హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ) : అధికారం ఉన్నంత మాత్రాన కొండలను, రాళ్లను పేల్చడానికి పేలుళ్లకు సిటీ పోలీస్ కమిషనర్ ఎలా అనుమతి ఇస్తారని హైకోర్టు మంగళవారం ప్రశ్నించింది. ఏ విధంగా ఎన్వోసీ జారీ చేస్తారో చెప్పాలని గత విచారణలో కోరితే ఎందుకు ఇవ్వలేదని అసంతృప్తి వ్యక్తంచేసింది. 24 గంటల్లో వివరాలు అందజేయాలని ఆదేశించింది. దీనిపై ప్రభుత్వం కల్పించుకుంటూ.. ప్రతివాదులుగా గనుల శాఖ ఉన్నదని, పోలీస్ కమిషనర్ లేరని చెప్పింది. దీంతో సిటీ పోలీస్ కమిషనర్‌ను ప్రతివాదిగా చేర్చాలని ధర్మాసనం ఆదేశించింది.
ఎన్వోసీ ఇచ్చే అధికారం సిటీ పోలీస్ కమిషనర్‌కు ఉన్నదని చెప్పడంకాదని, ఏ ప్రాతిపదికన అనుమతి ఇస్తున్నారో చెప్పాలని ఆదేశించింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ న్యాయవిహార్ ప్రాంతంలో రాత్రివేళల్లో పేలుళ్లు నిర్వహించడంపై 2024లో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేశ్ భీమపాక రాసిన లేఖను హైకోర్టు పిల్‌గా పరిగణించింది. దీనిపై చీఫ్ జస్టిస్ ఆపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్‌తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. తదుపరి విచారణను ఈ నెల 23కు వాయిదా వేసింది.