హైదరాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ) : కొత్తగూడెం సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుపై దాఖలైన ఎన్నికల పిటిషన్ చట్టవ్యతిరేకమని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కే లక్ష్మణ్ సోమవారం తీర్పు వెలువరించారు. ఎన్నికల సందర్భంగా కూనంనేని సమర్పించిన అఫిడవిట్లో తన భార్య పేరు రాయలేదని, అందువల్ల ఆ ఎన్నిక చెల్లదని ప్రకటించాలన్న పిటిషనర్ నందూనాల్ అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది.
భార్య పేరు రాయకపోతే కూనంనేని ఎన్నిక చెల్లకుండా పోతుందా? అని హైకోర్టు ప్రశ్నించింది. భార్యకు చెందిన ఐదేండ్ల ఆదాయపు పన్ను రిటర్న్లు, ఆస్తులు, అప్పుల వివరాల గురించి కూనంనేని పేరొన్నారని గుర్తుచేసింది. కేవలం తన భార్య పేరు అఫిడవిట్లో వెల్లడించనంత మాత్రాన ఆయన ఎన్నిక చెల్లదని ప్రకటించలేమని స్పష్టంచేసింది.