ఖమ్మం ఎడ్యుకేషన్, నవంబర్ 7: అధికారుల నిర్లక్ష్యం కారణంగా అర్హతలేనివారికి ఉద్యోగాలొచ్చా యి. దీనిని గుర్తించిన అర్హత కలిగిన అభ్యర్థులు పోరాడారు. ఫలితంగా విచారణ జరగడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు డీఎస్సీ 2024లో స్కూల్ అసిస్టెంట్ (ఎస్ఏ), హిందీ లాం గ్వేజ్ పండిట్ (ఎల్పీ)లలో అర్హత లేదని పేర్కొంటూ ఏడుగురు అభ్యర్థులను ఉద్యోగం నుంచి తొలగిస్తూ ఖమ్మం డీఈవో ఉత్తర్వులు జారీ చేశారు. వీరిస్థానం లో అర్హులైన వారికి,పెండింగ్‌లో ఉన్న స్థానాల్లో ఉన్న వారికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. దీంతో వారు గురువారం విధుల్లో చేరారు.
డీఎస్సీ-2024లో హిందీ సబ్జెక్ట్‌లో జరిగిన తప్పిదాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. నియామక పత్రం అందజేస్తున్న సమయంలోనే ఒకరిని తొలగించారు. అర్హత లేదని తాజాగా మరో ఏడుగురిని టర్మినేట్ చేశారు. స్కూల్ అసిస్టెంట్ క్యాటగిరీలో ఒకరిని, హిందీ ఎల్పీలో ఆరుగురిని తొలగించారు. ఆయా పోస్టుల్లో ఉద్యోగాలు చేసేందుకు అవసరమైన డిగ్రీ,పీజీలో క్వాలిఫికేషన్ లేదని పేర్కొంటూ డీఈవో సోమశేఖరశర్మ టర్మినేషన్ ఉత్తర్వులను అందజేశా రు.
అక్టోబర్ 2 నుంచి 5 వరకు సర్టిఫికెట్ల పరిశీలన జరగగా.. అక్టోబర్ 15న నియామక పత్రాలు అందజేశారు. వాటితో అక్టోబర్ 16న ఆయా స్కూళ్లలో రిపోర్ట్ చేసిన ఎల్పీలను సుమారు 24 రోజుల తర్వాత ఉద్యోగం నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. తొలగించిన వారిలో శ్రీదేవి, నాగేశ్వరరావు, రామలింగయ్య, వెంకటరత్నం, నాగలక్ష్మి, లావణ్య, నాగులుమీరా ఉన్నారు. వారి స్థానాల్లో అర్హులను నియమిస్తూ డీఈవో ఉత్తర్వులివ్వడం, వారు తక్షణమే విధుల్లో చేరడం జరిగిపోయాయి. ఎల్పీ హిందీలో ఏడుగురికి, స్కూల్ అసిస్టెంట్‌లో ముగ్గురికి నియామక పత్రాలు అందజేశారు.
విధు ల్లో చేరిన హిందీ ఎల్పీల్లో జేవీ శ్యామ్‌ప్రసాద్, బాజీ, షాహినాబేగం, పద్మ, నాగేశ్వరరావు, ఈశ్వరీబాయి, రామ్‌ప్రసాద్ ఉన్నారు. స్కూల్ అసిస్టెంట్లలో వాజీర్, శిరీష, అర్షద్పాషా ఉన్నారు. ఈ పదిమంది గురువారమే ఆయా హెచ్ఎంలకు రిపోర్టు చేసి విధు ల్లో చేరారు. కాగా..డీఎస్సీ 2024లో కొందరికి అర్హత లేకపోయినా ఉద్యోగాలు పొందేందుకు కారణమైన ప్రధానోపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని వరంగల్ ఆర్జేడీకి డీఈవో వివరాలు సమర్పించారు. అర్హతలేని టీచర్లను తొలగించి.. అర్హులైన వారికి నియామకపత్రాలు అందించిన ప్రక్రియను విద్యాశాఖ అధికారులు గోప్యంగా నిర్వహించారు. నూతన టీచర్లు గురువారం ఉదయమే విధుల్లో చేరేలా ఆయా పాఠశాలల హెచ్ఎంలను అప్రమత్తం చేశారు. తొలగించిన టీచర్లు కోర్టును ఆశ్రయించకుండా ఈ ప్రక్రియ ను అత్యంత గోప్యంగా చేపట్టారు.
డీఎస్సీ-2024 సర్టిఫికెట్ల పరిశీలన మొదలైనప్పటి నుంచి నియామకపత్రాలు అందించే వరకూ జరిగిన ప్రక్రియలో పలు తప్పిదాలు ఉన్నాయని ‘నమస్తే తెలంగాణ’ ముందే చెప్పింది. ‘సర్టిఫికెట్ల పరిశీలన సక్రమేమేనా?’ అనే శీర్షికన అక్టోబర్ 22న ప్రధాన కథనాన్ని ప్రచురించింది. కలెక్టర్‌తోపాటు త్రీమెన్ కమిటీ విద్యాశాఖ అధికారులు స్పందించా రు. హిందీకి సంబంధించిన సర్టిఫికెట్ల పరిశీలనను మరోసారి క్షుణ్ణంగా నిర్వహించారు.