హైదరాబాద్, మార్చి 07 : రాష్ట్ర బడ్జెట్లో జనాభాలో సగం కంటే ఎక్కువగా ఉన్న మహిళలు, మారుమూల ప్రాంతాల్లో ఉన్న గిరిజనుల సంక్షేమం కోసం అధిక నిధులు కేటాయించారని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఈ మేరకు సీఎం కేసీఆర్, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావుకి ఆమె ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గిరిజన తండాలను గ్రామ పంచాయతీలు చేసి వాటి అన్నిటికి భవనాల నిర్మాణం కోసం ఒక్కో దానికి 25 లక్షల రూపాయల చొప్పున 600 కోట్లు కేటాయించడం, ప్రతి తండాకు రహదారి నిర్మాణం కోసం 1000 కోట్ల రూపాయలు ఇవ్వడం సంతోషకరమన్నారు.
గిరిజనులు అత్యధికంగా ఉండే ములుగు జిల్లాలో అటవీ విశ్వ విద్యాలయం ఏర్పాటు కోసం 100 కోట్ల రూపాయలు, మెడికల్ కాలేజీకి మరో 100 కోట్ల రూపాయలు కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అదే విధంగా 7వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదివే విద్యార్థినులకు హెల్త్ అండ్ హైజినిక్ కి ఇవ్వాలని బడ్జెట్లో నిర్ణయించడం చారిత్రాత్మకమన్నారు.