High Court | హైదరాబాద్, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ): యపజయశంకర్ భూపాలపల్లిలోని మేడిగడ్డ కుంగుబాటుపై కింది కోర్టులో ప్రైవేటు ఫిర్యాదు చేసిన వ్యక్తి మరణించిన నేపథ్యంలో ఈ వ్యవహారంపై విచారణ అవసరం లేదని హైకోర్టు అభిప్రాడింది. ఫిర్యాదుదారుడు రాజలింగమూర్తి మరణించినట్టు పత్రికల్లో వార్తలు వచ్చాయని, ఈ విషయాన్ని ఆయన తరఫు న్యాయవాది కూడా నిర్ధారణ చేస్తున్నందున ఇక విచారణకు ఆసారం లేదని స్పష్టంచేసింది. ఇందులో ప్రజాప్రయోజనం ఉంద ని, ఫిర్యాదుదారుడు మృతి చెందినప్పటికీ ఫిర్యాదులోని అంశాల ఆధారంగా విచారణ కొనసాగించాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెప్పడంతో తదుపరి విచారణ ఈ నెల 24న చేపడతామని ప్రకటించింది. మేడిగడ్డ కుంగుబాటుపై విచారణ చేపట్టాలని భూపాలపల్లి ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి తీసుకున్న నిర్ణయాన్ని నిలిపివేస్తూ గతంలో జారీచేసిన మధ్యంతర ఉత్తర్వులను మరోసారి పొడిగించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కే లక్ష్మణ్ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు.
మేడిగడ్డ కుంగుబాటు వ్యవహారంపై ప్రైవేట్ ఫిర్యాదును భూపాలపల్లిలోని మేజిస్ట్రేట్ కోర్టు గత ఏడాది జనవరి 12న కొట్టివేసింది. దీనిని సమీక్ష చేయాలని కోరుతూ నాగవల్లి రాజలింగమూర్తి దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి విచారించి ప్రతివాదులకు నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసులను మాజీ సీఎం, బీఆర్ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు, నాటి నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు హైకోర్టులో సవాలు చేశారు. జిల్లా కోర్టు తీసుకున్న నిర్ణయం చట్ట వ్యతిరేకమని ప్రకటించాలని కోరారు. ఈ కేసులో ఫిర్యాదుదారుడు సామాజిక కార్యకర్త నాగవల్లి రాజలింగమూర్తి తన వాదనలతో కౌంటర్ దాఖలు చేయాలని గత విచారణ సమయంలో హైకోర్టు నోటీసులు జారీచేసింది. ఈ వ్యాజ్యం శుక్రవారం మరోసారి విచారణకు వచ్చిన వెంటనే న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్ కల్పించుకొని, రాజలింగమూర్తి మరణించినట్టు పత్రికల్లో వచ్చిన వార్తను చదివానని చెప్పారు. ఫిర్యాదుదారుడు జీవించి లేనప్పడు ఫిర్యాదు మనుగడలో ఉండదని అన్నారు. ఇంతలో పీపీ కల్పించుకుంటూ సుప్రీంకోర్టు, కర్ణాటక హైకోర్టుల తీర్పుల ప్రకారం ఫిర్యాదుదారుడు మరణించినప్పటికీ కేసు విచారణ చేయవచ్చునన్న తీర్పుల ప్రతులను అందజేస్తామని చెప్పడంతో విచారణ వాయిదా పడింది.
చనిపోయిన వ్యక్తి తరఫున ఎలా వాదిస్తారు?
చనిపోయిన క్లయింట్ తరఫున ఎలా వాదిస్తారు అని రాజలింగమూర్తి తరఫు న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది. ఫిర్యాదుదారుడు మరణించిన నేపథ్యంలో జిల్లా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అనుమతిస్తే, విచారణ ఎలా జరుగుతుందని ప్రశ్నించింది. ప్రజాప్రయోజనంగా ఫిర్యాదును చూడాలని పీపీ చెప్పడంపై న్యా యమూర్తి జోక్యం చేసుకుంటూ.. ఫిర్యాదుదారుడు మరణించినందున కావాలంటే మళ్లీ మరో ఫిర్యాదు చేసుకోవచ్చునని సూచించా రు. రాజలింగమూర్తి ఫిర్యాదు ఆధారంగా వి చారణ కొనసాగాలని కోరేందుకు చట్ట ప్రకా రం వీల్లేదని తేల్చి చెప్పారు. తెలంగాణలో రాజలింగమూర్తి ఒకరే లేరని, నాలుగు కోట్ల మందిలో ఎవ్వరైనా పిల్ దాఖలు చేయవచ్చునని, ఈ రోజే ఇదే హైకోర్టులో పిల్ దాఖలు చేసుకోవచ్చునని చెప్పారు.
ఎవరి స్టేట్మెంట్ నమోదు చేయాలి?
జిల్లా కోర్టు ఆర్డర్ అసంబద్ధమైనదనే తాను గతంలోనే స్టే ఇచ్చినట్టు జస్టిస్ లక్ష్మణ్ చెప్పా రు. ఫిర్యాదుదారుడు జీవించి లేనప్పుడు కోర్టు ఎవరి స్టేట్మెంట్ నమోదు చేస్తుందని, ఎవరిని విచారిస్తుందని, కేసును ఎలా విచారణ చేస్తుందని ప్రశ్నించారు. ఈ దశలో మళ్లీ పీపీ కల్పించుకుని, కోట్ల రూపాయలతో నిర్మాణం జరిగిన అంశంపై రాజలింగమూర్తి ఫిర్యాదు చేశారని చెప్పబోగా న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ.. తాను కేసు మె రిట్స్లోకి వెళ్లడంలేదని, డిఫ్యాక్టో కంప్లయినెంట్(కింది కోర్టులోని ఫిర్యాదుదారుడు) మ రణించిన తర్వాత దానిపై దాఖలైన పిటిషన్‌పై విచారణ చేయాలా.. వద్దా.. అనే అంశానికి మాత్రమే పరిమితం అవుతున్నట్లు చెప్పారు. కోర్టు ఆఫీసర్‌గా మెరిట్స్ ఆధారంగా వాదనలు వినిపించాలేగానీ, సహనాన్ని పరీక్షించొద్దని అన్నారు. ఫిర్యాదుదారుడే జీవించి లేనప్పుడు కేసు విచారణలో కోర్టు ఎవరిని ప్రశ్నిస్తుంది, ఫిర్యాదులోని అంశాలపై ఎవరు వివరాలు ఇస్తారు అని నిలదీశారు.
శషభిషలు అకర్లేదు..
కేసీఆర్, హరీశ్‌రావు తరఫు న్యాయవాది టీవీ రమణారావు వాదనలు వినిపిస్తూ, మేజిస్ట్రేట్ కోర్టు ఫిర్యాదును కొట్టేస్తూ తీర్పు చెప్పినప్పటికీ జిల్లా కోర్టు అనుమతించడం చెల్లదని న్నారు. ప్రైవేట్ ఫిర్యాదుపై విచారించే పరిధి తమకు లేదంటూ మేజిస్ట్రేట్ సరైన నిర్ణయమే తీసుకున్నారన్నారు. మేజిస్ట్రేట్ తుది నిర్ణయానికి వచ్చారని, దీనిపై రివ్యూ చేసే పరిధి సెషన్స్ జడ్జికి ఉండదని చెప్పారు. ఫిర్యాదుదారుడు మరణించిన కారణంగా శషభిషలు అవసరం లేదని, జిల్లా కోర్టులోని కేసు విచారణ కొనసాగింపునకు ఏ దశలోనూ ఆసారం లేదని చెప్పారు. జిల్లా జడ్జి గత ఏడాది జూలై 10న జారీ చేసిన ఉత్తర్వులను కొట్టేయాలన్నారు.
వాయిదా వేయండి: పీపీ
ఫిర్యాదుదారు మరణించితే కేసుకు చెల్లుబాటు ఉండదని న్యాయమూర్తి అన్నారు. ఇందుకు అనుగుణంగా ఉత్తర్వులను జారీ చేస్తుండగా.. పీపీ కల్పించుకుంటూ విచారణను వాయిదా వేయాలని కోరారు. ఫిర్యాదుదారుడు జీవించి లేకపోయినప్పటికీ కేసు మనుగడలోనే ఉంటుందని సుప్రీంకోర్టు, కర్ణాటక హైకోర్టుల తీర్పులను ఉదహరించేందుకు గడువు ఇవ్వాలని కోరారు. ఇందుకు అనుమతించిన న్యాయమూర్తి విచారణను 24వ తేదీకి వాయిదా వేశారు.