కేంద్రం జారీచేసిన ఆదేశాలను కొట్టేస్తున్నాం. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నియంత్రణలో నడుస్తున్న విద్యుత్తు సంస్థలు బకాయిల వివాదాన్ని సామరస్యంగా పరిషరించుకోవాలి. తెలంగాణ విద్యుత్తు బకాయిల సొమ్మును ఏపీకి చెల్లించాలని కేంద్ర ప్రభుత్వం అనాలోచితంగా ఉత్తర్వులు జారీచేసింది. ఆ ఆదేశాలిచ్చే ముందు కనీసం తెలంగాణకు నోటీసులు కూడా ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం సహజ న్యాయసూత్రాలకు విరుద్ధం. ఈ విషయంపై సుప్రీంకోర్టు పలు తీర్పులు కూడా వెలువరించింది
– హైకోర్టు
హైదరాబాద్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విద్యుత్తు సంస్థల మధ్య చాలా కాలంగా నలుగుతున్న బకాయిల చెల్లింపు వివాదంపై రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పు ప్రకటించింది. ఏకపక్షంగా బకాయిలు చెల్లించాలంటూ కేంద్రం హుకుం జారీచేయడాన్ని తప్పుపడుతూ.. కేంద్రం జారీచేసిన ఆదేశాలను కొట్టివేసింది. కేంద్ర ప్రభుత్వం గత ఏడాది ఆగస్టు 29న తెలంగాణకు ఇచ్చిన నోటీసులు చెల్లుబాటు కావని తేల్చి చెప్పింది. తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను ఆమోదించింది. కేంద్రం, ఏపీ ప్రభుత్వాలు చేసిన వాదనను తోసిపుచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాలు మధ్యవర్తిత్వం ద్వారా సదరు వివాదాన్ని పరిషరించుకోవాలని స్పష్టం చేసింది.
కేంద్ర ప్రభుత్వ నోటీసులను సవాల్ చేస్తూ తెలంగాణ దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు రెండు వారాల క్రితం వాదనలు ముగించి తీర్పును వాయిదా వేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ ధర్మాసనం గురువారం 65 పేజీల కీలక తీర్పును వెలువరించింది. తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలకు చట్టప్రకారం అందుబాటులో ఉన్న పరిషారాన్ని కోరే స్వేచ్ఛ ఉన్నదని స్పష్టం చేసింది. ఆ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు, రెండు రాష్ట్రాల విద్యుత్తు సంస్థలు సంప్రదింపుల ద్వారా సమస్యను పరిషరించుకోవాలని తెలిపింది. లేనిపక్షంలో మధ్యవర్తిత్వం ద్వారా సమస్యను సామరస్యపూర్వకంగా కొలికి తెచ్చుకోవాలని సూచించింది.
నెల రోజుల్లోగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి విద్యుత్తు బకాయిల అసలు రూ.3,441.78 కోట్లు, వడ్డీ, సర్‌చార్జీలు కలిపి మరో రూ.3,315.14 కోట్లు కలిపి మొత్తం రూ.6,756.92 కోట్లను చెల్లించాలని కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై తెలంగాణ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. రాష్ట్ర పునర్విభజన చట్టం-2014లోని సెక్షన్ 92 ప్రకారం సివిల్ వ్యవహారాలకు సంబంధించిన వివాదాలలో ఏకపక్షంగా వ్యవహరించకుండా తగిన అవకాశాన్ని ఇరు పక్షాలకు ఇవ్వాలి. కానీ తెలంగాణ డిస్కంలకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా, వారి వాదనలు వినకుండా ఏకపక్షంగా ఆదేశాలు జారీచేయడం సరైంది కాదని ధర్మాసనం అభిప్రాయపడింది. సహజ న్యాయ సూత్రాలను పాటించలేనట్టు స్పష్టమవుతున్నదని, అందుకే ఆంధ్రప్రదేశ్ చేసిన విజ్ఞప్తిని అంగీకరించడం లేదని రాష్ట్ర హైకోర్టు స్పష్టం చేసింది.
విద్యుత్తు బకాయిల విషయంలో ఏపీ ప్రభుత్వం మొదటి నుంచి తొండిగా వ్యవహరిస్తున్నది. తమకు బకాయిలు చెల్లించాలంటూ 2019లో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పటి నుంచి గగ్గోలు పెడుతున్నది. అయితే తెలంగాణకు చెల్లించాల్సిన బకాయిలను మాత్రం బయటకు చెప్పడం లేదు. తరువాత ఏపీలో వచ్చిన ప్రభుత్వంకూడా అదే తరహాలో వ్యవహరిస్తూ.. ఏపీ విద్యుత్తు సంస్థలను ఎగదోసింది. అదే సమయంలో విద్యుత్తు సంస్థలు మాత్రం.. కూర్చుని మాట్లాడుకుందామని, సమస్యను సామరస్యంగా పరిష్కరించుకుందామని ప్రతిపాదించింది. తెలంగాణ ప్రభుత్వం కూడా కేంద్రంలోని హోంశాఖ ఉన్నతాధికారుల సమక్షంలో పలు దఫాలుగా జరిగిన రాష్ట్ర విభజన సమస్యల పరిష్కార సమావేశాల్లో ఇదే అభిప్రాయాన్ని వ్యక్తంచేసింది. అయితే అటు ఏపీ ప్రభుత్వంకానీ, ఏపీ విద్యుత్తు సంస్థలుకానీ ఇందుకు ముందుకు రాకుండా.. కేంద్రానికి ఫిర్యాదు చేశాయి. అయితే కేంద్రంకూడా అదే ధోరణితో తెలంగాణ ప్రభుత్వం, విద్యుత్తు సంస్థలకు అవకాశం ఇవ్వకుండా.. అభిప్రాయాన్ని తెలుసుకోకుండా.. ఏపక్షంగా నిర్ణయం తీసుకుని.. తక్షణం ఏపీ బకాయిలు చెల్లించాలంటూ ఆదేశాలు జారీచేసింది. దీనిపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమయ్యింది. ఇటు తెలంగాణ ప్రభుత్వం, అటు విద్యుత్తు సంస్థలు రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించాయి. దీనిపై కేంద్రానికి నోటీసులు పంపించిన కోర్టు.. విచారణ పూర్తి చేసి తీర్పు చెప్పింది.
నిజానికి ఏపీ విద్యుత్తు సంస్థలకు చెల్లించాల్సిన మొత్తాన్ని మినహాయిస్తే.. ఏపీయే తెలంగాణకు రూ.12,941 కోట్లు (31.12.2021 నాటికి) చెల్లించాల్సి ఉంది. ఇందుకు సంబంధించిన గణాంకాలను తెలంగాణ విద్యుత్తు సంస్థలు గతంలోనే వెల్లడించాయి. ఏపీ విద్యుత్తు సంస్థల నుంచి తెలంగాణకు రావాల్సిన బకాయిల (31.12.2021 నాటికి) మొత్తం రూ. 17,828 కోట్లు. ఏపీ విద్యుత్తు సంస్థలకు తెలంగాణ విద్యుత్తు సంస్థల నుంచి చెల్లించాల్సిన బకాయిల మొత్తం రూ. 4,887 కోట్లు. ఈ లెక్కన తెలంగాణ విద్యుత్తు సంస్థలకు ఏపీ విద్యుత్తు సంస్థలే రూ. 12,941 కోట్లు చెల్లించాల్సి ఉన్నట్టు స్పష్టమవుతున్నది. ఇదే విషయంపై సామరస్యంగా చర్చించుకుని పరిష్కారం చేసుకుందామని ప్రతిపాదించినా.. ఏపీ, అక్కడి విద్యుత్తు సంస్థలు వినలేదు. ఇప్పుడు రాష్ట్ర హైకోర్టు తీర్పు నేపథ్యంలోనైనా బకాయిల వివాదాన్ని సామరస్యంగా పరిష్కారం చేసుకునే దిశగా మధ్యవర్తిత్వమే మార్గంగా సమస్యను పరిష్కరించుకోవాల్సి ఉన్నది.