హైదరాబాద్, జూన్ 16, (నమస్తే తెలంగాణ): అక్రమ నిర్మాణాలు కండ్లముందు జరుగుతున్నా మీకు కనిపించడం లేదా? కండ్లు మూసుకున్నారా? అక్రమ నిర్మాణాలు జరుగుతుంటే చూడలేని కబోదులా? వాటిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఆదిలోనే అడ్డుకుంటే మరొకరు అక్రమ నిర్మాణం చేపట్టేందుకు ముందుకురారు కదా? నిర్మాణం పూర్తయ్యాక అధికార ప్రతాపాన్ని చూపుతారా? అక్రమ నిర్మాణాన్ని సక్రమం చేసేందుకు భవనాల క్రమబద్ధీకరణ పథకం (బీఆర్ఎస్) కోసం అప్లికేషన్ పెట్టుకునే వెసులుబాటు కల్పించేలా సహకారం ఇస్తున్నారా? అసలు మీ మనసులో మీ అలోచనల్లో ఏ ముందో భగవంతుడు సైతం పసిగట్టలేరు.. అంటూ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) అధికారులపై హైకోర్టు నిప్పులు చెరిగింది.
‘అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని తెలియగానే ప్రారంభంలోనే అధికారులు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు. షోకాజ్ నోటీసు ఇవ్వగానే నిర్మాణాన్ని ఎందుకు సీజ్ చేయరు. అక్రమ నిర్మాణం పూర్తి చేసేవరకు ఎందుకు ఊరుకుంటున్నారు? నిర్మాణం అయ్యాక కూల్చివేస్తామని నోటీసు ఇవ్వడంలో ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదు’ అని హైకోర్టు మండిపడింది. గతంలోనే ఆదేశాలు జారీచేసినా ఎందుకు చర్యలు లేవని నిలదీసింది. అన్ని సరిల్స్లోనూ ఆధికారులు ఉంటారని, ఎకడ నిర్మాణాలు జరుగుతున్నాయో, ఏవి అనుమతి తీసుకుని కడుతున్నారో వాళ్లకు తెలిసినా కూడా చర్యలు తీసుకోవడం లేదంటే ఏమనుకోవాలని కూడా ప్రశ్నించింది. మార్చి 31 నాటికి ఇండ్ల పన్నులు వసూలు చేయాలనే తపన అధికారులకు ఉంటుందేగానీ అక్రమ నిర్మాణాలపై మాత్రం ఉండటం లేదని వ్యాఖ్యానించింది.
ఆదిలోనే చర్యలు ఎందుకు తీసుకోలేదు?
జీహెచ్ఎంసీ కూల్చివేత నోటీసును సవాల్ చేస్తూ రంగారెడ్డిజిల్లా శేరిలింగంపల్లి మండలం గుట్టలబేగంపేటకు చెందిన కే రఘువీరాచారి వేసిన పిటిషన్‌పై జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి విచారణ జరిపారు. ఈ సందర్భంగా ఆయన పైవిధంగా అధికారులను నిలదీశారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదిస్తూ, నిర్మాణం పూర్తయ్యిందని, దాని క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకున్నామని చెప్పారు. తమ దరఖాస్తుపై ఏ నిర్ణయం తీసుకోకుండానే నోటీసు ఇచ్చారని తెలిపారు. దీనిపై స్పందించిన హైకోర్టు, అధికారులు కళ్లు మూసుకున్నారా, లేక కళ్లున్నా చూడలేకపోతున్నారా, ఆదిలోనే అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోకుండా నిర్మాణం పూర్తి అయ్యాక కూల్చివేత నోటీసు ఇవ్వడం ఏమిటని నిలదీసింది. షోకాజ్ నోటీసు జారీచేసినపుడే సెక్షన్ 461 కింద అక్రమ నిర్మాణ ఆస్తిని ఎందుకు సీజ్ చేయరని ప్రశ్నించింది. పిటిషనర్‌కు జీహెచ్ఎంసీ ఇచ్చిన నోటీసు అమలును యథాతథస్థితిలో (స్టేటస్ కో) ఉంచాలని ఆదేశించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. విచారణను వాయిదా వేసింది.