Runa Mafi | వెల్దండ, జనవరి 6 : ‘మాకు రుణమాఫీ కాలేదు.. అన్ని అర్హతలున్నా వర్తింపజేయలేదు.. రూ.2 లక్షల వరకు వ్యవసాయ లోన్లను మాఫీ చేస్తామని ఆర్భాట ప్రకటనలతో కాంగ్రెస్ ప్రభుత్వం మోసంచేసింది.. ఎందుకు కాలేదని అధికారులను అడిగితే.. మేమేమి చేయాలి.. ప్రభుత్వం ఇస్తే వద్దంటామా..? మా చేతిలో ఏమీ లేదు’.. అని జారుకుంటున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలం బండోన్పల్లికి చెందిన వావిళ్ల అల్వాల్ యాదవ్‌తోపాటు 15 మంది రైతులు తమకు రుణమాఫీ కాలేదని కోర్టును ఆశ్రయించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాము వెల్దండ ఎస్బీఐలో రుణాలు తీసుకున్నామని, ప్రభుత్వం ప్రకటించిన మాఫీ తమకు వర్తించలేదని వాపోయారు. ఈ బ్యాంక్ పరిధిలో మండలంలో మొత్తం 1671 మంది రైతులకు మాఫీకాలేదని తెలిపారు. అధికారులను అడిగితే తమ తప్పు ఏమీ లేదని చెబుతున్నారని వాపోయారు. చేసేది లేక హైకోర్టును ఆశ్రయించినట్టు పేర్కొన్నారు.