హైదరాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగాణ) : సిద్దిపేట శాసనసభ్యుడిగా హరీశ్‌రావు ఎన్నికను సవాల్ చేస్తూ కాంగ్రెస్ నాయకుడు, రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్‌గౌడ్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు డిస్మిస్ చేసింది. చక్రధర్‌గౌడ్ ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని, ఆ పిటిషన్లో విచారణ అంశాలు ఏమీ లేవని తేల్చింది. హరీశ్‌రావుపై చేసిన ఆరోపణలకు ఆధారాలను సమర్పించడంలో పిటిషనర్ విఫలమ్యారని పేర్కొంటూ.. చక్రధర్‌గౌడ్ పిటిషన్‌ను తిరస్కరిస్తున్నట్టు స్పష్టం చేసింది. ఈ మేరకు జస్టిస్ కే శరత్ మంగళవారం 24 పేజీల తీర్పును వెలువరించారు. వివరాల్లోకి వెళ్తే.. 2023 శాసనసభ ఎన్నికల్లో సిద్దిపేట నుంచి బీఎస్పీ అభ్యర్ధిగా పోటీచేసి హరీశ్‌రావు చేతిలో ఘోరంగా ఓడిపోయిన చక్రధర్‌గౌడ్ (ప్రస్తుతం కాంగ్రెస్ నాయకుడు).. ఆ ఎన్నికల చెల్లదంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు.
ఎన్నికల అఫిడవిట్లో హరీశ్‌రావు వాస్తవాలను గోప్యంగా ఉంచారని, తనపై క్రిమినల్ కేసులు ఉన్న విషయాన్ని తొకిపెట్టారని, ఎన్నికల వ్యయం గురించి పేరొనలేదని, ఓటర్లను ప్రభావితం చేశారని ఆ పిటిషన్లో పేర్కొంటూ.. హరీశ్‌రావు ఎన్నికను రద్దు చేయాలని కోరారు. దీంతో నిబంధనల ప్రకారం ఎన్నికల అధికారికి హరీశ్‌రావు నామినేషన్ పత్రాలు సమర్పించారని, అదంతా చట్టప్రకారమే జరిగిందని ఆయన తరఫున సీనియర్ న్యాయవాది జే రామచందర్‌రావు, న్యాయవాది ఆర్ చంద్రశేఖర్‌రెడ్డి వాదనలు వినిపించారు. చక్రధర్‌గౌడ్ ఆరోపణలకు ఆధారాలు లేవని పేర్కొంటూ.. ఆయన పిటిషన్‌ను ఆదిలోనే తోసిపుచ్చాలని కోరారు. దీనిపై చక్రధర్‌గౌడ్ తరపు న్యాయవాది ప్రతివాదన చేస్తూ.. పిటిషనర్ అభియోగాలకు ఆధారాలు ఉన్నాయని, సిద్దిపేట నియోజకవర్గ ఓట్లను తిరిగి లెకించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి వినతిపత్రం ఇచ్చామని చెప్పారు. అనంతరం హైకోర్టు స్పందిస్తూ.. హరీశ్‌రావుపై చేసిన ఆరోపణలకు ఆధారాలను సమర్పించడంలో చక్రధర్‌గౌడ్ విఫలమయ్యారని, పిటిషనర్ వాదనను ఆమోదించలేమని తేల్చిచెప్పింది.
హరీశ్‌రావుపై ఉన్న పెండింగ్ కేసులతోపాటు శిక్ష పడిన కేసుల వివరాలన్నీ ఆయన ఎన్నికల అఫిడవిట్లో ఉన్నాయని హైకోర్టు పేర్కొన్నది. హరీశ్‌రావు ఏ క్రిమినల్ కేసుల వివరాలను వెల్లడించలేదో చక్రధర్‌గౌడ్ తెలియజేయనందున ఆయన వ్యాజ్యాన్ని అనుమతించలేమని స్పష్టం చేసింది. మిట్టపల్లి గ్రామం 1037 సర్వే నంబర్లోని వ్యవసాయ భూములను హరీశ్‌రావు వ్యవసాయేతర భూములుగా చూపి తప్పుదారి పట్టించారని ఆరోపించిన చక్రధర్‌గౌడ్.. ధరణి పోర్టల్‌లోని వివరాలను ఎలాంటి ధ్రువీకరణ లేకుండా తన పిటిషన్లో పొందుపర్చారని తప్పుపట్టింది. ఎన్నికల వ్యయం నిమిత్తం హరీశ్‌రావు ప్రత్యేకంగా ఓపెన్ చేసిన బ్యాంక్ ఖాతా వివరాలను ఎన్నికల అధికారులకు సమర్పించారని హైకోర్టు పేర్కొన్నది. ఎన్నికలకు హరీశ్‌రావు ఎంత ఖర్చు చేశారో, ఆయన ఏ ఖర్చుల వివరాలు వెల్లడించలేదో చక్రధర్‌గౌడ్ చెప్పలేదని ఆక్షేపించింది.
హరీశ్‌రావు ఎన్నికపై నిరుడు జనవరి 10న పిటిషన్ దాఖలు చేసిన చక్రధర్‌గౌడ్.. ఎన్నికల అధికారులకు మాత్రం సెప్టెంబర్ 30న వినతిపత్రం సమర్పించారని హైకోర్టు గుర్తించింది. దీన్ని బట్టి చూస్తే.. చక్రధర్‌గౌడ్ వ్యూహాత్మక ఆలోచనతోనే ఈసీకి వినతిపత్రం ఇచ్చినట్టు స్పష్టమవుతున్నదని, దీనికితోడు ఈసీకి అందజేసిన వినతిపత్రం ప్రతిని ఆయన హైకోర్టుకు అందజేయలేదని పేర్కొన్నది. అందుకే ఆయన ఎలక్షన్ పిటిషన్‌ను డిస్మిస్ చేస్తున్నట్టు తీర్పులో స్పష్టం చేసింది.
జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఎన్నికను సవాల్ చేస్తూ దాఖలైన రెండు పిటిషన్లపై హైకోర్టు విచారణను మూసివేసింది. ఆయన చేతిలో ఓటమిపాలైన కాంగ్రెస్ అభ్యర్ధి మహ్మద్ అజారుద్దీన్‌తోపాటు నవీన్ యాదవ్ వేర్వేరుగా దాఖలు చేసిన ఈ పిటిషన్లు మంగళవారం హైకోర్టు విచారణకు వచ్చాయి. కానీ, అనారోగ్య కారణాలతో గోపీనాథ్ ఇటీవల కన్నుమూయడంతో ఆ పిటిషన్లపై విచారణ అవసరం లేదని జస్టిస్ కే లక్ష్మణ్ ప్రకటించారు.
క్వారీ యజమాని మనోజ్‌ను బెదరించి, రూ.50 లక్షలు డిమాండ్ చేసినట్టు హనుమకొండ జిల్లా సుబేదారి పోలీస్ స్టేషన్లో తనపై నమోదైన కేసును సవాలు చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం హైకోర్టులో ఇరుపక్షాల వాదనలు పూర్తయ్యాయి. దీంతో తీర్పును వాయిదా వేస్తున్నట్టు హైకోర్టు ప్రకటించింది. తుది ఉత్తర్వులు వెలువరించే వరకు కౌశిక్‌రెడ్డిని అరెస్టు చేయరాదని గతంలో జారీచేసిన మధ్యంతర ఉత్తర్వులు పొడిగిస్తున్నట్టు జస్టిస్ కే లక్ష్మణ్ తెలిపారు.