స్కూళ్లలో మీరు పెట్టే ఆహారం తిన్న పిల్లలు వాంతులు, విరేచనాలు చేసుకుని దవాఖానల పాలవుతుంటే ఎలా? వారంలో మూడుసార్లు ఇలా జరిగిందంటే ఏమనుకోవాలి? అధికారులు మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తున్నది. వివరాలు ఇవ్వడానికి వారం రోజులు ఎందుకు? అధికారుల వద్ద సెల్ఫోన్లు లేవా? ఏ యుగంలో ఉన్నాం మనం. పాలకులు, అధికారుల పిల్లలకు ఇలాగే జరిగితే ఊరుకుంటారా?
– హైకోర్టు
High Court | హైదరాబాద్, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ విద్యా సంస్థల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు తీరు అధ్వాన్నంగా ఉన్నదని హైకోర్టు నిప్పులు చెరిగింది. ప్రభుత్వం పెట్టే ఆహారం తిన్న అమాయక విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురవుతుంటే పాలకులు, అధికారుల్లో కదలిక లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్యార్థుల ప్రాణాలు పోతేగానీ రాష్ట్ర ప్రభుత్వంలో కదలిక రాదా? అని నిగ్గదీసింది. ‘స్కూళ్లలో ప్రభుత్వం పెట్టే ఆహారం తిన్న అమాయక విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురవుతుంటే పాలకులు, అధికారుల్లో కదలిక ఎందుకు రావడం లేదు. పేదింటి పిల్లలు అన్నం దొరికితే చదువుకోవచ్చునని బడులకు వస్తారని తెలుసుకదా.. ఎవరికీ చెప్పుకోలేని ఆ పిల్లలు మీరు పెట్టే ఆహారం తిని వాంతులు, విరేచనాలు చేసుకుని దవాఖానల పాలవుతుంటే ఎలా? పిల్లల ప్రాణాలు పోతేగానీ రాష్ట్ర ప్రభుత్వంలో కదలిక రాదా?’ అని మండిపడింది.
‘పాఠశాలల్లో పిల్లలకు పెట్టే ఆహార నాణ్యత బాగుంటే వాళ్లు ఎందుకు అనారోగ్యానికి గురౌతారు? పిల్లలు ఆహా రం తిన్నాక దవాఖానపాలు కావడం ఒకసారి కాదు, రెండుసార్లు కాదు ఏకంగా మూడుసార్లు జరిగిందంటే ఏమనుకోవాలి? వారంలో మూడుసార్లు భోజనం వికటిస్తుందా? ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అర్థం అవుతున్నది కదా? అధికారులు నిద్రపోతున్నారా? అధికారులు మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నట్టు అనిపిస్తున్నది’ అంటూ ఆగ్రహం వ్యక్తంచేసింది. ‘ఆ ఘటనలపై వివరాలు ఇవ్వమంటే వారం రోజుల గడువు కావాలని ప్రభుత్వం కోరడం ఏమిటో అర్ధం కావడం లేదు.
నారాయణపేట డీఈ వో, ఇతర ఆఫీసర్ల దగ్గర సెల్ఫోన్లు లేవా? ఏ యు గంలో ఉన్నాం. అత్యాధునిక సౌకర్యాలు ఉన్నప్పు డు కూడా వివరాలు ఇవ్వడానికి వారం రోజులు కో రడం ఏమిటి? దీనిని బట్టే ప్రభుత్వం ఎంత నిర్లిప్తంగా ఉందో స్పష్టం అవుతున్నది. పాలకులు, అధికారుల పిల్లలకు ఇలా జరిగితే ఊరుకుంటారా? అధికారులకు కూడా పిల్లలుంటారు కదా. ఇదేనా పేద పిల్లలు చదువుకోవాలనే ఆశల్ని చిగురింపజేసే విధానం?’ అంటూ నిలదీసింది. ‘ఇంత తీవ్రమైన ఘటనపై వివరాలు ఇవ్వడానికి ఏడు రోజులు ఎందుకు? ఒక జిల్లా స్థాయి అధికారి నుంచి పూర్తి వివరాలు తెప్పించడానికి వారం రోజులు కావాలా? నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తే ఐదే ఐదు నిమిషాల్లో ఇకడ ఉంటారు!’ అంటూ నిప్పులు చెరిగింది. ‘ప్రభుత్వం మన్ను తిన్న పాములా మిన్నకుంటుందా? మాకే కనుక ఈ వ్యవహారాన్ని అప్పగిస్తే తక్షణమే జిల్లా విద్యా శాఖాధికారిని సస్పెండ్ చే స్తాం’ అని ఘాటుగా స్పందించింది. పది నిమిషాలు గడువు ఇస్తున్నామని, ఈలోగా ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ హాజరుకావాలని ప్రభుత్వ న్యాయవాదికి తేల్చి చెప్పింది.
నిబంధనలు అమలుకావడం లేదు
ప్రైవేట్ ఎయిడెడ్ పాఠశాలల్లో మధ్యాహ్న భోజ నం పథకం అమలు, ఐసీడీఎస్ పథకం అమలుకు సంబంధించిన జీవో వన్ (1) గురించి హైదరాబాద్‌కు చెందిన హెల్ప్ ది పీపుల్ అనే సంస్థ అధ్యక్షుడు కే అఖిల్ శ్రీగురుతేజ దాఖలుచేసిన ప్రజాహిత వ్యా జ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జే శ్రీనివాసరావుతో కూడిన ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ చేపట్టింది. తొలుత పిటిషనర్ తరఫు న్యాయవాది చికుడు ప్రభాకర్ వాదనలు వినిపిస్తూ, మధ్యాహ్న భోజన పథకం అమలు తీరు ఘోరంగా ఉందని చెప్పారు. నారాయణపేట జిల్లా మాగనూరులోని ప్రభుత్వ పాఠశాలలో ఈ నెల 21, 24, 26న విద్యార్థులు ఆహారం తీసుకున్నాక దవాఖానపాలయ్యారని చెప్పారు.
ఒకే స్కూల్లో వారం వ్యవధిలో వరుసగా మూడు ఘటనలు జరిగాయని తెలిపారు. అధికారులు నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నారని, పాలకులు పట్టించుకోవడం లేదని చెప్పారు. నిబంధనలను కచ్చితంగా అమలు చేయడంలో వైఫల్యం చెందారని అన్నారు. కరీంనగర్ జిల్లాలోని మరో పాఠశాలలో కూడా అదే మాదిరిగా విద్యార్థులు మధ్యాహ్న భోజనం వికటించి అస్వస్థతకు గురయ్యారని చెప్పారు. అన్ని పాఠశాలల్లో తల్లి లేదా తండ్రి ఉండే గవర్నింగ్ బాడీ ఉండాలన్న ప్రభుత్వ ఉత్తర్వుల్లోని నిబంధన కూడా అమ లు కావడం లేదని తెలిపారు. అదనపు ఏజీ ఖాన్ స్పందిస్తూ, మాగనూరు పాఠశాలలో రెండు ఘటనలే జరిగాయని అన్నారు. విద్యార్థులు బయట జంక్‌ఫుడ్ తీసుకోవడం వల్ల ఒకసారి అస్వస్థతకు గురయ్యారని చెప్పారు. మాగనూరు ఘటనలో ఒక ఉపాధ్యాయుడ్ని ప్రభుత్వం సస్పెండ్ చేసిందని, మధ్యాహ్న భోజనం సరఫరా చేసే వాళ్లను మార్చిందని వివరించారు. రెండుచోట్ల జరిగిన మూడు ఘటనలపై పూర్తి వివరాలు, బాధ్యులపై తీసుకున్న చర్యలతో సమగ్రంగా అఫిడవిట్ దాఖలు చేస్తామనగా, విచారణను డిసెంబర్ 2కు వాయిదా పడింది.
వారం గడువు అడిగేందుకు సిగ్గుపడాలి
మాగనూరు ఘటనపై నివేదిక ఇచ్చేందుకు వారం గడువు కావాలని ఏజీపీ నాగార్జున కోరడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మాగనూరు ఎంతదూరంలో ఉందని, ఇంటర్నెట్, వైఫై వంటి వసతులు ఉన్న ప్రాంతామేనా అని ఆరా తీసింది. హైదరాబాద్‌కు సుమారు 70 కిలోమీటర్ల దూరంలోనే మాగనూరు ఉందని, ఇంటర్నెట్ వంటి అన్ని వసతులు ఉన్నాయని న్యాయవాది చికుడు ప్రభాకర్ చెప్పారు. ‘వారం రోజులు గడువు అడిగేందుకు సిగ్గుపడాలి. అధికారులకు పిల్లలు లేరా? పిల్లలు చనిపోతేగానీ స్పందించరా? మేము గనుక నాన్ బెయిలబుల్ వారెంట్ జారీచేస్తే ఈ రోజే మధ్యాహ్నానికి అధికారులు విచారణకు హాజరవుతారు’ అని ధర్మాసనం హెచ్చరించింది.
మైనస్ 30 డిగ్రీలు ఉండేంత దూరంలో ఏమైనా మాగనూరు ఉందా? అని నిలదీసింది. మీకు పిల్లలు లేరా, మీ పిల్లలకు ఇలా జరిగితే కూడా ఇలాగే ఉంటారా? పేద ప్రజలను ప్రైవేట్ సూల్స్‌లో చదివించలేక ప్రభుత్వ బడులకు పంపితే ఇలాంటి కలుషిత ఆహారం పెడతారా? అని నిప్పులు చెరిగింది. విచారణకు అడ్వకేట్ జనరల్ హాజరై వివరణ ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్పింది. పావుగంట తర్వాత అదనపు అడ్వకేట్ జనరల్ మహ్మద్ ఇమ్రాన్‌ఖాన్ విచారణకు హాజరై పూర్తి వివరాలు తెలుసుకుని నివేదించేందుకు వీలుగా విచారణను మధ్యాహ్నానికి వాయిదా వేయాలని కోరారు. భోజన విరామం తర్వాత విచారణ చేపట్టింది. ఏఏజీ ఖాన్ వాదనలు వినిపించారు. ఈ సమయంలో చికుడు ప్రభాకర్ కల్పించుకుంటూ మాగనూరులో ఈ నెల 21న 50 మంది, 24న 70, 26న 27 మంది చొప్పున విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని వివరించారు. మూడుసార్లు వరుసగా ఒకే స్కూల్ విద్యార్థులు దవాఖానపాలయ్యారని, ఇది ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యమని చెప్పారు.
ప్రభుత్వానికి ప్రశ్నలతో ఉకిరిబికిరి
మీకు పిల్లలు ఉన్నారా. ఉంటే ఇలాగే చేస్తా రా, మీకు బాధ్యత ఉందా, ఉంటే కూడా ఇలా చేస్తారా, ప్రభుత్వం సిగ్గు పడాలి. వారంగడువు కావాలా, మైనస్ 30 డిగ్రీలుండే వేల మైళ్ల దూరంలో అధికారులు ఉన్నారా, మాగనూరు ఎంత దూరంలో ఉంది. అకడ వైఫై వంటి సౌకర్యాలు ఉన్నాయని చెప్తున్నారు, మాగనూరు ఒకే సూల్లో వారంలో3 సార్లు మీరు పెట్టిన ఆహారం వల్ల అస్వస్థతకు గురౌతుంటే, డీఈవో, ఫుడ్ ఆఫీసర్స్, నోడల్ ఏజెన్సీ సూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కం కమిషనర్, తనిఖీ అధికారులు ఏం చేస్తున్నారు? మధ్యాహ్న భోజన కమిటీలు ఏం చేస్తున్నాయి? అంటూ హైకోర్టు ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించింది.