హైదరాబాద్, జూలై 15(నమస్తేతెలంగా ణ): హనుమకొండలో బీఆర్ఎస్ కార్యాల యం ఏర్పాటు కోసం కేటాయించిన స్థలాన్ని రద్దు చేయాలంటూ వరంగల్ పశ్చిమ ఎమ్మె ల్యే నాయిని రాజేందర్‌రెడ్డి రాసిన లేఖ ఆధారంగా ఆర్డీవో చర్యలకు ఉపక్రమించడాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. ఎమ్మెల్యే చెబి తే ఏమైనా చేసేస్తారా? అంటూ ప్రభుత్వాన్ని నిలదీసింది. ఈ వ్యవహారంలో కలెక్టర్‌కు రాజేందర్‌రెడ్డి రాసిన లేఖను సమర్పించాలని ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేసింది. బీఆర్ఎస్ కార్యాలయ నిర్మాణ అనుమతులతోపాటు స్థల కేటాయింపు ఉత్తర్వులను మూడు రోజుల్లోగా సమర్పించాలంటూ జూన్ 25న మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ జారీచేసిన నోటీసుకు వ్యతిరేకంగా హనుమకొండ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు వినయ్ భాసర్ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ కే లక్ష్మణ్ సోమవారం విచారణ చేపట్టారు.
2018లో ప్రభుత్వం బీఆర్ఎస్కు ఎకరం స్థలాన్ని కేటాయించిందని పిటిషనర్ తరఫు న్యాయవాది తెలిపారు. అది ఉచితంగా జరిపిన కేటాయింపు కాదని, ఆ స్థలంకోసం ప్రభుత్వానికి బీఆర్ఎస్ రూ.4.84 లక్షలు చెల్లించిందని వివరించారు. ఇప్పటివరకు ప్రహరీ నిర్మాణం మాత్రమే జరిగిన ఆ స్థలం లో తాతాలికంగా షెడ్డును ఏర్పాటు చేసుకుని పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఇంతలో అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్‌రెడ్డి కల్పించుకుని.. ప్రభుత్వం కేటాయించిన స్థలంలో కాకుండా మరోచోట బీఆర్ఎస్ నిర్మాణాలు చేపట్టిందని, అనుమతులు లేకుం డా ప్రహరి నిర్మించిందని తెలిపారు. ఈ వాదనలపై న్యాయమూర్తి స్పందిస్తూ.. అసలు ఎమ్మెల్యే లేఖ ఆధారంగా అధికారులు చర్య లు చేపట్టడం ఏమిటని ప్రశ్నించారు. ఆ లేఖతోపాటు గత నెల 1న ఆర్డీవోకు కలెక్టర్ రాసిన లేఖనూ సమర్పించాలని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను ఈనెల 18కి వాయిదా వేశారు.
అర్చకుల బదిలీపై హైకోర్టు స్టే
హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ఆలయాల్లోని అర్చకుల బదిలీ ప్రక్రియను నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బదిలీల కోసం ఆప్షన్లను కోరుతూ దేవాదాయశాఖ జారీ చేసిన ఆదేశాలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌పై జస్టిస్ పుల్లా కార్తీక్ సోమవారం విచారణ చేపట్టారు. అర్చకులను ఉద్యోగులుగా పరిగణించి బదిలీ చేయడం చెల్లదని, మతపరమైన కార్యకలాపాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోవడం సరికాదని పిటిషనర్ల తరఫు న్యాయవాది తెలిపారు. దీంతో అర్చకుల బదిలీలపై కోర్టు స్టే విధించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని దేవదాయ శాఖను ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.