High Court | హైదరాబాద్, ఏప్రిల్ 30, (నమస్తే తెలంగాణ) : గ్రూప్-1 మెయిన్ పరీక్ష ముల్యాంకనం చేసిన వారిలో తెలుగు భాషపై పట్టున్న వాళ్లు ఉన్నారా? తెలుగులో గ్రూప్-1 పరీక్షలు రాసిన అభ్యర్థుల్లో ఎంతమంది ఎంపికయ్యారు? వారి సంఖ్య ఎందుకు తగ్గింది? తెలుగులో రాస్తే మారులు రావా? వారి మారులు ఎందుకు తగ్గాయి? అసలు మెయిన్ పరీక్షల మూల్యాంకనానికి ప్రాతిపదిక ఏంటి? మూల్యాంకనం చేసే వాళ్లకు అభ్యర్థులు రాసిన పరీక్ష పత్రాలతోపాటు జవాబు పత్రాలు ఇచ్చారా? ఇవ్వకపోతే మూల్యాంకనం ఎలా చేస్తారు? దానికి ఒక శాస్త్రీయత ఉంటుందా? అన్ని పిటీషన్లలోను ఇదే ప్రధాన ఆరోపణ, ఇదే అభ్యర్థుల ప్రధాన ఆందోళన. దీనికి కారణాలు ఏమిటి? అని ప్రశ్నిస్తూ.. హైకోర్టు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ)ని ఉకిరిబికిరి చేసింది. ఈ ప్రశ్నలకు సంబంధించిన వివరాలన్నింటినీ గురువారం జరిగే విచారణలో అందజేయాలని ఆదేశించింది. గ్రూప్-1 మెయిన్ పరీక్ష నిర్వహణ, మూల్యాంకనాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై బుధవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నామవరపు రాజేశ్వర్‌రావు విచారణ జరిపారు. గ్రూప్-1 మెయిన్ పరీక్ష పత్రాల మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ దాఖలైన వ్యాజ్యాల్లో న్యాయమూర్తి ఇప్పటికే గ్రూప్-1 పోస్టుల భర్తీ ప్రక్రియ నిలిపివేయాలని మధ్యంతర ఉత్తర్వులను జారీచేశారు. ఈ ఉత్తర్వులను రద్దు చేయాలంటూ టీజీపీస్సీ దాఖలు చేసిన అప్పీళ్లపై డివిజన్ బెంచ్ విచారణకు నిరాకరించింది. దీంతో ప్రధాన పిటిషన్‌పై సింగిల్ జడ్జి వద్ద వాదనలు కొనసాగాయి.
మెయిన్ మూల్యాంకనానికి అనుసరించే ప్రాతిపదిక, మారుల కేటాయింపు విధానంపై వివరాలు కోర్టు కోరింది. మూల్యాంకనం చేసేందుకు నియమించిన వారిలో తెలుగులో ప్రావీణ్యమున్న వారెందరో చెప్పాలని నిలదీసింది. తెలుగు మాధ్యమం పట్ల చిన్నచూపు ఉంటే ఎలాగని, ఆ భాషపై సాధికారత ఎలా సాధించగలమని ప్రశ్నించింది. మారులు కేటాయించడానికి ఏదైనా ‘కీ’ ఉందా అని కూడా ప్రశ్నించింది. ఒక ప్రశ్నకు తెలుగు, ఇంగ్లిషు, ఉర్దూల్లో జవాబు రాసిన వారికి ఏ ప్రాతిపదికన మారులు కేటాయిస్తారు అంటూ కీలక ప్రశ్న వేసింది, తెలుగులో అనువాదం, వాస్తవ అనువాదం, స్వేచ్ఛానువాదం ఇలా రెండు రకాలు ఉంటుంది కదా దేనిని ప్రాతిపదికగా తీసుకుంటారని అడిగింది.
పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాదులు సురేందర్, విద్యాసాగర్ వాదనలు వినిపిస్తూ, పరీక్షల నిర్వహణలో అడుగడుగునా అక్రమాలు చోటుచేసుకున్నాయని చెప్పారు. చాలాచోట్ల నిబంధనలు ఉల్లంఘించారని, ఆపై నిర్దేశించిన కేంద్రాల్లో పరీక్షలు రాసిన అభ్యర్థులు ఎంపికయ్యారని తెలిపారు. అన్ని అంశాలను పరిశీలిస్తే గ్రూప్-1 పోస్టుల కోసం ఎదురుచూసిన చాలామంది మోసపోయారని అర్థమవుతున్నట్టు చెప్పారు. ప్రిలిమ్, మెయిన్‌కు హాల్‌టికెట్లు మార్చారని, ఎందుకు మార్చారో చెప్తున్న కారణాలకు పొంతన లేదని తెలిపారు. కొందరికి అనుకూలంగా సెంటర్లు వేయడం కోసమే హాల్‌టికెట్లను మార్చారని చెప్పారు.
గ్రూప్-1కు ఎంపికైన మహిళా అభ్యర్థులు 18, 19 నంబర్లతో ఉన్న కేంద్రాలు పరీక్ష రాశారని, ఈ రెండు కేంద్రాలకు మహిళా అభ్యర్థులను ఎలా ఎంపిక చేశారో, ఈ సెంటర్లు ఎందుకు, ఎలా ఇచ్చా రో, ఇందుకు ఏ నిబంధనలను అనుసరించారో చెప్పాలని న్యాయవాదులు కోరారు. మరికొన్ని చోట్ల కూడా మహిళా కాలేజీల్లో సెంటర్లు వేసినప్పటికీ అకడ పురుషులు, మహిళలు కలిసే పరీక్ష రాశారని తెలిపారు. కేవలం నాలుగంటే నాలుగు కేంద్రాల్లో పరీక్ష రాసిన అభ్యర్థులే గ్రూప్-1 పోస్టులకు అర్హత సాధించడం వెనుక ఉన్న గుట్టును, అ అభ్యర్థుల్లో ఉన్న ప్రతిభ ఏపాటిదో నిగ్గు తేల్చాలని అన్నారు. 16, 17, 18, 19 నంబరు సెంటర్లలో పరీక్ష రాసిన వారే ఎకువ శాతం అర్హత సాధించారని చెప్పారు. పక పకనే కూర్చున్న వందల మంది అభ్యర్థులకు ఒకే తీరుగా మారులు రావడం వెనుక దాగిన చిదంబర రహస్యాన్ని బట్టబయలు చేయాలని కోరారు.
‘గ్రూప్-1 పరీక్షల నోటిఫికేషన్‌ను ఇదే హైకోర్టు గతంలో రద్దుచేసింది. 2022 నోటిఫికేషన్ ప్రకారం మొత్తం ఖాళీలు 503 ఉన్నాయి. అదనంగా 60 ఖాళీల భర్తీకి ప్రభుత్వం జీవో 16 జారీచేసింది. దీంతో ఆ నోటిఫికేషన్‌ను రద్దు చేసి కొత్త పోస్టులతో కలిపి 563 పోస్టులకు తాజాగా నోటిఫికేషన్ వెలువరించింది. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెలువడకపోయినా రెండింటికీ కలిపి ఒకే నోటిఫికేషన్ జారీచేసింది. ఒక నోటిఫికేషన్‌ను రద్దు చేసే అధికారం టీజీపీఎస్సీకి లేదు’ అని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తెచ్చారు.
టీజీపీఎస్సీ ఎంపికచేసిన కొంతమందికి లబ్ధి చేకూరేలా చేసిందని న్యాయవాదులు ఆరోపించారు. ‘కేవలం 4 సెంటర్ల నుంచి ఏకంగా 162 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. 16, 17, 18, 19 సెంటర్లలో 74 శాతం మంది అర్హత సాధించారు. మిగిలిన సెంటర్లలో 5 శాతం కంటే తకువ అర్హత సాధించారు. కొన్ని సెంటర్లలో ఒకరిద్దరు కూడా అర్హత పొందలేదు. కోఠి మహిళా కళాశాల వారి అభ్యర్థన మేరకు అకడ కేవలం మహిళలనే కేటాయించామని టీజీపీఎస్సీ చెప్తున్నది. మహిళా కళాశాల అయినందున మహిళలను కేటాయించామని చెప్తున్నపుడు మిగిలిన 9 మహిళా కాలేజీల విషయంలో అదే పద్ధతిని ఎందుకు అమలు చేయలేదు? 45 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పి పోలీసు రక్షణ కోరుతూ లేఖ రాసిన టీజీపీఎస్సీ ఆ తర్వాత అదనంగా మరో సెంటర్‌ను ఎందుకు పెంచింది’ అని ప్రశ్నించారు.
మూల్యాంకనం చేసిన వాళ్ల వివరాలు పిటిషనర్ల తరఫు న్యాయవాదులకు ఎలా చేరాయని టీజీపీఎస్సీ తరఫు న్యాయవాది ప్రశ్నించారు. విద్యాశాఖ కమిషనర్, టీజీపీఎస్సీకి మాత్రమే తెలిసిన సమాచారం వాళ్లకు ఎలా చేరిందని సందేహం వ్యక్తం చేశారు. దీనిపై విచారణ చేయాలని పోలీసులను కోరాల్సిన అవసరముందని అన్నారు. మల్లిక్ అనే ప్రొఫెసర్ చేవెళ్ల ప్రభుత్వ కళాశాలలో పని చేస్తుంటే ప్రైవేట్ ఉద్యోగి అని చెప్పడం సరికాదని అన్నారు. గురువారం కూడా వాదనలు కొనసాగనున్నాయి.
తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ.. భాషల వారీగా మూల్యాంకనం చేసే వాళ్లకు జవాబు పత్రాలు ఇచ్చారా అని టీజీపీఎస్సీని హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై టీజీపీఎస్సీ న్యాయవాది రాజశేఖర్, మెయిన్ పరీక్షల ప్రశ్నలు వ్యాసం రూపంలో ఉంటాయని, వాటికి జవాబు పత్రాలు ఇవ్వడం సాధ్యంకాదని చెప్పారు. ఆయా సబ్జెక్టుల్లో నిపుణులే పేపర్లు దిద్దుతారని, వాళ్లకు జవాబుపై పూర్తి అవగాహన ఉంటుందని తెలిపారు. మూల్యాంకనం చేసే వాళ్లకు జవాబు పత్రాలు ఇవ్వాల్సిన అవసరం లేదన్న టీజీపీఎస్పీ వాదనపై కోర్టు తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేసింది. ప్రశ్నకు సూటిగా జవాబు చెప్పే విధంగా పేపర్ ఉండదు అన్న వాదనపై బెంచ్ కల్పించుకుంటూ.. ‘ఉదాహరణకు తెలంగాణ ఉద్యమం గురించి అడిగిన ప్రశ్నకు జవాబు మూసపోసినట్టుగా ఉండదు. తెలంగాణ ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైంది.. ఎప్పుడు ముగిసింది.. ఈ క్రమంలో చోటుచేసుకున్న అనేక ఘట్టాలు, అంశాలు.. వీటి గురించి జవాబు ఫలానా వరస క్రమంలో (అంశాలు/ఘట్టాలు) ఉండాలని మూల్యాంకనం చేసేవాళ్లకు తెలియాలి కదా’ అని ప్రశ్నించింది.
మూల్యాంకనం చేసేందుకు తగిన స్థాయిలో సిబ్బందిని కేటాయించలేదని న్యాయవాదులు చెప్పారు. ప్రతి ఐదు నిమిషాలకో పేపర్ మూల్యాంకనం చేయాలని వారికి చెప్పారని, సంప్రదాయ విధానంలో (డిజిటల్ కాకుండా) మూల్యాంకనం చేసిన వారిలో చాలామంది డిగ్రీ కాలేజీ లెక్చరర్లు కూడా ఉన్నారని తెలిపారు. మెయిన్ పరీక్ష రాసిన అభ్యర్థుల సంఖ్యలో కూడా తేడా ఉన్న విషయాన్ని టీజీపీఎస్సీ స్వయంగా అంగీకరించిందని చెప్పారు. పరీక్షల అనంతరం సూపరింటెండెంట్లు ఇచ్చిన సమాచారం ఆధారంగా హాజరైన అభ్యర్థుల సంఖ్యను 21,075 అని ప్రకటించినట్టు, ఆ తర్వాత జవాబు పత్రాలు ఓఎంఆర్, నామినల్ రోల్స్ మొత్తం బేరీజు వేశాక ఆ సంఖ్య 21085కు పెరిగినట్టు టీజీపీఎస్సీ ఒప్పకోవడం అంటే అక్రమాలు జరిగినట్టేనని అన్నారు. పదిమంది పెరగడం, ఎంపిక చేసిన వారే అత్యధికంగా అర్హత సాధించడం, హాల్‌టికెట్లను మార్చడం వంటివి గ్రూప్-1 పరీక్షల్లో అక్రమాలు జరిగాయని చెప్పడానికి నిలువెత్తు నిదర్శనాలు, సాక్ష్యాలు అని చెప్పారు. టీజీపీఎస్సీ అధికారిక వెబ్సైట్లో మొత్తం మారుల జాబితాను మార్చి 10న అప్లోడ్ చేసిందని, పేపర్ల వారీగా మారులను ఆ తర్వాత వారం రోజులకు అప్లోడ్ చేసిందని, ఆ తర్వాత పూర్తి వివరాలను మార్చి 30న అప్లోడ్ చేసిందని, ఇందుకు దారుణమైన అవకతవకలే కారణమని ఆరోపించారు.