హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ) : గ్రూప్-1 పరీక్షను తెలుగులో ఎంతమంది రాశారో, వారిలో ఎంతమంది అర్హత సాధించారో చెప్పాలని హైకోర్టు టీజీపీఎస్సీని ఆదేశించింది. ఈ అంశాన్ని పిటిషనర్లు తమ వ్యాజ్యాల్లో లేవనెత్తలేదని సర్వీస్ కమిషన్ న్యాయవాది చెప్పడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తంచేసింది. తమ ముందున్న అంశం గ్రూప్-1 మూల్యాంకనంలో అవకతవకలపైనేనన్న విషయాన్ని విస్మరించరాదని తేల్చిచెప్పింది. మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయని పిటిషనర్లు చెప్తున్నారని, ఈ నేపథ్యంలో తెలుగులో పరీక్షలు రాసిన వారి వివరాలను చెప్పబోమని అంటే ఎలాగని ప్రశ్నించింది. తాము అడిగిన వివరాలు చెప్పి తీరాలని స్పష్టం చేయడంతో సర్వీస్ కమిషన్ న్యాయవాది తెలుగులో పరీక్ష రాసిన అభ్యర్థుల వివరాలు వెల్లడించారు. గ్రూప్-1 పరీక్షలో అవకతవకలపై దాఖలైన పిటిషన్ల మీద బుధవారం జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు విచారణ కొనసాగించారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు కే శ్రీనివాసమూర్తి, రచనారెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఎనిమిది వేల మంది అభ్యర్థులు గ్రూప్-1 పరీక్షలు రాస్తే వారిలో 60 మందిలోపు మాత్రమే ఉత్తీర్ణత సాధించారని చెప్పారు.
మూల్యాంకనం కోసం ఎంపిక చేసినవారికి తెలుగు తెలియకపోవడంతో అభ్యర్థులకు అన్యాయం జరిగిందని తెలిపారు. తెలుగులో పరీక్ష రాసిన అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయారని చెప్పారు. తెలుగురాని, అర్హతలేని వారు మూల్యాంకనం చేయడమే ఈ దుస్థితికి కారణమని తెలిపారు. ఈ సమయంలో హైకోర్టు స్పందిస్తూ.. ఏయే భాషలో ఎంతమంది పరీక్షలు రాశారో, వారిలో ఎంతమంది ఉత్తీర్ణత సాధించారో చెప్పాలని కోరింది. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుకు గ్రూప్-1 పరీక్షలు ఎంతో కీలకమని, గందరగోళంగా నిర్వహించిన పరీక్షల ద్వారా జరిగే ఎంపిక వచ్చే రెండు మూడు తరాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేశారు. టీజీపీఎస్సీ తరఫున సీనియర్ న్యాయవాది ఎస్ నిరంజన్‌రెడ్డి ప్రతివాదన చేస్తూ.. మూల్యాంకనం మూడు దశల్లో జరిగిందని తెలిపారు. ప్రొఫెసర్ మూల్యాంకనం చేశాక రెండో మూల్యాంకనం జరుగుతుందని, ఇందులో వ్యత్యాసం 15 శాతానికి మించితే మూడో వ్యక్తి మూల్యాంకనం చేశారని వివరించారు. తొలి మూల్యాంకనంలో ఎన్ని మారులు వచ్చాయో రెండో మూల్యాంకనం చేసేవాళ్లకు తెలియదని చెప్పారు. అక్రమాలు జరగలేదని అన్నారు. గురువారం కూడా విచారణ కొనసాగనున్నది.