హైదరాబాద్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): వారాంతం, దీపావళి సెలవులు వరుసగా రావడంతో శనివారం సొంతూళ్లకు వెళ్లాలనుకున్న ప్రయాణికులను ప్రైవేట్ ట్రావెల్స్ (Private Travels) నిర్వాహకులు అడ్డగోలుగా దోచుకున్నారు. బీసీ బంద్‌ను సాకుగా చూపి నాలుగు రెట్లు చార్జీలు వసూల్ చేశారు. ఆర్టీసీ కార్మికులు కూడా బంద్‌లో పా ల్గొంటారని తెలియని చాలామంది బస్టాండ్లకు చేరుకుని నిరుత్సాహనికి గురయ్యారు. బస్సులు రోడెకే పరిస్థితి లేకపోవడంతో ప్రైవేట్ వాహనాలనే ఆశ్రయించారు. దీంతో ట్రావెల్స్ నిర్వాహకులు ప్రయాణికులను దోచుకున్నారు.
ఎల్బీ నగర్ నుంచి సూర్యాపేటకు మామూలు రోజుల్లో కారు ప్రయాణానికి ఒక్కొక్కరికీ డిమాండ్‌ను బట్టి రూ.200 నుంచి రూ.250 వరకు తీసుకుంటారు. కానీ శనివారం రద్దీని దృష్టిలో ఉంచుకొని రూ.800 వరకు డిమాండ్ చేశారు. విజయవాడకు ప్రైవేట్ కార్ల డ్రైవర్లు రూ.2 వేలు వసూలు చేయడంతో ప్రయాణికులు లబోదిబోమన్నారు. ఎల్బీనగర్, ఉప్పల్, అరాంఘర్ చౌ రస్తా, జేబీఎస్ వద్ద వాహనాల కోసం గంటల త రబడి నిరీక్షించాల్సి వచ్చింది. దీంతో సర్కారుపై ప్రయాణికులు మండిపడ్డారు.