హైదరాబాద్, ఆగస్టు 10 ( నమస్తే తెలంగాణ): డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించి అర్హులైన పేదలకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఈ ఏడాది ఆగస్టు 1 నాటికి రాష్ట్రంలో 1,43,544 ఇండ్లకు 65,638 ఇండ్లను లబ్ధిదారులకు కేటాయించినట్టు హైకోర్టుకు ప్రభుత్వం నివేదించింది. ఇండ్లను లబ్ధిదారులకు కేటాయించేలా ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే ఇంద్రసేనారెడ్డి పిల్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాదే, జస్టిస్ వినోద్‌కుమార్ ధర్మాసనం గురువారం విచారించింది.
ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది హరేంద్ర పరిషద్ వాదనలు వినిపిస్తూ.. 2021లో పిల్ దాఖలయ్యేనాటికి 1,00,087 ఇండ్లకు 12,656 ఇండ్ల కేటాయింపులు జరిగాయని తెలిపారు. ఆగస్టు 1నాటికి కేటాయింపుల సంఖ్య 65,638కి పెరిగిందని వివరించారు. జీహెచ్ఎంసీ పరిధిలో 65,658 ఇండ్లు పూర్తి చేసినట్టు తెలిపారు. ఇప్పటివరకు ఎన్ని ఇండ్లు నిర్మించారు? లబ్ధిదారులకు ఎన్ని పంచారో నివేదించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.