హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఇజ్జత్‌నగర్, హైటెక్‌సిటీ వద్ద నిర్మిస్తున్న శ్రీముఖ్ నమిత 360 లైఫ్ ప్రాజెక్ట్ పనులను తక్షణమే నిలిపివేయాలని హైకోర్టు శుక్రవారం స్టే ఇచ్చింది. అక్రమ నిర్మాణాలను ఎలా కొనసాగిస్తారని జీహెచ్ఎంసీని నిలదీసింది. తక్షణమే పనులు నిలిపివేయాలని ఆదేశించింది. ఇజ్జత్‌నగర్‌లోని సర్వే నంబర్ 12/పీ, 13/పీలో చేపట్టిన నిర్మాణాలకు అగ్నిమాపక శాఖ, ఎయిర్‌పోర్టు అథారిటీ ఎన్వోసీలను జారీ చేయకుండానే పనులు కొనసాగించడాన్ని తప్పుపట్టింది. జీహెచ్ఎంసీని ప్రశ్నించింది. తదుపరి ఉత్తర్వుల వరకు స్టే అమల్లో ఉంటుందని ప్రకటించింది. ఈ మేరకు జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి మధ్యంతర ఉత్తర్వులిచ్చారు.
ఓటరు లిస్టులో మీ పేరున్నదా?
హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో పంచాయతీలవారీగా ముసాయిదా ఓటర్ల జాబితా విడుదలైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు శుక్రవారం గ్రామ పంచాయతీ, వార్డుల వారీగా జాబితాను వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లోకి వెళ్లి మీ జిల్లా, మండలం, గ్రామం, వార్డుల వారీగా ఓటరు లిస్టును చూసుకోవచ్చు. అభ్యంతరాలు తెలిపేందుకు అధికారులు శనివారం వరకు అవకాశం ఇచ్చారు. ఓటరు లిస్టులో పేరు లేకపోతే ఫామ్-8 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. పేరులో తప్పులు, ఇతర అభ్యంతరాలు ఏమైనా ఉంటే తెలుపవచ్చు.