హైదరాబాద్, ఫిబ్రవరి 9(నమస్తే తెలంగాణ): కృష్ణానది తీరంలో మహానగరపు శిథిలాలను గుర్తించినట్టు చరిత్రకారుడు ద్యావనపల్లి సత్యనారాయణ సోమవారం తెలిపారు. నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెంవీరప్పగూడెం గ్రామాల దక్షిణ సరిహద్దుల వెంట ప్రవహిస్తున్న కృష్ణా నది ఒడ్డున ఈ మహానగరం కనుమరుగైనట్టుగా పేర్కొన్నారు. మూడు వేల ఏండ్ల క్రితం నుంచి క్రీ.శ. 15వ శతాబ్దం వరకు ఈ మహానగరం మనుగడలో ఉన్నట్టు చెప్పారు. ఈ ప్రదేశంలో ఇనుపయుగానికి చెందిన వందలాది బృహత్శిల సమాధులు (కెయిరన్లు) ఉన్నట్టు తెలిపారు. ఇవి వీరుల సమాధులని స్థానికులు నమ్మడం వల్లే ఈ ప్రాంతానికి వీరులపాడు, వీరప్పగూడెం అనే పేరు వచ్చినట్టు పేర్కొన్నారు.
భారీ రాళ్లపై పనిచేయగల స్థాయి ఇనుము ఇక్కడే తయారయ్యేదని సూచించే ఇనుప చిట్టాలు పలు చోట్ల లభించినట్టు వివరించారు. ఈ వీరులపాడు స్థలం ఇప్పటివరకు పురావస్తు శాఖ దృష్టికి రాలేదని తెలిపారు. స్థానికంగా ఈ రాళ్ల లభ్యత కారణంగానే సుమారు యాభై ఏళ్ల క్రితం ఈ ప్రాంతంలో ఒక సిమెంట్ కంపెనీ స్థాపించినట్టుగా. ఆ కంపెనీతో పాటు స్థానికులు కూడా విస్తృతంగా సమాధి రాళ్లను వినియోగించడం తో ప్రస్తుతం అతి కొద్ది బృహత్శిలా సమాధు లే మిగిలినట్టుగా తెలిపారు.
మిగతావి కూడా కనుమరుగయ్యే ప్రమాదం ఉన్నదని చెప్పా రు. మధ్యయుగ కాలంలో నిర్మితమైన కోటగోడలు, బురుజులు, ధాన్యాగారా లు, ఆలయాలు, బావులు, ఇండ్లు , శిల్పాలు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నాయని తెలిపారు. కృష్ణానది వైపు దక్షిణ దిశగా ప్రధాన ద్వారం కలిగిన కోట నిర్మాణం ఉంది. కోటకు ఆగ్నేయంగా ఉన్న ఎత్తైన బురుజు శత్రువుల కదలికలను గమనించడానికి ఉపయోగించి ఉండవచ్చని పేర్కొన్నారు.