హైదరాబాద్ : కాళేశ్వరం కేసు ( Kaleshwaram Case ) లో హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ప్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ ( Talasani Srinivas Yadav ) అన్నారు. తెలంగాణ భవన్లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
మేధా పర్వతం లాంటి కేసీఆర్‌పై ఉమ్మేస్తే తిరిగి కాంగ్రెస్ నాయకుల పైనే పడిందని విమర్శించారు. కేసీఆర్ ( KCR ) నాయకత్వంలో నీళ్లు , నిధులు, నియామకాల ట్యాగ్ లైన్ తో తెలంగాణ ఉద్యమాన్ని నడిపి తెలంగాణ సాధించిన నాయకుడు కేసీఆర్అని పేర్కొన్నారు.
వచ్చిన తెలంగాణలో రైతులు సంతోషంగా ఉండాలని ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం నిర్మించారని గుర్తు చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక బ్యారేజ్ మేడిగడ్డ . కాళేశ్వరం అంటే 100 కంపోనెట్లని, అందులో మేడిగడ్డ బ్యారేజ్ ఒకటని అన్నారు. మేడిగడ్డలో రెండు పిల్లర్లు కుంగిపోతే రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి లక్ష కోట్ల అవినీతి అంటూ తమ పై దుష్ప్రచారం చేశారని ఆరోపించారు. మేడిగడ్డలో కుంగిన రెండు పిల్లర్లను రిపేర్ చేస్తామని ఎల్అండ్టీ ముందుకు వస్తే బెదిరించారని తెలిపారు . మేడిగడ్డ కుంగినప్పుడు ఆగమేఘాల మీద వచ్చిన ఎన్డీఎస్ఏ , ఎస్ఎల్బీసీ కుంగి 8 మంది చనిపోతే ఎందుకు రాలేదని ప్రశ్నించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చామని, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారానే తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా వరి ధాన్యం వచ్చింది.వచ్చిన ధాన్యం చూసి కేంద్రమే ఆశ్చర్యపోయింది.ఆఖరికి వరి కొనలేమని కేంద్రం చేతులెత్తేసిందని పేర్కొన్నారు.
రేవంత్ రెడ్డికి పరిపాలన చేత కాదని, అన్ని వర్గాల వారు ప్రభుత్వం పై కోపంతో ఉన్నారని వెల్లడించారు.
ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసే దిశగా కుట్రలు
సంస్థను ప్రైవేట్ పరం చేసే దిశగా కుట్రలు చేస్తున్నదని శ్రీనివాస్‌యాదవ్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయడం లేదని నిలదీశారు. బీఆర్ఎస్ హయంలో ఆర్టీసీ కార్మికుల సమస్యలపై కేబినెట్లో నిర్ణయం తీసుకొని వాటిని పరిష్కరించే దిశగా ఆ ఫైల్‌ను గవర్నర్ దగ్గరకు పంపించామని,
ఆ తర్వాత ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారం కోల్పోయిందని తెలిపారు.
ఆర్టీసీ కార్మికులకు టెంట్ సామాన్లు ఇవ్వరాదని వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణ పరిధిలో టెంట్ హౌస్ నిర్వాహకులను పోలీసులు నోటీసులు ఇవ్వడంపై డీజీపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ వెళ్లిన రేవంత్ రెడ్డి ఎన్డీయే కూటమి నేతలతో బ్రేక్ ఫాస్ట్ చేస్తుంటే తెలంగాణలో నిజమైన కాంగ్రెస్ నాయకులకు సోయి లేదా అంటూ ప్రశ్నించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్ , బీ ఆర్ఎస్ ఖైరతా బాద్ ఇన్చార్జి మన్నె గోవర్ధన్ రెడ్డి , కార్పొరేషన్ మాజీ చైర్మన్ వాసుదేవ రెడ్డి , బీసీ కమిషన్ మాజీ సభ్యుడు కె . కిషోర్ గౌడ్ పాల్గొన్నారు ,