హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): విద్యార్థుల హకుల పరిరక్షణలో చర్యలు తీసుకోవడంలో విద్యాశాఖ కమిషనర్ విఫలమయ్యారని హైకోర్టు తప్పుపట్టింది. యజమాని, అద్దెదారు వివాద ప్రభావం 750 మంది అమాయక విద్యార్థులపై పడుతుంటే కమిషనర్ వాళ్ల హకుల పరిరక్షణకు చర్యలు తీసుకోలేదని ఆక్షేపించింది. విద్యార్థుల విద్యాహకులను పరిరక్షించడం ప్రభుత్వ విధానమని గుర్తు చేసింది. ఓ వివాదం నేపథ్యంలో తక్షణమే పాఠశాలను ఖాళీ చేయాలంటూ సివిల్ కోర్టు జారీచేసిన ఉత్తర్వుల అమలును నిలిపివేస్తూ స్టే విధించింది. ముషీరాబాద్‌లోని ఇమాన్ ఎ జమానా మిషన్‌కు చెందిన స్థలంలో నిర్వహిస్తున్న రేడియంట్ పాఠశాలను తక్షణం ఖాళీ చేయాలంటూ సివిల్ కోర్టు ఈనెల 7న ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఆ పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు సుమారు 30 పిటిషన్లు దాఖలు చేశారు.
వీటిని జస్టిస్ సూరేపల్లి నంద శనివారం విచారించారు. యజమాని, అద్దెదారు మధ్య వివాదంతో అమాయకులైన 750 మంది విద్యార్థుల చదువుపై ప్రభావం పడుతున్నదని, దీనిపై తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరుతూ తల్లిదండ్రులు ఈ నెల 14న పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌కు వినతి పత్రం ఇచ్చారు. దీనిపై కమిషనర్ స్పందించకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. కమిషనర్ మీనమేషాలు లెకిస్తూ ఏమీ పట్టనట్టు వ్యవహరించారని, తల్లిదండ్రుల వినతిపత్రం తర్వాత కూడా స్పందించకపోవడం శోచనీయమని న్యాయమూర్తి తప్పుబట్టారు. కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులైన రాష్ట్ర ప్రభుత్వానికి, ఇమాన్ ఎ జమానా మిషన్లకు నోటీసులు జారీచేశారు. తదుపరి విచారణను నవంబరు 4వ తేదీకి వాయిదా వేశారు.