భారత్మాల హైవేలో పోతున్న భూములకు నష్టపరిహారం ఇవ్వాలని నిర్వాసితులు గురువారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని జాతీయ రహదారుల కార్యాలయాన్ని ముట్టడించారు. నారాయణపేట జిల్లా కృష్ణా మండలం గూడెబల్లూరు నుంచి మొదలుకొని లాల్కోట చౌరస్తా మీదుగా.. మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి భూ నిర్వాసితులు తరలివెళ్లి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా భూ నిర్వాసితులు మాట్లాడుతూ ఆరేండ్ల కిందట 19 గ్రామాల నుంచి 3 వేల మంది భూమి సేకరించి రూపాయి కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పత్తి కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేస్తూ గురువారం మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం కిష్టంపేట వరలక్ష్మి జిన్నింగ్ మిల్లు సమీపంలో చెన్నూర్-మంచిర్యాల ప్రధాన రహదారిపై రైతులు ధర్నాకు దిగారు. సుమారు గంటపాటు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. మార్కెట్ కార్యదర్శి రామాంజనేయులు, సీపీవో అక్కడికి చేరుకొని పత్తి కొనుగోళ్లు చేపడుతామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.