న్యూఢిల్లీ, జనవరి 4: పెండింగ్ కేసుల పరిష్కారానికి సర్వోన్నత న్యాయస్థానం అడ్హక్ జడ్జిల నియామకానికి ఆదేశాలు జారీ చేసినా హైకోర్టులు వారి నియామకంపై ఆసక్తి చూపడం లేదు. సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చి ఏడాది పూర్తయినా దేశంలోని 25 హైకోర్టులు ఒక్క అడ్హక్ జడ్జిని కూడా నియమించకపోవడం గమనార్హం. దేశంలో పేరుకుపోతున్న పెండింగ్ కేసులపై ఆందోళన వ్యక్తం చేసిన సుప్రీం కోర్టు.. అడ్హాక్ జడ్జిలను నియమించుకునేందుకు నిరుడు జనవరి 25న హైకోర్టులకు అనుమతిచ్చింది.
అయితే మొత్తం జడ్జిల సంఖ్యలో వీరు 10 శాతాన్ని మించొద్దని పేర్కొన్నది. ఈ ఆదేశాలు ఇచ్చి ఏడాది అవుతున్నా ఒక్క హైకోర్టు కూడా స్పందించ లేదు. బ్యాక్లాగ్ కేసుల పరిష్కారానికి రిటైర్డ్ జడ్జిలను అడ్హక్ జడ్జిలుగా నియమించాలంటూ హైకోర్టుల నుంచి ఒక్క సిఫారసు రాలేదని కేంద్ర న్యాయశాఖ వెల్లడించింది. వాస్తవానికి ఈ అడ్హక్ జడ్జిల నియామకం కూడా మామూలు జడ్జిల నియామకానికి అనుసరించాల్సిన ప్రక్రియనే పాటించాలి. అయితే తర్వాత సుప్రీం కోర్టు ప్రత్యేక బెంచ్ కొన్ని నిబంధనలను సవరించింది. అయినప్పటికీ అడ్హక్ జడ్జిల నియామకం పట్ల హైకోర్టులు ఆసక్తి చూపలేదు.