ఘాటైన విమర్శనాత్మక రాజకీయ పోస్టులు, ప్రసంగాలపై పోలీసులు యాంత్రికంగా కేసులు నమోదు చేస్తే చెల్లదు. పరువు నష్టం వాటిల్లిందనే ఆరోపణలతో చేసే ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసే ముందు.. ఫిర్యాదుదారు బాధిత వ్యక్తి అవునో కాదో పోలీసులు నిర్ధారణ చేసుకోవాలి. సోషల్ మీడియా పోస్టులతో సంబంధంలేని మూడో వ్యక్తి చేసే ఫిర్యాదులకు విచారణార్హత ఉండదు. పరువు నష్టం, ద్వేషపూరిత ప్రసంగం, హింసను ప్రేరేపించేది, సామాజిక అశాంతికి దారితీస్తుంది.. వంటి ఆరోపణలపై ఆధారాలు ఉంటేనే కేసు కొనసాగించాలి. కేవలం ఘాటైన రాజకీయ విమర్శ చేశారని చెప్పి నేరారోపణలు చేయడానికి వీల్లేదు.
-హైకోర్టు
హైదరాబాద్, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ): సోషల్ మీడియాపై అక్రమ కేసులతో ఉక్కుపాదం మోపేందుకు యత్నిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. రాజ్యాంగంలోని ప్రాథమిక హకులతోపాటు చట్టపరిధిలోనే పోలీసులు పనిచేయాలని కోర్టు స్పష్టంచేసింది. అప్రజాస్వామికంగా సోషల్ మీడియా యాక్టివిస్టులను అణచివేయాలని చూస్తున్న సర్కారుకు చెంపపెట్టులాంటి తీర్పును వెలువరించింది. సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన సోషల్‌మీడియా యాక్టివిస్ట్ శశిధర్‌గౌడ్ అలియాస్ నల్లబాలుపై పోలీసులు మూడు కేసులు నమోదు చేయడాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. సోషల్ మీడియా (ఎక్స్)లో కాంగ్రెస్ పార్టీపై, సీఎం రేవంత్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పోలీసులు నల్లబాలుపై మూడు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ఆ మూడు ఎఫ్ఐఆర్లను రద్దు చేస్తూ జస్టిస్ తుకారాంజీ బుధవారం సంచలన తీర్పు వెలువరించారు. ప్రాథమిక ఆధారాలు ఉంటేనే కేసు నమోదు చేయాలని, పదునైన రాజకీయ విమర్శలు, ఘాటైన వ్యాఖ్యలతో పోస్టులు ఉన్నాయని చెప్పి క్రిమినల్ కేసులను నమోదు చేయడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. సామాజిక మాధ్యమాల్లో పోస్టులకు సంబంధించి కేసులు నమోదు చేయడంపై పోలీసులు, మేజిస్ట్రేట్ కోర్టులకు పలు మార్గదర్శకాలు జారీచేసింది. ట్వీట్లు చట్టబద్ధమైన రాజకీయ వ్యక్తీకరణ పరిధిలోకి వస్తాయని స్పష్టంచేసింది. ప్రాథమిక హక్కుల పరిరక్షణతోపాటు కేసుల నమోదు, విచారణ యాంత్రికంగా, ఏకపక్షంగా జరగకుండా నిరోధించే క్రమంలో మార్గదర్శకాలను జారీ చేస్తున్నట్టు ప్రకటించింది.
ఈ తీర్పుతో సామాజిక మాధ్యమాల్లోని పోస్టులపై అడ్డగోలుగా కేసులు పెడుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి గట్టి దెబ్బ తిగిలింది. చట్టాలకు అనుగుణంగా పోలీసులు పనిచేయాలని కోర్టు స్పష్టంచేసింది. ట్విట్టర్ వేదికగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ట్వీట్స్ చేశారని చెప్పి కేసు నమోదు చేయడం చట్టవ్యతిరేకమని వెల్లడించింది. సోషల్ మీడియాలో రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎంకు వ్యతిరేకంగా పోస్టులు చేసినందుకు కేసులు పెడతామంటే చెల్లదని తెలిపింది. పోలీసులకు ఫిర్యాదు చేసే వ్యక్తి లేదా కేసులను నమోదు చేసే పోలీసులు, ఆ పోస్టుల వల్ల ఎవరికి నష్టం జరిగిందో విశ్లేషణ చేయకుండా ఏకపక్షంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం చెల్లదని పేర్కొంది. వ్యక్తిగతంగా నష్టం ఎవరికి జరిగిందో అంచనా వేయాల్సిన బాధ్యత పోలీసులదని చెప్పింది. ఆ తరువాతే పోలీసులు ఎఫ్ఐఆర్లు నమోదు చేయాలని సుప్రీంకోర్టు సైతం మార్గదర్శకాలను జారీచేసిందని గుర్తుచేసింది. సీఎంకు వ్యతిరేకంగా చేసిన పోస్టుల వలన మనోభావాలు దెబ్బతిన్నాయని, సామాజిక సమతుల్యత దెబ్బతింటుందని పేర్కొంటూ అసత్యపు పునాదులపై కేసులు కొనసాగించడానికి వీల్లేదని తేల్చిచెప్పింది. నిజంగానే పరువు పోతే, బాధితుడే నేరుగా ఫిర్యాదు చేయాలిగానీ మూడో వ్యక్తి తమ నాయకుడి పరువు పోయిందని ఫిర్యాదు చేస్తే.. దాని ఆధారంగా పోలీసులు కేసులు నమోదు చేయడం చెల్లదని తీర్పు చెప్పింది.
‘నో విజన్, నో మిషన్, ఓన్లీ ట్వంటీ పర్సంట్’, ‘రాష్ర్టానికి తెగులు కాంగ్రెస్ కీడు., సీఎం రేవంత్‌రెడ్డిది 20 పర్సంట్ కమీషన్ పాలన’, ‘ప్రభుత్వానికి విజన్ లేదు మిషన్ లేదు’ అంటూ బీఆర్ఎస్ అధికారిక హ్యాండిల్లో చేసిన పోస్టులను నల్లబాలు రీపోస్ట్ చేశారు. వీటిపై కేసులు నమోదుచేసిన పోలీసులు నల్ల బాలును 20 రోజులపాటు జైల్లో పెట్టారు. దీనిపై నల్లబాలు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ తరఫు న్యాయవాది టీవీ రమణారావు వాదనలు వినిపిస్తూ.. ఇవేమీ క్రిమినల్ చర్యలు కావని, రాజకీయ విమర్శలని, కానీ హింస, దురుద్దేశం, అల్లర్లు సృష్టించే పోస్టులని ఆరోపిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కేసులు పెట్టిందని తెలిపారు. ‘పోలీసులు బీఎన్ఎస్ చట్టంలోని సెక్షన్లు 192, 352, 353 కింద కేసులు నమోదు చేయడం చెల్లదు. పిటిషనర్ నల్లబాలు పెట్టిన సోషల్ మీడియా పోస్టుల వల్ల కీర్తిప్రతిష్టలు దెబ్బతిన్నాయంటే నేరుగా సీఎం లేదా ఆయన పార్టీ ఫిర్యాదు చేయాలి. పోలీసులు లేదా ఇతరులు ఫిర్యాదు చేయడానికి వీల్లేదు. వీటి ఆధారంగా పోలీసులు ఎఫ్ఐఆర్లను నమోదు చేయడం చట్ట వ్యతిరేకం’ అని అన్నారు. దీనిపై పోలీసుల తరఫు న్యాయవాది స్పందిస్తూ, పిటిషనర్ నల్ల బాలు ఇలాంటి కేసుల్లో నిందితుడిగా ఉన్నారని, కావాలని సీఎంను కించపరుస్తూ ప్రజల్లో సీఎంపై ఆగ్రహం కలిగించేలా పోస్టులు పెట్టారని చెప్పారు. కేసుల విచారణను కొనసాగించాలని కోరారు.
ఇరుపక్షాల వాదనల తర్వాత జస్టిస్ ఎన్ తుకారాంజీ స్పందిస్తూ.. ‘రాజకీయ విమర్శలు కఠినంగా లేదా ఘాటుగా ఉన్నప్పటికీ అవన్నీ రాజ్యాంగంలోని 19(1)(ఏ) అధికరణం కింద భారత పౌరుడికి లభించిన వ్యక్తిగత స్వేచ్ఛలోకి వస్తుంది. అవి రాజకీయ విమర్శలే. హింస, అల్లర్లు, దురుద్ధేశపూర్వక ప్రేరణ వంటి చర్యలకు దోహదపడే విమర్శలు కావు. ఇందుకు సెక్షన్లు వర్తించవు. ప్రతిష్ట దెబ్బతిన్నదనే అంశానికి వస్తే.. ఎవరి పరువు, ప్రతిష్టలు దెబ్బతిన్నాయని భావించారో వాళ్లే ఫిర్యాదు చేయాలి. ఇక్కడ ఆ విధంగా జరగలేదు. ఎఫ్ఐఆర్లను పూర్తిగా యాంత్రికంగా, ఎలాంటి దర్యాప్తు చేయకుండా, చట్టవ్యతిరేకంగా నమోదు చేశారని స్పష్టమవుతున్నది. లలిత్కుమారి కేసులో సుప్రీంకోర్టు జారీచేసిన మార్గదర్శకాలు, నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నది. ఈ నేపథ్యంలో పిటిషనర్ నల్ల బాలుపై పోలీసులు నమోదు చేసిన మూడు ఎఫ్ఐఆర్లను రద్దు చేస్తున్నాం. రామగుండం, కరీంనగర్, గోదావరిఖని వన్‌టౌన్ పోలీసుస్టేషన్లలో నమోదైన కేసులను కొనసాగించాల్సిన అవసరం లేదు. పిటిషనర్‌పై పరువు నష్టం కేసు నమోదు చేయాలంటే, తప్పనిసరిగా బాధితుడు మాత్రమే పోలీసులకు ఫిర్యాదు చేయాలి. నల్ల బాలు సోషల్ మీడియా వేదికగా చేసి ట్వీట్స్ పూర్తిగా రాజకీయ విమర్శలు మాత్రమే. అశ్లీలత, అల్లర్లు, హింసల కిందకు రానేరావు. వాటిని ప్రేరేపించే ట్వీట్స్ కూడా కావు. పరువు నష్టం అనే పోలీసుల వాదన ప్రకారం చూసినప్పటికీ ట్వీట్స్ వల్ల పరువుపోయిందని భావించే బాధితుడు ఫిర్యాదు చేయలేదు, కాబట్టి అవి చెల్లవు’ అని తీర్పు చెప్పారు.
బాధితుల హక్కుల పరిరక్షణ, అధికారుల బాధ్యతలపై హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. కేసు విచారణ తీరుపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది. రాజ్యాంగ అధికరణాల ప్రకారం ప్రతి పౌరుడికి త్వరిత న్యాయం పొందే హక్కు ఉందని గుర్తుచేసింది. బాధితులతో సంబంధం లేకుండా పోలీసులు నిర్ణయం తీసుకోవడం అన్యాయమని ఆక్షేపించింది. ఇది సహజ న్యాయసూత్రాలకు భంగం కలిగించడమేనని వ్యాఖ్యానించింది. చట్ట ప్రకారం బాధితులకు న్యాయ పరిరక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తేల్చి చెప్పింది. విచారణ చట్ట ప్రకారం చేయని అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులు జారీచేసింది. ప్రజాసేవకులుగా ఉన్న అధికారులు తమ బాధ్యతలను నిర్వర్తించకపోతే న్యాయవ్యవస్థపై ప్రజల నమ్మకం దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తంచేసింది. ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం పోలీసులు వ్యవహరించలేదని తప్పుపట్టింది. చట్ట ప్రకారం ఆధారాలు లేకుండా కేసులో నిర్ణయం తీసుకోవడం చెల్లదని తేల్చింది. రాజ్యాంగంలోని 32వ అధికరణం ప్రకారం వ్యక్తులు తమ హక్కులను రక్షించుకునే మార్గాలను కోర్టులు నిర్దేశించడం ద్వారా న్యాయ వ్యవస్థకు మార్గదర్శకంగా నిలుస్తాయని హైకోర్టు అభిప్రాయపడింది.
విమర్శనాత్మక అంశాలను సామాజిక మా ధ్యమాల్లో పోస్టు చేశారన్న కారణంగా క్రిమినల్ కేసులతో చర్యలు తీసుకోడానికి వీల్లేదని కోర్టు స్పష్టంచేసింది. ‘పరువు నష్టం. ద్వేషపూరిత ప్రసంగం. హింసను ప్రేరేపించేది, సామాజిక అశాంతికి దారితీస్తుంది వంటి ఆరోపణలను ఆధారాలు ఉంటేనే కేసు కొనసాగించాలి. కేవ లం రాజకీయ విమర్శ చేశారని చెప్పి నేరారోపణలు చేయడానికి వీల్లేదు. కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర ప్రభుత్వంపై సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేశారని చెప్పి రామగుండం, కరీంనగర్ పోలీసుస్టేషన్లలో నమోదైన మూడు కేసులను నల్ల బాలు అలియాస్ దుర్గం శశిధర్‌గౌడ్ సవాల్ చేయడాన్ని సమర్థిస్తున్నాం’ అని పేర్కొంది.
ఈ తీర్పు సోషల్ మీడియా పోస్టులపై అడ్డగోలుగా కేసులు పెట్టే ప్రభుత్వాలకు చెంపపెట్టు లాంటిదని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభివర్ణించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 21 నెలలుగా బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, సోష ల్ మీడియా కార్యకర్తలపై రాజకీయ ప్రేరేపితమైన కేసులు పెట్టి వేధిస్తున్నదని విమర్శించా రు. బీఆర్ఎస్ మద్దతుదారులు, సోషల్ మీడి యా యోధులపై వేధింపులను తక్షణమే ఆపాలని కేటీఆర్ తెలంగాణ డీజీపీ, సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్‌కు విజ్ఞప్తిచేశారు. రాష్ట్ర ప్రభుత్వం అణచివేత విధానాలను పకన పెట్టి ప్రజాస్వామ్య స్ఫూర్తితో ముందుకు నడవాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ తన కార్యకర్తలకు, కేసీఆర్ నాయకత్వాన్ని తిరిగి తీసుకురావడానికి పోరాడుతున్న వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఈ సందర్భంగా హైకోర్టు పలు మార్గదర్శకాలను జారీచేసింది. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసేముందు ఫిర్యాదుదారుడు స్వయంగా బాధితుడా కాదా అనేది తేల్చుకోవాలి. సోషల్ మీడియా పోస్టుల వల్ల పరువుపోయిందని మూడో వ్యక్తి ఫిర్యాదు చేస్తే చెల్లదు. ప్రాథమిక విచారణ లేకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేయకూడదు. ఎవరి పరువు పోయిందో ఆ వ్యక్తి ఫిర్యాదు చేస్తేనే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. రాజకీయ విమర్శలు లేదా కఠినమైన వ్యాఖ్యలతో కూడిన పోస్టు సోషల్ మీడియాలో ఉందని చెప్పి దానిని నేరంగా పరిగణించడానికి వీల్లేదు. హింసను ప్రేరేపించే విధంగా పోస్టు ఉంటే ఆ తరహా కేసు నమోదు చేయవచ్చు. పోలీసులు కేసు నమోదు చేసిన తర్వాత నిందితుడిని అరెస్టు చేసే ముందు సుప్రీంకోర్టు అర్నేశ్‌కుమార్ కేసులో జారీచేసిన మార్గదర్శకాలను విధిగా అమలుచేయాలి. రాజకీయ ప్రేరేపితమైన లేదా నిరాధారమైన ఫిర్యాదులను తిరస్కరించాలని కూడా సుప్రీంకోర్టు చెప్పింది.