద 5వేల ఎకరాలు సాగవుతాయి. దేవాదుల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కావటం వల్ల 15 వేల ఎకరాల ఆయకట్టుకు నీరు అందుతుంది. వందల ఏండ్ల క్రితం నిర్మించిన ఈ చెరువు భూ గర్భంలో చాలా మార్పులు వచ్చినట్లు నిపుణులు గుర్తించారు. సుదీర్ఘకాలంగా భారీ స్థాయిలో నీటి నిల్వ వల్ల భూమిపొరల్లో పగుళ్ళు ఏర్పడినట్లు తాజా శాటిలైట్ ఇమేజెస్(జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా)ను బట్టి తెలుస్తున్నాయని నిట్ రిటైర్డ్ ప్రొఫెసర్ పాండురంగారావు వివరించారు. అలాగే, రామప్ప చెరువుకు కట్ ఆఫ్ ట్రెంచ్ లేకపోవడం కూడా చెరువు అంతర్భాగంలో బలహీన పడడానికి కారణంగా కనిపిస్తున్నదని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఓపెన్‌కాస్ట్ మైనింగ్ ప్రారంభం అయితే 300 మీటర్ల లోతున హై హైడ్రాలిక్ గ్రేడియంట్ వల్ల పగుళ్లు ఏర్పడి భూ అమరికలో ఉన్న పగుళ్లు పెద్దవై పైభాగంలో ఉన్న రామప్ప చెరువుకు లీకేజ్ ఏర్పడి ఆ నీరు పగుళ్లలోకి వెళ్లి, సాండ్‌బాక్స్ టెక్నాలజీతో నిర్మించిన రామప్ప గుడి కిందిభాగంలోని ఇసుక తన స్థితిని కోల్పోయి బలహీనపడి గుడి పడిపోయే ప్రమాదం సంభవించే అవకాశాలు ఉన్నట్టు భూభౌతిక శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాద పరిణామాల నేపథ్యంలో సింగరేణి తన బొగ్గు తవ్వకాల ప్రతిపాదను విరమించుకోవాలని కోరుతున్నారు.
రామప్పకు యునెస్కో గుర్తింపు తేవటానికి కేసీఆర్ సర్కార్ అనేక వ్యయప్రయాసల లకోర్చింది. కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జాతీయ, అంతర్జాతీయ పురావస్తు ప్రేమికులను రామప్ప సందర్శించేలా చే సింది. అందరి ప్రయత్నాలు ఫలించి.. తేలియాడే ఇటుకలతో నిర్మితమైన ప్రత్యేకతతోపాటు అర ఇంచు నుంచి ఆరు అడుగుల వేలాది శిల్పాలు.. అంతకుమించిన ప్రత్యేకతలున్న కాకతీయ నిర్మాణ కౌశలం విశేషాలు ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి. ఫలితంగా జూలై 2021లో యునెస్కో రామప్ప కట్టడాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది.
ప్రపంచాన్ని ఒప్పించి.. మెప్పించి యునెస్కో గుర్తింపును సాధించిన రామప్ప ఉనికికి సింగరేణి ఓపెన్‌కాస్ట్ మైనింగ్‌తో ప్రమాదం ఉందని ఎప్పటి నుంచో చెప్తున్నాం. ఓపెన్ కాస్ట్ మైనింగ్ ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని గవర్నర్, సీఎంకు లేఖ ద్వారా చెప్పాం. ఇటీవల ములుగు జిల్లాకు కొత్తగా వచ్చిన కలెక్టర్‌కూ వివరించాం. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా లేటేస్ట్ ఇమేజెస్ ఆధారంగా రామప్ప చెరువు మధ్య భూ గర్భంలో రెండు పగుళ్లు ఉన్నాయని సైంటిఫిక్‌గా చెప్పాం. రామప్ప టెంపుల్ మాత్రమే కాదు.. చెరువుకు కూడా తీవ్ర ప్రమాదకరమని వివరించాం.
రామప్ప చెరువు కేవలం నీటి నిల్వ కాదు. అది మన తెలంగాణ చరిత్ర, సంస్కృతి, వ్యవసాయం, పర్యావరణానికి జీవనాధారం. రామప్ప ఆలయం కేవలం రాతి కట్టడంకాదు.. మన పూర్వీకుల సృజనాత్మకతకు చిహ్నం. అభివృద్ధి నిర్ణయాలు తీసుకునేటప్పుడు శాస్త్రీయ ఆధారాలు, ప్రజా ప్రయోజనాలు, పర్యావరణ భద్రత, వారసత్వ పరిరక్షణ అనే కీలక అంశాలపై సమతుల్య దృష్టి అవసరం.