హైదరాబాద్, జనవరి 12 (నమస్తే తెలంగాణ): రాంకీ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ కంపెనీకి చెందిన నిర్మాణాల రిజిస్ట్రేషన్లను నిలిపివేస్తూ హైకోర్టు ద్విసభ ధర్మాసనం స్టే ఉత్తర్వులు జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం సబ్ రిజిస్ట్రార్‌ను గతంలో సింగిల్ జడ్జి ఆదేశించారు. రిజిస్ట్రేషన్లను ఆ సంస్థ నిలిపివేయడంతో హెచ్ఎండీఏ సవాల్ చేసిన కేసులో సింగిల్ జడ్జి రిజిస్ట్రేషన్లను నిర్వహించాలని తీర్పు చెప్పారు. దీనిని సవాల్ చేస్తూ మీర్‌పేట్‌కు చెందిన పాలూరి రవిశంకర్‌తోపాటు మరొకరు అప్పీల్ పిటిషన్లు దాఖలు చేశారు. వీటిని ధర్మాసనం విచారించి రిజిస్ట్రేషన్లపై స్టే విధించింది. ప్రాజెక్టులోని విల్లాలు, ప్లాట్లు, ఫ్లాట్ల రిజిస్ట్రేషన్‌ను అనుమతించాలని సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల అమలును నిలిపివేస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయా న్, న్యాయమూర్తి జస్టిస్ ఎన్ తుకారాంజీ ధర్మాసనం ఇటీవల స్టే ఆదేశాలిచ్చింది. విచారణను ఫిబ్రవరి 22కు వాయిదా వేసింది.