హైదరాబాద్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ) : బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పించేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నం.9పై హైకోర్టు స్టే విధించడం తీవ్ర నిరాశకు గురిచేసిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్రం వద్ద బీసీల రిజర్వేషన్ బిల్లు నెలల తరబడి పెండింగ్ ఉన్నందునే హైకోర్టు స్టే విధించడానికి కారణమైందని ఆరోపించారు. దీనికి బాధ్యత కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. 9వ షెడ్యూల్లో చేర్చేందుకు రాజ్యాంగ సవరణ అవసరమైతే కేంద్ర ప్రభుత్వం తక్షణమే పార్లమెంట్‌ను సమావేశపరిచి.. ఆ ప్రక్రియను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు(ఈడబ్ల్యూఎస్) రిజర్వేషన్ వర్తింపులో ఈ పరిమితిని ఇప్పటికే దాటిపోయిన విషయాన్ని పరిగణనలోకి తీ సుకోవాలని కోరారు. గవర్నర్ వద్ద పెండింగ్ ఉన్న బిల్లులు నిర్ణీత కాలపరమితిలోగా ఆమోదం లభించకపోతే, నోటిఫై చేయవచ్చని తమిళనాడు కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పరిశీలించాలని ఆయన సూచించారు. తెలంగాణ వెనుకబడిన తరగతుల చట్టం 2025 గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలపై నిపుణుల సలహాలు తీసుకుని, అవసరమైతే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు.
కేంద్రంలోని బీజేపీ తీరుతోనే బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అమలు జీవోతోపాటు, స్థానికసంస్థల ఎన్నికలపై హైకోర్టు స్టే విధించిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ విమర్శించారు. ఇప్పటికైనా రాష్ట్రం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న బీజేపీ ఎంపీలు, మంత్రులు నైతిక బాధ్యత వహించి.. వారి పదవులకు రాజీనామా చేయాలని గురువారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. సామాజిక న్యాయం కోరే శక్తులు, ప్రజాస్వామికవాదులంతా కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు పోరాటాలకు సన్నద్ధం కావాలని విజ్ఞప్తి చేశారు.
42శాతం బీసీ రిజర్వేషన్ల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం న్యాయబద్ధమైన చర్యలన్నీ తీసుకోవాలని సీపీఎం తరఫున డిమాండ్ చేస్తున్నట్టు స్పష్టంచేశారు. శాసనసభలో అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపి గవర్నర్‌కు పంపించినా.. ఆమోదించకపోవడంతోనే బీసీల రిజర్వేషన్లు ఆగిపోయాయని మండిపడ్డారు. కేంద్రంలో బీజేపి అధికారంలో ఉండటం వల్లే బీసీలకు రిజర్వేషన్లు అమలు కావడం లేదని ఆయన ఆరోపించారు.