హైదరాబాద్ : నగరంలో అక్రమ భవనాల కట్టడాల విషయంలో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశామని, ఈనెల 25న కమిటీ సమావేశం జరుగుతుందని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ వెల్లడించారు. హైదరాబాద్లోని నల్లగుట్ట ప్రాంతంలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వ విభాగాలన్నీ యుద్ధ ప్రాతిపదికన స్పందించాయని తెలిపారు. శుక్రవారం ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే ముఠా గోపాల్ తో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు.
ప్రమాదం జరిగిన భవనం లో కెమికల్స్ ఉండటం వల్ల మంటలు తొందరగా అదుపులోకి రాలేదని అన్నారు. ‘ మంటలు పక్కన ఉన్న బస్తీకి వ్యాపించకుండా తగిన చర్యలు తీసుకున్నామని వివరించారు. నిన్న అగ్ని ప్రమాదానికి గురైన కట్టడం లాంటివి 25 వేల వరకు హైదరాబాద్ నగరం లో ఉండవచ్చు . అక్రమ కట్టడాలను రాత్రికి రాత్రే తొలగించడం సాధ్యం కాద’ ని ఆయన అన్నారు. అక్రమ కట్టడాల విషయం లో ఏం చేయాలి అన్నదానిపై ఉన్నత స్థాయి కమిటీ వేస్తున్నామని పేర్కొన్నారు.
ప్రమాదం జరిగిన కట్టడం నాణ్యత పై ఎన్ఐటీ ఆధ్వర్యంలోని కమిటీ తన నివేదికను త్వరలోనే సమర్పిస్తుందన్నారు. ఆ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. అక్రమ కట్టడాల విషయం లో ఏం చేయాలన్న దానిపై అఖిల పక్ష సమావేశం కూడా నిర్వహిస్తామని పేర్కొన్నారు.
కేంద్ర మంత్రి కిషన్రెడ్డివి గాలి మాటలు
ప్రమాద ఘటన పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గాలి మాటలు మాట్లాడుతున్నారని, డబ్బుల కోసం అక్రమ కట్టడాలు క్రమబద్దీ కరిస్తున్నారని బాధ్యతా రహితంగా మాట్లాడడం శోచనీయమని అన్నారు. తెలంగాణ ప్రభుత్వ హయాంలో ఒక్క భవనాన్ని కూడా రెగ్యులరైజ్ చేయలేదని అన్నారు. భవనాల క్రమబద్ధీకరణ పథకం పై కోర్టు స్టే ఉన్నదని కిషన్ రెడ్డి కి తెలియదా అని నిలదీశారు.
హైద్రాబాద్ కు కిషన్ రెడ్డి ఒక్క పైసా తెచ్చింది లేదని విమర్శించారు. ‘ గుజరాత్ లో కూడా వంతెన కూలి 180 మంది మరణించారు. కిషన్ రెడ్డి లాగా తాము రాజకీయాలు చేయలేదని అన్నారు. హైదరాబాద్ అభివృద్ధి కి గత ఎనిమిదేళ్లలో 65 వేల కోట్ల రూపాయలు కేటాయించామని, ఇంత అభివృద్ధి గతంలో ఎప్పుడైనా జరిగిందా అని ప్రశ్నించారు. గతం లో జరిగిన అన్ని ప్రమాదాల్లో బాధితులకు నష్ట పరిహారం అందజేశామని గుర్తు చేశారు. బీహార్ కు చెందిన వ్యక్తులు ఇక్కడ ప్రమాదం లో చనిపోతే సీఎం కేసీఆర్ స్వయంగా ఆ రాష్ట్రానికి వెళ్లి ఎక్స్గ్రేషియా చెక్కు లు ఇచ్చారని తెలిపారు.