హైదరాబాద్, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ): తనపై వివిధ సందర్భాల్లో నమోదైన క్రిమినల్ కేసుల విచారణ ఏ దశలో ఉన్నదో వివరాలు సమర్పించాలని బీజేపీ మెదక్ ఎంపీ ఎం రఘునందన్‌రావును హైకోర్టు ఆదేశించింది. రఘునందన్‌రావుకు పాస్‌పోర్ట్ నిరాకరణపై కౌంటరు దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి, ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారికి నోటీసులు ఇచ్చింది. క్రిమినల్ కేసులున్నాయని చెప్పి తన పాస్‌పోర్ట్‌ను రెన్యూవల్ చేయకపోవడం అన్యాయమని పేర్కొంటూ రఘునందన్‌రావు దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ మౌసమీ భట్టాచార్య ఇటీవల విచారణ జరిపారు. పాస్‌పోర్ట్‌ను రెన్యూవల్ చేయకపోవడం చట్టవిరుద్ధమని పిటిషనర్ తరఫు న్యాయవాది అన్నారు. క్రిమినల్ కేసులున్నంత మాత్రాన పాస్‌పోర్ట్ నిరాకరించేందుకు లేదని తెలిపారు. ప్రభుత్వం తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఎన్నికల సంఘంతోపాటు జాన్ 4న పాస్‌పోర్ట్ అధికారులకు తనపై ఉన్న కేసుల జాబితాను పిటిషనర్ స్వయంగా అందజేశారని చెప్పారు. పిటిషనర్‌పై క్రిమినల్ కేసులు ఉన్నందున పాస్‌పోర్ట్ రెన్యూవల్ నిలుపుదల సబబేనని చెప్పారు. ఇరుపక్షాల వివరణ కోరిన హైకోర్టు, తదుపరి విచారణను జనవరి 7కి వాయిదా వేసింది.