హైదరాబాద్, ఏప్రిల్ 22(నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఎల్లోమీడియా రాసిన కథనాలన్నీ కట్టుకథలేనని తేలింది. సత్యాలను మరుగున పరిచేందుకు అసత్యాలు వల్లెవేశాయని రుజువైంది. రెండున్నరేండ్లుగా పతాక శీర్షికల రోత రాతలన్నీ బూడిదలో పోసిన పన్నీరు చందం అయ్యాయి. లక్ష కోట్లు వృథా.. నీళ్లలో కొట్టుకుపోయిన లక్ష కోట్లు.. తెలంగాణకు గుదిబండ.. కూలిన కాళేశ్వరం.. సీబీఐకి లేఖ.. అంటూ ఎల్లో మీడియా తెలంగాణపై విషం చిమ్ముతూ రాసిన రాతలన్నీ ఏకపక్ష దాడులేనని స్పష్టమైంది. తాజాగా హైకోర్టు తీర్పుతో ఆ రెండు పత్రికల కుట్రలకు చెంపపెట్టులాంటి తీర్పు వచ్చింది. అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుంచే గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ సర్కార్ కుట్రలకు పదునుపెట్టి ఎల్లోమీడియాను పావుగా వాడుకుంటూ వచ్చింది.
వీరికి కేంద్ర ప్రభుత్వమూ జత కలిసింది. అంతా కలిసి మూకుమ్మడి దాడులతో తెలంగాణ తొలి ప్రభుత్వం చేసిన మేలును ఓర్వలేక తప్పులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇందులో భాగంగానే కాళేశ్వరం బీఆర్ఎస్కు ఏటీఎం అని నేరుగా ఆరోపణలు చే స్తూ పసలేని కట్టుకథలు అల్లాయి. కాళేశ్వరం కూలిందని ప్రజల్లో భయాందోళనలు సృష్టించే ప్రయత్నం చేశారు తప్ప కాళేశ్వరానికి ముందు న్న దుర్భర సరిస్థితులు.. ఆ తర్వాత తెలంగాణ పురోభివృద్దిని బయటకు రాకుండా తొక్కిపట్టే ప్రయత్నం చేశారు. ఇలా వాస్తవాలను విస్మరించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఎల్లో మీడి యా, అనుకూల సామాజిక మాధ్యమాలు ఏక మై అసత్యాలతో అధికారాన్ని అడ్డం పెట్టుకొని విషప్రచారంతో బీఆర్ఎస్ను దోషిగా నిలిపే కుట్రలు చేశాయి. తెలంగాణలో కరువును ప్రారదోలి భూములను సస్యశ్యామలం చేసిన కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ సర్కార్‌కు ఎల్లోమీడియా పావుగా మారి ఉన్మాదంతో విషపు రాతలు రాసింది. ఆధారాలు లేని, తలాతోక లేని ఆరోపణలతో అక్కసు వెళ్లగక్కాయి.
బీఆర్ఎస్కు పేరొస్తుందని కుట్రలు
తెలంగాణ కరవు ఆనవాళ్లను కనిపించకుండా చేస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టుతో బీఆర్ఎస్కు వస్తున్న మైలేజీ, మంచిపేరును జీర్ణించుకోలేని కాంగ్రెస్ ప్రభుత్వం.. కుయుక్తులతో చెత్త రాతలను ప్రోత్సహించింది. ఎల్లో మీడియాపై ఆశలు పెట్టుకొని అసత్యాలను సాక్షాత్త్తు సీఎం కార్యాలయమే లీకులుగా ఇచ్చి సహకారం అందించిందని ఆరోపణలు వచ్చాయి. ప్రపంచంలోనే అతిపెద్ద మానవ కట్టడమైన కాళేశ్వరంపై ప్రభుత్వం చెప్పింది చెప్పినట్లు.. ఇచ్చిన లీకులు ఇచ్చినట్టుగా తూచా తప్పకుండా తమ కథనాలతో తెలంగాణకు విరోధిగా ఒక వర్గం మీడియా చేసిన దుష్ప్రచారం ఒట్టిదేనని న్యాయస్థానం తీర్పుతో తేలిపోయింది. తెలంగాణ వ్యతిరేక మీడియాగా పేరున్న పచ్చ మీడియా అంతా ఒక్కటై అసత్యాన్ని సత్యంగా చూపే ప్రభుత్వ ఆగడాలకు చెక్‌పడింది.
అసత్యాలకు మరో కొనసాగింపు
ఇన్నాళ్లూ తమ పాచిక పారకపోవడంతో మరోసారి అసత్యాలకు ఎల్లోమీడియా బరితెగించింది. సీబీఐ చేతికి విచారణ.. సీబీఐకి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయగా కేంద్ర దర్యాప్తు సంస్థ స్పందించినట్టుగా ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి తెలంగాణ వ్యతిరేకతను నిలువెల్లా ఒంటపట్టించుకున్న మీడియా సంస్థలు అసత్యాలు ప్రచారం చేయడం గమనార్హం. హైకోర్టు ఆదేశాలతో అన్నీ నిల్చిపోయినా వాటిని పెద్దగా ప్రచారం చేయకుండా మళ్లీ ప్రభుత్వానికే వంతపాడుతూ తమ నైజాన్ని చాటుకున్నాయి. మీడియా పాత్రపై ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నా ఎల్లో మీడియా తీరు మారడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.