హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో భిన్న వాతారణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముందస్తుగానే నైరుతి రుతుపవనాల రాకతో మొదలైన వర్షాలకు బ్రేక్ పడింది. రుతుపవనాలు మందగించి, వేసవి పరిస్థితులు తిరిగి కనిపిస్తున్నాయి. ఎండల తీవ్రతకు వాతావరణ అనిశ్చితి నెలకొని, సాయంత్రంపూట అక్కడక్కడ పిడుగులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు ఎక్కువగా, 38 నుంచి 40 డిగ్రీల వరకు నమోదవుతున్నాయని వాతావరణశాఖ వెల్లడించింది.
ఈ నెల 10వ తేదీ తర్వాతే రుతుపవనాల్లో మళ్లీ పురోగతి కనిపించే అవకాశముందని తెలిపింది. రానున్న రెండు, మూడు రోజులు చాలాచోట్ల వేడి వాతావరణం ఉంటుందని, పగటి ఉష్ణోగ్రతలు 36 నుంచి 40 డిగ్రీల వరకు నమోదవుతాయని పేర్కొంది. రుతుపవనాలు విస్తరించేటప్పుడు మధ్యలో కొన్ని రోజులు విరామం సాధారణమేనని వెల్లడించింది.