హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ) : రంగారెడ్డి జిల్లా నాగారం భూదాన్ భూములు అన్యాక్రాంతం అయ్యాయంటూ పిటిషన్ వేసిన వ్యక్తికి పోలీసులు ఫోన్ చేయడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పిటిషనర్‌కు ఫోన్ చేసి బెదిరించినా, హైకోర్టులోని కేసును ఉపసంహరించుకోవాలని ఫోన్ చేస్తే, సస్పెండ్ చేయాలని ఉన్నతాధికారులకు ఉత్తర్వులు ఇస్తామని హెచ్చరించింది. నాగారంలోని భూములను ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అక్రమంగా తమ పేరిట పట్టా పొందారంటూ పడమటి తండాకు చెందిన రాములు హైకోర్టులో పిటిషన్ వేశారు.
తనకు పోలీసులు ఫోన్ చేసి బెదిరిస్తున్నారంటూ రాములు తాజాగా మరో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్‌కు ఫోన్ చేసిన మహేశ్వరం కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు మంగళవారం విచారణకు హాజరయ్యారు. పాతిక మంది ఐఏఎస్ /ఐపీఎస్ అధికారులపై అభియోగాలతో పిటిషన్ వేస్తే వాపస్ తీసుకోవాలని బెదిరిస్తావా? కేసుని వెనకి తీసుకోవాలని ఎవరు ఫోన్ చేయించారు? అని హైకోర్టు కానిస్టేబుల్‌ను నిలదీసింది. ఎస్‌హెచ్‌వో ఆదేశాల మేరకే ఫోన్ చేశానని కానిస్టేబుల్ చెప్పారు. దీనిపై హైకోర్టు స్పందిస్తూ, మరోసారి బెదిరిస్తే సస్పెన్షన్ ఉత్తర్వులు ఇస్తామని వార్నింగ్ ఇచ్చింది.